సమం చేస్తారా.. సమర్పిస్తారా! | india vs Sri Lanka 3rd ODI on August 7 | Sakshi
Sakshi News home page

సమం చేస్తారా.. సమర్పిస్తారా!

Published Wed, Aug 7 2024 12:04 AM | Last Updated on Wed, Aug 7 2024 10:03 AM

india vs Sri Lanka 3rd ODI on August 7

నేడు శ్రీలంకతో భారత్‌ మూడో వన్డే

టీమిండియా గెలిస్తే సిరీస్‌ సమం

ఓడిపోతే సిరీస్‌ శ్రీలంక వశం

మధ్యాహ్నం గం. 2:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

కొలంబో: టి20 సిరీస్‌ను సులువుగా గెలుచుకున్న టీమిండియాకు వన్డే సిరీస్‌ గెలుపు కూడా లాంఛనమే అనిపించింది. కానీ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లితో ఉన్న పూర్తిస్థాయి టీమిండియాకు వన్డేల్లో ఎవరూ ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి. తొలి వన్డేను గెలుపు మెట్టుపై ‘టై’ చేసుకున్న రోహిత్‌ బృందం రెండో మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 97/0తో పటిష్టస్థితిలో ఉండి కూడా... లంక స్పిన్‌ మాయాజాలానికి అనూహ్యంగా కుప్పకూలింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఆలౌటైంది. 

బంతులు మాత్రం మిగిలిపోయాయి. అంటే మన బ్యాటర్లు క్రీజులో నిలువడమే కష్టమైపోతోంది. కోహ్లి, రాహుల్‌లాంటి సీనియర్లపై కూడా ఆతిథ్య స్పిన్‌ బౌలింగ్‌ ఆధిపత్యం చలాయిస్తోంది. ఇది జట్టును కలవరపెడుతోంది. మరోవైపు 1–0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న శ్రీలంక ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఆఖరి పోరులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.  

మన బ్యాట్‌లకు పని చెప్పాల్సిందే! 
ఈ పర్యటనలో భారత్‌ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లాడింది. మూడు టి20లు సహా, గత రెండు వన్డేల్లోనూ బౌలర్లు ప్రతాపం చూపారు. కానీ బ్యాటర్లే ఆ రేంజ్‌లో రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా వన్డేల్లో చక్కని శుభారంభాలు వచి్చనా... కెపె్టన్‌ రోహిత్‌ శర్మ ధాటైన బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని సులువుగా మారుస్తున్నా... తర్వాత వచి్చ న బ్యాటర్లు మిగిలిన లక్ష్యాన్ని ఛేదించలేకపోవడమే పెద్ద సమస్యగా మారింది.

దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఖరి పోరులో తమ బ్యాటింగ్‌ దళాన్ని సన్నద్ధం చేస్తోంది. రోహిత్‌ ఆడినట్లే టాపార్డర్‌లో కోహ్లి, మిడిలార్డర్‌లో కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ ఏ కాస్తోకూస్తో ఆడినా... కొన్ని ఓవర్లు క్రీజులో పాతుకుపోయినా ఎంతటి స్పిన్నయినా తుత్తునీయలు చేయొచ్చు.  

జోరు మీదున్న లంక 
టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌తో పల్లెకెలెలో పోగొట్టుకున్న పరువును కొలంబోలో కొల్లగొట్టాలని ఆతిథ్య శ్రీలంక పట్టుదలతో ఉంది. చక్కగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై బౌలర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పటిష్టమైన ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ను తేలిగ్గా కూల్చేస్తున్నారు. పైగా 1–0తో ఉన్న శ్రీలంక ఇప్పుడు సిరీస్‌ కోల్పోలేని స్థితిలో ఉంది. 

ఒత్తిడేమో భారత్‌పై ఉంది. దీన్ని సది్వనియోగం చేసుకొని తమ స్పిన్‌తో తిప్పేయాలని వాండెర్సే, అసలంక పిడికిలి బిగిస్తున్నారు. కొలంబో వేదికపై లక్ష్యఛేదన మ్యాచ్‌ సాగేకొద్దీ కష్టతరమవుతోంది కాబట్టి టాస్‌ గెలిస్తే మాత్రం మరో మాటకు తావులేకుండా ఏ జట్టయినా బ్యాటింగే ఎంచుకోవడం ఖాయం. 

పిచ్, వాతావరణం 
కొలంబో పిచ్‌ స్పిన్‌కు స్వర్గధామం. దీనివల్లే ఆతిథ్య స్పిన్నర్లు చెలరేగుతున్నారు. బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిందే! వర్ష సూచన ఉన్నా... మ్యాచ్‌కైతే ఇబ్బంది ఉండకపోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement