భారీ లక్ష్య ఛేదనలో ‘బజ్‌బాల్’ మంత్రం పని చేయలేదు...దూకుడైన ఆటతో చెలరేగి విజయతీరం చేరాలనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగలేదు...భారత బౌలింగ్ సామర్థ్యం ముందు బ్యాటర్లు తలవంచారు...మన బౌలర్ల ప్రతిభకు తోడు స్వీయతప్పిదాలు పర్యాటక జట్టును దెబ్బ తీశాయి...కీలక సమయాల్లో వికెట్లు తీసిన టీమిండియా నాలుగో రోజే ఇంగ్లండ్‌ను పడగొట్టింది...హైదరాబాద్‌లో ఎదురైన ఓటమికి విశాఖపట్నంలో ప్రతీకారం తీర్చుకుంది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సిరీస్‌ను 1–1తో సమం చేసి రాబోయే టెస్టులపై ఆసక్తిని పెంచింది.
తొలి ఇన్నింగ్స్‌కంటే మరింత పదునైన బంతులతో చెలరేగిన బుమ్రా ఇంగ్లండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేయగా, అశ్విన్ అండగా నిలిచాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉన్నా...పెద్దగా స్పిన్ టర్న్ లేకపోయినా క్రాలీ మినహా ఎవరూ నిలవలేకపోయారు. అద్భుత ఫీల్డింగ్ భారత బలాన్ని రెట్టింపు చేసి విజయానికి బాటలు వేసింది. స్టోక్స్ సేన తాము ఆశించినట్లుగా గెలుపు పక్షాన నిలవలేకపోయినా...నాలుగో ఇన్నింగ్స్‌లో మూడు వందల పరుగులకు చేరువగా వచ్చి గట్టి పోటీనివ్వగలిగామనే సంతృప్తితో ముగించింది.
విశాఖ స్పోర్ట్స్: భారత గడ్డపై ఒక విదేశీ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకున్న సందర్భాల్లో ఆ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు 276 పరుగులు...ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అంతకంటే ఎక్కువ పరుగులే చేసింది. కానీ చివరకు ఆ పోరాటం సరిపోక వందకు పైగా పరుగుల భారీ తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సోమవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది.
399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 67/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ (132 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా...టామ్ హార్ట్‌లీ (47 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ ఫోక్స్ (69 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ప్రతిఘటించారు. ఈ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్‌ప్రీత్ బుమ్రా (9/91) మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లతో టెస్టు ఫలితాన్ని శాసించగా, అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తాజా ఫలితం తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. కొంత విరామం తర్వాత ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు జరుగుతుంది.
రూట్, స్టోక్స్ విఫలం...
ఓపెనర్ క్రాలీతో పాటు నైట్‌వాచ్‌మన్ రేహన్ అహ్మద్ (27 బంతుల్లో 28; 6 ఫోర్లు) కూడా సోమవారం ఉదయం కొద్ది సేపు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీసినా ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఒలీ పోప్ (23) ఒక్క అక్షర్ బౌలింగ్‌లోనే ఐదు ఫోర్లు బాదాడు. స్లిప్‌లో రోహిత్ సూపర్ క్యాచ్‌కు పోప్ వెనుదిరిగాడు. అయితే చెత్త షాట్‌తో రూట్ భారత్‌కు కీలక వికెట్ ఇచ్చేశాడు.
అశ్విన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ వైపు గుడ్డిగా ఆడబోయిన రూట్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ జోరుకు కళ్లెం పడింది. ఆపై లంచ్ విరామానికి ముందు రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా విజయానికి బాటలు వేసుకుంది. కుల్దీప్ బౌలింగ్‌లో క్రాలీ వికెట్ల ముందు దొరికిపోగా, డీఆర్‌ఎస్ ఫలితం కాస్త చర్చకు దారి తీసింది. బుమ్రా బంతికి బెయిర్‌స్టో వద్ద జవాబు లేకపోయింది. స్టోక్స్ ఉన్నంత వరకు కాస్త ఆశలు ఉన్నా...అతని రనౌట్‌తో జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైంది. సింగిల్ తీసే క్రమంలో స్టోక్స్ బద్ధకంగా కదలగా...అయ్యర్ మెరుపు త్రో అతని ఆటను ముగించింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 396;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253;
భారత్ రెండో ఇన్నింగ్స్ 255;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీ) (బి) కుల్దీప్ 73; డకెట్ (సి) భరత్ (బి) అశ్విన్ 28; రేహన్ (ఎల్బీ) (బి) అక్షర్ 23; పోప్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 23; రూట్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 16; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) బుమ్రా 26; స్టోక్స్ (రనౌట్) 11; ఫోక్స్ (సి) అండ్ (బి) బుమ్రా 36; హార్ట్‌లీ (బి) బుమ్రా 36; బషీర్ (సి) భరత్ (బి) ముకేశ్ 0; అండర్సన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 292.
వికెట్ల పతనం: 1–50, 2–95, 3–132, 4–154, 5–194, 6–194, 7–220, 8–275, 9–281, 10–292.
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పా యింట్ల పట్టికలో భారత్ ముందుకు దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఐదో స్థానంలో ఉన్న భారత్ ఈ గెలుపుతో మూడు స్థానాలు మెరుగుపర్చుకొని రెండో స్థానానికి (52.77 పాయింట్ల శాతం) చేరుకుంది. ఆ్రస్టేలియా అగ్రస్థానంలో (55 పాయింట్ల శాతం) కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment