![India vs England 2nd ODI: Rohit Sharma hits century as India surge to ODI series victory over England](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/ROHIT_7630.jpg.webp?itok=a3G99V1M)
రెండో వన్డేలో 4 వికెట్లతో ఇంగ్లండ్‌పై టీమిండియా గెలుపు
రోహిత్ సూపర్ సెంచరీ రాణించిన గిల్, అయ్యర్, జడేజా
భారీ స్కోరు చేసినా బట్లర్ బృందానికి నిరాశ
డకెట్, రూట్ అర్ధశతకాలు వృథా
12న అహ్మదాబాద్‌లో ఆఖరి వన్డే
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత శిబిరానికి గొప్ప శుభవార్త! క్రికెట్‌ను శ్వాసించే అభిమానులకు కచ్చితంగా ఇది తీపి కబురు! ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి వచ్చాడు. అట్లాంటి... ఇట్లాంటి... ఆటతో కాదు. 300 పైచిలుకు పరుగుల వేటలో భారత్ ఉండగా... తనశైలి రో‘హిట్స్’తో అలరిస్తూ, లక్ష్యాన్ని కరిగిస్తూ, శతకంతో కదంతొక్కాడు. అతని జోరుకు మైదానం హోరెత్తింది. పెద్ద లక్ష్యమే అయినా చిన్నబోయింది. ఇంకో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్ కూడా టీమిండియా వశమైంది.
కటక్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు విఫలమైనా... తక్కువ స్కోరుకు అవుటైనా... విమర్శకులు ఈ మధ్య నెట్టింట తెగ విరుచుకుపడుతున్నారు. ఆదివారం ‘హిట్‌మ్యాన్’ విరుచుకుపడ్డాడు. నోటితో కాదు... బ్యాట్‌తో! నెట్‌లో కాదు... మైదానంలో! అద్భుతమైన సెంచరీతో కొండంత లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించేలా చేశాడు. దీంతో ఆఖరి పోరు మిగిలుండగానే వన్డే సిరీస్ కూడా భారత్ చేతికి చిక్కింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. బ్యాట్ గర్జిస్తున్న వేళ భారత బౌలర్లంతా పరుగులు సమరి్పంచుకుంటే... రవీంద్ర జడేజా (10–1–35–3) మాత్రం పూర్తి కోటా వేసి వికెట్లు తీసి పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. అనంతరం
కఠినమైన లక్ష్యమే అయినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ రోహిత్ (90 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) వీరోచిత శతకంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరూ కెపె్టన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. చివరిదైన మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
డకెట్, రూట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ
ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (26; 2 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. డకెట్ 36 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. అతడు అవుటయ్యాక రూట్, హ్యారీ బ్రూక్ (31; 3 ఫోర్లు, 1సిక్స్) నింపాదిగా ఆడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆద్యంతం సాఫీగా సాగిపోయింది. రూట్ 60 బంతుల్లో తన వన్డే కెరీర్‌లో 56వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంతరం కెపె్టన్ బట్లర్ (34; 2 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు సైతం పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. షమీ, రాణా, పాండ్యా, వరుణ్ తలా ఒక వికెట్ తీశారు.
76 బంతుల్లో శతకం
ఎంతటి బ్యాటింగ్ పిచ్ అయినా... 305 పరుగుల లక్ష్యం వన్డేల్లో అంత ఈజీ కానేకాదు. చక్కని శుభారంభం... కడదాకా ఓర్పుగా, నేర్పుగా ఒక బ్యాటరైనా క్రీజులో నిలిస్తేనే గెలుపు ఆశలుంటాయి. సరిగ్గా నాయకుడు రోహిత్ కూడా ఇదే చేశాడు. ఓపెనింగ్‌లో గిల్‌తో జతగా మొదట లక్ష్యానికి అనువైన ఆరంభమిచ్చాడు. దీంతో 6.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 50 దాటింది. భారీ షాట్లతో విరుచుకుపడిన ‘హిట్‌మ్యాన్’ 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, గిల్ 45
బంతుల్లో పూర్తి చేశాడు. ఇద్దరి పట్టుదలతో 14వ ఓవర్లోనే జట్టు 100కు చేరుకుంది. తర్వాత గిల్ ని్రష్కమించినా, కోహ్లి (5) విఫలమైనా ... ఆ ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా అయ్యర్‌తో కలిసి ధాటిని కొనసాగిస్తూ టీమిండియాను లక్ష్యంవైపు నడిపించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో సెంచరీ సాధించాక భారీ షాట్‌కు యతి్నంచి అవుటయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 29.4 ఓవర్లలో 220/3. ఇక గెలిచేందుకు 125 బంతుల్లో 85 చేస్తే చాలు. ఈ పనిలో అక్షర్ పటేల్ (43 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) అజేయంగా భాగమవడంతో 33 బంతులు మిగిలుండగానే భారత్ మ్యాచ్ నెగ్గింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/7_44.png)
ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో...
బారాబతి స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో ఆటకు అరగంటకు పైగానే అంతరాయం ఏర్పడింది. డేనైట్ వన్డేలు, టి20ల కోసం మైదానం చుట్టూరా... ఎనిమిది చోట్ల ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకదాంట్లో సమస్య వచ్చింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ధనాధన్ వేగంతో 48 పరుగులు చేసింది. ఈ సమయంలో క్లాక్ టవర్ వద్ద వున్న ఫ్లడ్‌లైట్లు ఆగిపోయాయి. దీంతో 35 నిమిషాల పాటు మ్యాచ్‌ను నిలిపేసి లైట్లు వెలిగాకే తిరిగి మ్యాచ్‌ను నిర్వహించారు.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) వరుణ్ 26; డకెట్ (సి) పాండ్యా (బి) జడేజా 65; రూట్ (సి) కోహ్లి (బి) జడేజా 69; బ్రూక్ (సి) గిల్ (బి) రాణా 31; బట్లర్ (సి) గిల్ (బి) పాండ్యా 34; లివింగ్‌స్టోన్ (రనౌట్) 41; ఓవర్టన్ (సి) గిల్ (బి) జడేజా 6; అట్కిన్సన్ (సి) కోహ్లి (బి) షమీ 3; రషీద్ (రనౌట్) 14; మార్క్ వుడ్ (రనౌట్) 0; సఖిబ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 304. వికెట్ల పతనం: 1–81, 2–102, 3–168, 4–219, 5–248, 6–258, 7–272, 8–297, 9–304, 10–304. బౌలింగ్: షమీ 7.5–0–66–1, హర్షిత్ రాణా 9–0–62–1, పాండ్యా 7–0–53–1, వరుణ్ 10–0–54–1, జడేజా 10–1–35–3, అక్షర్ 6–0–32–0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) లివింగ్‌స్టోన్ 119; గిల్ (బి) ఓవర్టన్ 60; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 5; అయ్యర్ (రనౌట్) 44; అక్షర్ పటేల్ (నాటౌట్) 41; కేఎల్ రాహుల్ (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 10; పాండ్యా (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 10; జడేజా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (44.3 ఓవర్లలో 6 వికెట్లకు) 308. వికెట్ల పతనం: 1–136, 2–150, 3–220, 4–258, 5–275, 6–286. బౌలింగ్: సఖిబ్ 6–0–36–0, అట్కిన్సన్ 7–0–65–1, మార్క్ వుడ్ 8–0–57–0, ఆదిల్ రషీద్ 10–0–78–1, ఓవర్టన్ 5–0– 27–2, లివింగ్‌స్టోన్ 7–0–29–1, రూట్ 1.3–0–15–0.
Comments
Please login to add a commentAdd a comment