విశాఖ: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శతకం సాధించడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే సెంచరీలను సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. ఫలితంగా దక్షిణాఫ్రికా(2015)లో రెండేళ్ల క్రితం సాధించిన 18 వన్డే సెంచరీల రికార్డును బ్రేక్ చేసింది. 2015లో సఫారీలు 18 వన్డే సెంచరీలు సాధించి ఒకనాటి టీమిండియా రికార్డును సమం చేశారు. 1998లో తొలిసారి 18 వన్డే శతకాల్ని భారత్ జట్టు సాధించగా, ఆపై 19 ఏళ్ల తర్వాత ఆ మార్కును సవరించింది.
ఈ మ్యాచ్‌లో ధావన్ సెంచరీతో అత్యధిక శతకాల మార్కును చేరింది. ఇది ధావన్ కెరీర్‌లో 12వ వన్డే సెంచరీ కాగా, ఈ ఏడాది అతనికి మూడో వన్డే శతకం. ఇదిలా ఉంచితే, 2017లో భారత్ జట్టు వన్డేల్లో సాధించిన సెంచరీల్లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఆరు సెంచరీలు చేయగా, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఆరు సెంచరీలు సాధించాడు. ఇక అజింక్యా రహానే, కేదర్ జాదవ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు తలో ఒక సెంచరీలు చేశారు. ఫలితంగా 19 సెంచరీలతో కొత్త రికార్డును నెలకొల్పింది.19 ఏళ్ల క్రితం భారత్ జట్టు తొలిసారి 18 వన్డే సెంచరీలు ఖాతాలో వేసుకుంది. ఆ ఏడాది సచిన్ టెండూల్కర్ విశేషంగా రాణించి తొమ్మిది సెంచరీలు నమోదు చేశాడు. ఫలితంగా ఆ క్యాలెండర్ ఇయర్‌లో 18 సెంచరీలను భారత్ నమోదు చేసి కొత్త రికార్డు లిఖించింది. కాగా, రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా ఆ రికార్డును సమం చేసింది.మరొకవైపు వన్డే చరిత్రలో ఒక క్యాలండర్ ఇయర్‌లో పది, అంతకుపైగా సెంచరీలను నమోదు చేయడం భారత్ జట్టుకు ఇది పదోసారి.
Comments
Please login to add a commentAdd a comment