రోహిత్ శర్మ, టి20 సిరీస్ ట్రోఫీతో భారత ఆటగాళ్ల కేరింత
ఇంగ్లండ్ గడ్డపై ఇండియా అదరగొట్టింది. లక్ష్యం ఎంతటిదైనా తమ ముందు దిగదుడుపే అని మరోసారి నిరూపించింది. బలమైన ఇంగ్లండ్ అంటూ వినిపించిన మాటలను తేలిగ్గా తీసిపారేసినట్లుగా చివరి టి20లో సునాయాస విజయంతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రోహిత్ శర్మ, అంతర్జాతీయ టి20ల్లో మూడో సెంచరీతో మెరిసిన వేళ టీమిండియా 199 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కోహ్లి సమయోచిత బ్యాటింగ్, పాండ్యా మెరుపులు భారత్ పనిని సులువుగా మార్చేశాయి. ఇక గురువారం నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సమరానికి తెర లేవనుంది.
బ్రిస్టల్: భారీ అంచనాలతో ఇంగ్లండ్‌లో దిగిన భారత్ తొలి దశలో దానిని నిలబెట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 2–1తో గెలుచుకొని సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి టి20లో భారత్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బట్లర్ (21 బంతుల్లో 34; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. పాండ్యాకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (56 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కోహ్లి (29 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచారు. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా దక్కింది.
ఓపెనర్ల విధ్వంసం...
ఎప్పటిలాగే ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. రాయ్, బట్లర్ తమదైన శైలిలో దూకుడుగా ఆడటంతో భారత బౌలర్లు లయ తప్పారు. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దీపక్ చహర్ వేసిన తొలి ఓవర్లో బట్లర్ మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఉమేశ్ ఓవర్లో రాయ్ 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగాడు. పాండ్యా వేసిన ఆరో ఓవర్లో రాయ్ వరుసగా 4, 4, 6, 6 కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 73 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు బట్లర్‌ను బౌల్ట్ చేసి కౌల్ ఈ జోడీని విడగొట్టాడు. వీరిద్దరు 47 బంతుల్లోనే 94 పరుగులు జత చేయడం విశేషం. ఆ తర్వాత రాయ్‌ను అవుట్ చేసి చహర్ తన తొలి వికెట్ అందుకున్నాడు. అనంతరం హేల్స్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.
13 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 132 పరుగులకు చేరింది. ఈ దశలో పాండ్యా వేసిన ఓవర్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి బంతికి మోర్గాన్ (6)ను ఔట్ చేసిన పాండ్యా, చివరి బంతికి హేల్స్ ఆట ముగించాడు. ఆ తర్వాత స్టోక్స్ (14), బెయిర్ స్టో (14 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అడపాదడపా కొన్ని మెరుపు షాట్లు ఆడినా... ఆరంభంలో కనబర్చిన దూకుడును ఇంగ్లండ్ చూపలేకపోయింది. వీరిద్దరు కూడా పాండ్యా బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. చివరి ఓవర్లో కూడా ఇంగ్లండ్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఒక దశలో కనీసం 230 పరుగులు చేసేలా కనిపించిన జట్టు... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చివరకు 200 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. తన తొలి ఓవర్లో 22 పరుగులిచ్చిన పాండ్యా, తర్వాతి 3 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.
రోహిత్ ఒంటిచేత్తో...
లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే శిఖర్ ధావన్ (5) వికెట్ కోల్పోయింది. వేగంగా ఆడబోయిన రాహుల్ (10 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా జోర్డాన్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అయితే మరోవైపు రోహిత్ దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ దూసుకుపోయింది. తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్సర్‌గా మలిచి ఖాతా తెరిచిన రోహిత్ ఇన్నింగ్స్ ఆసాంతం స్వేచ్ఛగా ఆడాడు. ఎక్కడా అతని షాట్లలో తడబాటు కనిపించలేదు. ప్రతీ ఇంగ్లండ్ బౌలర్‌ను అతను అలవోకగా ఎదుర్కొన్నాడు. జోర్డాన్ ఓవర్లో ఫోర్, 2 సిక్సర్లతో ధాటిని పెంచిన అతను 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు.
వీరిద్దరు మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. జోర్డాన్ రిటర్న్ క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగినా, అప్పటికే భారత్ విజయం దిశగా సాగుతోంది. రోహిత్‌కు పాండ్యా జత కలిసిన తర్వాత గెలుపు సునాయాసమైపోయింది. 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ తర్వాతి 16 బంతుల్లోనే ఆట ముగించేసింది. బాల్ వేసిన 17వ ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాగా, విల్లీ వేసిన 18వ ఓవర్లో పాండ్యా ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టాడు. రోహిత్ కూడా మరో ఫోర్ బాదడంతో 20 పరుగులు లభించాయి. జోర్డాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రోహిత్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్‌తో పాండ్యా గెలిపించాడు.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ధోని (బి) చహల్ 67; బట్లర్ (బి) కౌల్ 34; హేల్స్ (సి) ధోని (బి) పాండ్యా 30; మోర్గాన్ (సి) ధోని (బి) పాండ్యా 6; స్టోక్స్ (సి) కోహ్లి (బి) పాండ్యా 14; బెయిర్ స్టో (సి) ధోని (బి) పాండ్యా 25; విల్లీ (బి) ఉమేశ్ 1; జోర్డాన్ (రనౌట్) 3; ప్లంకెట్ (సి) ధోని (బి) కౌల్ 9; రషీద్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 198.
వికెట్ల పతనం: 1–94; 2–103; 3–134; 4–140; 5–177; 6–181; 7–183; 8–194; 9–198.
బౌలింగ్: దీపక్ చహర్ 4–0–43–1; ఉమేశ్ 4–0–48–1; కౌల్ 4–0–35–2; పాండ్యా 4–0–38–4; చహల్ 4–0–30–0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 100; ధావన్ (సి) బాల్ (బి) విల్లీ 5; రాహుల్ (సి) జోర్డాన్ (బి) బాల్ 19; కోహ్లి (సి అండ్ బి) జోర్డాన్ 43; పాండ్యా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 201.
వికెట్ల పతనం: 1–21; 2–62; 3–151.
బౌలింగ్: విల్లీ 3–0–37–1; బాల్ 3–0–39–1; జోర్డాన్ 3.4–0–40–1; ప్లంకెట్ 3–0–42–0; స్టోక్స్ 2–0–11–0; రషీద్ 4–0–32–0.
► 3 అంతర్జాతీయ టి20ల్లో రోహిత్ సెంచరీల సంఖ్య. కొలిన్ మున్రో (న్యూజిలాండ్) మాత్రమే 3 సెంచరీలు సాధించాడు.
► 5 ఒకే ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్ ధోని. అయితే ఐదుగురిని ఔట్ చేసిన కీపర్లలో షహజాద్ (అఫ్గానిస్తాన్) కూడా ఉన్నాడు. అతను 3 క్యాచ్‌లు పట్టి, 2 స్టంపింగ్‌లు చేశాడు.
► 76 భారత్ తరఫున టి20లు ఆడిన 76వ ఆటగాడు దీపక్ చహర్
► 8 భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లు. అన్నింటిలోనూ విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment