![Rohit Sharma Says Have No Regrets On His Dismissal At The Gabba On Day 2 - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/17/ROHIT-1601835.jpg.webp?itok=ZvgoraLp)
‘ఎందుకు, ఎందుకలా? నేను నమ్మలేకపోతున్నా. ఇది చాలా బాధ్యతారాహిత్యమైన షాట్. లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్లు ఉన్నారు. రెండు బంతుల ముందే ఫోర్ కొట్టిన తర్వాత అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది. దీనికి ఎలాంటి సాకులు కూడా చెప్పడానికి లేదు. అతి సునాయాస క్యాచ్. అలాంటివి వదిలేసే ఫీల్డర్ (స్టార్క్) కూడా కాదు. తన వికెట్‌ను బహుమతిగా ఇచ్చేశాడు. ఒక వికెట్ వృథా అయిపోయింది. ఇది టెస్టు మ్యాచ్. మంచి ఆరంభం తర్వాత దానిని భారీగా మలచాలి గానీ ఇలా కాదు’... రెండో రోజు రోహిత్ శర్మ అవుటైన తీరుపై దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన తీవ్ర వ్యాఖ్య ఇది. పలువురు మాజీలు కూడా ఇదే రకంగా తమ అసంతృప్తిని ప్రదర్శించారు. రోహిత్ ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మ్యాచ్‌ను శాసించే భారీ ఇన్నింగ్స్‌కు సిద్ధమైనట్లుగా కనిపించాడు. కానీ అతను అనూహ్యంగా వెనుదిరగడం భారత్‌ను ఆత్మరక్షణలో పడేసింది.
అయితే ఈ విమర్శలకు రోహిత్ తనదైన శైలిలో బలంగా బదులిచ్చాడు. ‘నేను అవుటైన తీరు పట్ల ఎలాంటి బాధా లేదు. ఇలా ఆడటాన్నే నేను ఇష్టపడతాను. ఈ సిరీస్‌లో పరుగులు చేయడానికి ఇరు జట్లు ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూస్తున్నాం. కుదురుకున్న తర్వాత బౌలర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తా. జట్టులో నాకు అప్పగించిన పని కూడా అదే. ఎవరో ఒకరు ఆ పని చేయాల్సిందే కదా. ఈ క్రమంలో తప్పులు కూడా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. నేను ఆడిన షాట్‌లు కూడా మా ప్రణాళికల్లో భాగమే. కాబట్టి ఆ షాట్ విషయంలో పశ్చాత్తాపం చెందడం లేదు. లయన్ తెలివిగా బంతిని వేయడం వల్ల నేను కొట్టిన షాట్‌కు బంతి అనుకున్నంత దూరం వెళ్లలేదు’ అని రోహిత్ తన మాటను స్పష్టంగా చెప్పాడు.
గతంలోనూ తాను ఈ తరహా షాట్లను సమర్థంగా ఆడిన విషయాన్ని భారత ఓపెనర్ గుర్తు చేశాడు. ‘ఈ షాట్ ఎక్కడి నుంచో అనూహ్యంగా రాలేదు. గతంలో చాలాసార్లు ఆడాను కాబట్టి ఎప్పుడైనా ఆడగలనని నాపై నాకు నమ్మకముంది. తర్వాత చూస్తే తప్పుడు షాట్‌లాగా అనిపించవచ్చని ఒప్పుకుంటాను. కానీ ఇలాంటివి ఆడినప్పుడు కొన్నిసార్లు అవుట్ కావచ్చు. కొన్నిసార్లు బౌండరీ బయట బంతి పడవచ్చు. ఇక ముందూ వాటిని ఆడతాను. రెండు టెస్టులు క్వారంటైన్‌లో ఉండి చూశాను. ఇంత పదునైన, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఏదో ఒక దారి వెతకడం గురించే ఆలోచించేవాడిని. ఎవరైనా చివరకు పరుగులు చేయడమే ముఖ్యం. ఇలా దూకుడు ప్రదర్శించి పరుగులు రాబడితే ప్రత్యర్థి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నా. నేను అవుటైన బంతి ముందు వరకు నేను ఆడిన ఆట నాకు చాలా నచ్చింది. ఆ బంతి వరకు అంతా నేను అనుకున్నట్లే సాగింది’ అని తన ఆటను రోహిత్ విశ్లేషించాడు.
Comments
Please login to add a commentAdd a comment