సిడ్నీ: ఈ సిరీస్‌లో జరిగిన రెండు టెస్టులు ఆఖరి రోజు దాకా సాగనేలేదు. ఐదో రోజు బంతి గమనం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అయితే ఆసీస్ పేస్ బలం పదునుగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌ను శాసించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్లను తీసి పట్టు బిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో మన బ్యాట్స్‌మెన్ పోరాటం బహుదూరపు లక్ష్యానికి ఎలా చేరువవుతుందో మరి! క్రీజులో ఉన్న చతేశ్వర్ పుజారా (29 బంతుల్లో 9 బ్యాటింగ్; 1 ఫోర్), కెప్టెన్ అజింక్యా రహానే (14 బంతుల్లో 4 బ్యాటింగ్)ల భాగస్వామ్యం చివరి రోజు తొలి సెషన్‌లో కీలకం కానుంది. ఈ జోడీకి సోమవారం ఉదయం సెషన్‌లోనే చుక్కెదురైతే మాత్రం భారత్ పరాజయాన్ని... ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యాన్ని... ఎవరూ అడ్డుకోలేరు.
ఇదీ ఈ టెస్టు సంగతీ!
భారత్ ముందు ఆస్ట్రేలియా 407 పరుగుల కఠిన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (98 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (64 బంతుల్లో 31; 4 ఫోర్లు) కాసేపు ఓపిగ్గా ఆడారు. ప్రత్యర్థి పేస్ బౌలింగ్‌ను చక్కగానే ఎదుర్కొన్నారు. 71 పరుగుల దాకా సాఫీగా సాగిపోయిన రెండో ఇన్నింగ్స్‌ను మొదట హాజల్‌వుడ్, కాసేపటికే కమిన్స్ కుదిపేశారు. దీంతో భారత్ వంద పరుగులలోపే ఓపెనర్లిద్దరినీ కోల్పోయి కష్టాల్లో పడింది.
కుదురుగా ఆడుతున్న గిల్‌ను హాజల్‌వుడ్, అర్ధసెంచరీ సాధించిన రోహిత్ శర్మను కమిన్స్ ఔట్ చేశారు. ఇప్పుడైతే చేతిలో 8 వికెట్లున్నా... గాయపడిన రవీంద్ర జడేజా బ్యాట్ పట్టలేని పరిస్థితి. మిగతా బౌలర్లను తీసేస్తే స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ నలుగురే చేతిలో ఉన్నారు. కానీ ఇంకా భారత్ చేయాల్సినవి 309 పరుగులు. చివరిరోజు ఎదుర్కోవాల్సిన ఓవర్లు 90. రోజంతా ఆడినా టెస్టుల్లో 309 పరుగులు చేయడం కష్టమే. క్రీజులో నిలబడితే ‘డ్రా’ అవుతుందేమో తప్ప... భారత్ విజయానికి చేరువ కాలేనంత దూరంలోనే ఉంది.
ముగ్గురు ఫిఫ్టీ...
తొలి ఇన్నింగ్స్‌లో చితగ్గొట్టిన లబ్‌షేన్, స్మిత్‌లు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌కు మింగుడు పడని స్కోర్లే చేశారు. వీళ్లిద్దరితో పాటు కామెరాన్ గ్రీన్ కూడా అర్ధశతకం సాధించడంతో భారత లక్ష్యం కొండంత అయ్యింది. ఆదివారం ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 103/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 312 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ (118 బంతుల్లో 73; 9 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (167 బంతుల్లో 81; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించాక... లబ్‌షేన్ ఔటయ్యాడు. జట్టు స్కోరు 138 పరుగుల వద్ద నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి అతను నిష్క్రమించాడు.
మరో 10 పరుగులు జతయ్యాక మాథ్యూ వేడ్ (4)ను సైనీనే పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన గ్రీన్, అక్కడే పాతుకుపోయిన స్మిత్ జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. కాసేపటికే స్మిత్‌ను అశ్విన్ ఎల్బీగా పంపించాడు. తర్వాత కూడా భారత్‌కు పట్టుచిక్కలేదు. గ్రీన్ (132 బంతుల్లో 84; 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు కెప్టెన్ పైన్ (52 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) టీమిండియా బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కొన్నారు. వీరిద్దరి మధ్య 104 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. దీంతో ఆతిథ్య జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. బుమ్రా... గ్రీన్‌ను ఔట్ చేయడంతో జట్టు స్కోరు 312 పరుగుల వద్ద కెప్టెన్ పైన్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యంతో భారత చేదించాల్సిన లక్ష్యం కాస్త 400 పరుగులను దాటింది.
► అత్యధికసార్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీతోపాటు అర్ధసెంచరీ కూడా చేసిన బ్యాట్స్‌మన్‌గా జాక్వస్ కలిస్ (11 సార్లు–దక్షిణాఫ్రికా) పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ (11 సార్లు) సమం చేశాడు. రికీ పాంటింగ్ (10 సార్లు–ఆస్ట్రేలియా) రెండో స్థానంలో నిలిచాడు.
► విదేశీ గడ్డపై టెస్టులోని నాలుగో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 17 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2006లో వెస్టిండీస్‌తో సెయింట్ కిట్స్‌లో జరిగిన టెస్టులో సెహ్వాగ్–వసీమ్ జాఫర్ జంట తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించింది.
► టెస్టు ఇన్నింగ్స్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అత్యధికంగా నాలుగు క్యాచ్‌లు తీసుకోవడం ఇది రెండోసారి. 2001లో బంగ్లాదేశ్‌తో టెస్టులో యూనిస్ ఖాన్ (పాక్) నాలుగు క్యాచ్‌లు... తాజా సిడ్నీ టెస్టులో భారత సబ్‌స్టిట్యూట్ కీపర్ సాహా నాలుగు క్యాచ్‌లు పట్టారు.
► కష్టాలన్నీ భారత్‌నే చుట్టుముట్టాయి. కొండంత లక్ష్యం... ఓపెనర్ల నిష్క్రమణ... జడేజా బ్యాట్ పట్టలేని స్థితి. 90 ఓవర్లు ఎదుర్కొనేందుకు స్కోరు బోర్డుపై 8 వికెట్లు కనబడుతున్నా... స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అందులో సగమే (నలుగురే). క్లిష్టమైన ఎదురీత ఎందాక సాగుతుందో నేటి ఉదయం సెషన్ గడిస్తేగానీ తెలియదు. ఆఖరి రోజంతా ఆడే సత్తా, భారీ భాగస్వామ్యం, క్రీజులో పాతుకుపోయే బ్యాట్స్‌మెన్ ఉంటే టీమిండియా కనీసం ‘డ్రా’తోనైనా గట్టెక్కవచ్చు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338;
భారత్ తొలి ఇన్నింగ్స్: 244;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 13; పకోవ్‌స్కీ (సి) సబ్–సాహా (బి) సిరాజ్ 10; లబ్‌షేన్ (సి) సబ్–సాహా (బి) 73; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 81; వేడ్ (సి) సబ్–సాహా (బి) సైనీ 4; గ్రీన్ (సి) సబ్–సాహా (బి) బుమ్రా 84; పైన్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 8;
మొత్తం (87 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్ ) 312
వికెట్ల పతనం: 1–16, 2–35, 3–138, 4–148, 5–208, 6–312.
బౌలింగ్: బుమ్రా 21–4–68–1, సిరాజ్ 25–5–90–1, సైనీ 16–2–54–2, అశ్విన్ 25–1–95–2.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) కమిన్స్ 52; శుబ్‌మన్ గిల్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 31; పుజారా (బ్యాటింగ్) 9; రహానే (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 2;
మొత్తం (34 ఓవర్లలో 2 వికెట్లకు) 98.
వికెట్ల పతనం: 1–71, 2–92.
బౌలింగ్: స్టార్క్ 6–0–27–0, హాజల్‌వుడ్ 8–3–11–1, కమిన్స్ 9–1–25–1, లయన్ 9–3–22–0, గ్రీన్ 2–0–12–0.
Comments
Please login to add a commentAdd a comment