పాండ్యా మెరుపులతో... బుమ్రా మలుపుతో... | India Beat Australia by 13 Runs in Canberra as the Three-Match ODI Series | Sakshi
Sakshi News home page

పాండ్యా మెరుపులతో... బుమ్రా మలుపుతో...

Published Thu, Dec 3 2020 1:06 AM | Last Updated on Thu, Dec 3 2020 5:33 AM

India Beat Australia by 13 Runs in Canberra as the Three-Match ODI Series  - Sakshi

మ్యాక్స్‌వెల్‌ను అవుట్‌ చేశాక బుమ్రాకు సహచరుల అభినందన

వరుస సెంచరీలు, శతక భాగస్వామ్యాలు, భారీ స్కోర్లతో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియాను ఆఖరి వన్డేలో భారత్‌ ఆల్‌రౌండ్‌ దెబ్బకొట్టింది. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా వీరోచిత పోరాటం, రవీంద్ర జడేజా సందర్భోచిత మెరుపులు భారత్‌కు పోరాడేందుకు సాయపడితే... బౌలింగ్‌లో బుమ్రా అద్భుతమైన మలుపు ఆసీస్‌ గెలుపు బాటనే కాదు... ఈ సిరీస్‌లోనే జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. 
 
కాన్‌బెర్రా: ఇది ఒకరితో దక్కిన విజయం కాదు. అలాగని ఇదేమీ ఊరట గెలుపు కాదు. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని, బ్యాటింగ్‌ బలాన్ని బద్దలు కొట్టిన విజయం. రెండు వన్డేల్లోనూ 370 పైచిలుకు పరుగులు చేసి కూడా చెమటోడ్చిన ఆసీస్‌ను... భారత్‌ కేవలం 302 పరుగులు చేసి నిలువరించడం గొప్ప విషయం. సిరీస్‌ చేజారినా ఇక్కడ బ్యాటింగ్‌... బౌలింగ్‌... ఆతిథ్య జట్టును పెట్టించిన ‘కంగారూ’ అంతా ఇంత కాదు. క్లీన్‌స్వీప్‌ తప్పించి శుక్రవారం ఇక్కడే జరిగే తొలి టి20 మ్యాచ్‌కు ముందు భారత్‌కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన విజయం ఇది.
 

ఆసీస్‌ లక్ష్యం 303. గత మ్యాచ్‌ల భారీస్కోర్ల దృష్ట్యా, స్మిత్‌ వరుస సెంచరీల ఫామ్‌ దృష్ట్యా ఆతిథ్య జట్టుకు ఇదేమాత్రం కష్టం కానేకాదు. అయితే 158 పరుగులకే 5 వికెట్లు కోల్పో వడంతో భారత్‌కు విజయం ఖాయమవుతున్న తరుణంలో మ్యాక్స్‌వెల్‌ ధాటిగా ఆడిన ఇన్నింగ్స్‌ ఆసీస్‌ను 268/6 దాకా తీసుకెళ్లింది. ఇక 34 బంతుల్లో 35 పరుగుల విజయ సమీకరణం భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేలా కనిపించింది. కానీ బుమ్రా వేసిన 45వ ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మ్యాక్స్‌వెల్‌ను ఔట్‌ చేయడంతో 268 పరుగుల వద్ద ఏడో వికెట్‌ పడింది.

తర్వాత టెయిలెండర్లు 21 పరుగుల వ్యవధిలోనే నిష్క్రమించడంతో ఆసీస్‌ ఆలౌటైంది. భారత్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఆసీస్‌ సిరీస్‌ను 2–1తో గెల్చుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (76 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. తర్వాత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఫించ్‌ (82 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్‌ (38 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. శార్దుల్‌ 3 వికెట్లు, బుమ్రా, నటరాజన్‌ రెండేసి వికెట్లు తీశారు.  

కోహ్లి అర్ధ సెంచరీ...
భారత ఓపెనర్లలో ధావన్‌ (16) నిరాశపర్చగా, శుబ్‌మన్‌ గిల్‌ (33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. తర్వాత కోహ్లి (78 బంతుల్లో 63; 5 ఫోర్లు) బాధ్యతగా ఆడాడు. కానీ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైన ఈ పిచ్‌పై రన్‌రేట్‌ జోరందుకోలేదు. అయ్యర్‌ (19), రాహుల్‌ (5) చేతులెత్తేశారు. కోహ్లి 32వ ఓవర్లో 152 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఈ దశలో పాండ్యా, జడేజా జోడీ అదరగొట్టింది. ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించడంతో భారత్‌ స్కోరు 300 దాటింది.   

భయపెట్టిన మ్యాక్స్‌వెల్‌...
అరంగేట్రం చేసిన నటరాజన్, జట్టులోకి వచ్చిన శార్దుల్‌ ఆసీస్‌ టాపార్డన్‌ను ఇబ్బంది పెట్టారు. వారి బౌలింగ్‌లో లబ్‌షేన్‌ (7), స్మిత్‌ (7) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైనా మరో ఓపెనర్‌ ఫించ్‌ చక్కని ఇన్నింగ్స్‌తో విజయానికి అవసరమైన పరుగులు జతచేశాడు. వరుస విరామాల్లో హెన్రిక్స్‌ (22), గ్రీన్‌ (21), క్యారీ (38) ఔట్‌ కావడంతో భారత శిబిరంలో ఆశలు రేగాయి. కానీ మ్యాక్స్‌వెల్‌ చెలరేగడంతో ఆసీస్‌ ఒక్కసారిగా లక్ష్యానికి చేరువైంది. ఈ దశలో బుమ్రా చక్కని డెలివరీతో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇది మ్యాచ్‌ను అనూహ్య మలుపు తిప్పింది. భారత్‌ను విజేతగా మార్చింది. స్మిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) అగర్‌ (బి) అబాట్‌ 16; శుబ్‌మన్‌ గిల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్‌ 33; కోహ్లి (సి) క్యారీ (బి) హజల్‌వుడ్‌ 63; అయ్యర్‌ (సి) లబ్‌షేన్‌ (బి) జంపా 19; రాహుల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్‌ 5; పాండ్యా (నాటౌట్‌) 92; జడేజా (నాటౌట్‌) 66; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 302.
వికెట్ల పతనం: 1–26, 2–82, 3–114, 4–123, 5–152.
బౌలింగ్‌: హజల్‌వుడ్‌ 10–1–66–1, మ్యాక్స్‌వెల్‌ 5–0–27–0, అబాట్‌ 10–0–84–1, గ్రీన్‌ 4–0–27–0, అగర్‌ 10–0–44–2, జంపా 10–0–45–1, హెన్రిక్స్‌ 1–0–7–0.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: లబ్‌షేన్‌ (బి) నటరాజన్‌ 7; ఫించ్‌ (సి) ధావన్‌ (బి) జడేజా 75; స్మిత్‌ (సి) రాహుల్‌ (బి) శార్దుల్‌ 7; హెన్రిక్స్‌ (సి) ధావన్‌ (బి) శార్దుల్‌ 22; గ్రీన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 21; క్యారీ (రనౌట్‌) 38; మ్యాక్స్‌వెల్‌ (బి) బుమ్రా 59; అగర్‌ (సి) కుల్దీప్‌ (బి) నటరాజన్‌ 28; అబాట్‌ (సి) రాహుల్‌ (బి) శార్దుల్‌ 4; జంపా (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 4; హజల్‌వుడ్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్‌) 289.
వికెట్ల పతనం: 1–25, 2–56, 3–117, 4–123, 5–158, 6–210, 7–268, 8–278, 9–278, 10–289.
బౌలింగ్‌: బుమ్రా 9.3–0–43–2, నటరాజన్‌ 10–1–70–2, శార్దుల్‌ 10–1–51–3, కుల్దీప్‌ 10–0–57–1, జడేజా 10–0–62–1.

వన్డే సిరీస్‌ ట్రోఫీతో ఆస్ట్రేలియా జట్టు


జడేజా, హార్దిక్‌ పాండ్యా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement