![Rohit Sharma Hits A Century In 2 Odi Against England](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/rohith%202.jpg.webp?itok=c7BySDfk)
కటక్: టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలిసారి సెంచరీ.
కటక్‌లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా దిగిన రోహిత్,.. సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. రోహిత్ సెంచరీ చేసే సమయానికి టీమిండియా ఇంకా 119 పరుగులు చేయాల్సింది ఉంది. రోహిత్‌కు జతగా శ్రేయస్ అయ్యార్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం.
అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో ినిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.
ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment