పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఐదుగురు స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్ పర్యటనలో వరుసగా రెండో సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగే రెండో వన్డేలో భారత్, విండీస్ తలపడనున్నాయి. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్ మరో సిరీస్ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
అంతా ఫామ్‌లోకి...
శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటింగ్‌తో అర్ధసెంచరీ నమోదు చేశాడు. రుతురాజ్, ఇషాన్ కిషన్‌లను కాదని ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న శుబ్‌మన్ గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్‌కు చూపించగా... రాణిస్తే తప్ప జట్టులో చోటు దక్కే అవకాశం లేని స్థితిలో బరిలోకి దిగిన శ్రేయస్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్‌లో సిరాజ్ చక్కగా రాణించి వన్డేలకూ తాను తగినవాడినన్ని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా అతను తీసిన పూరన్ వికెట్ కీలక దశలో వరుస ఓవర్లలో శార్దుల్ తీసిన రెండు వికెట్లు ఆల్‌రౌండర్‌గా అతని బలాన్ని ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో మార్పులు లేకుండానే భారత జట్టు రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది.
తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ టాప్–4 బ్యాటర్లలో ముగ్గురు రాణించారు. అయితే జట్టును గెలిపించడానికి అది సరిపోలేదు. కీలక దశలో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. కొన్ని చక్కటి షాట్లు ఆడి వెనుదిరుగుతూ టి20 శైలి బ్యాటింగ్ చేస్తున్న పూరన్.. కెప్టెన్‌గా జట్టుకు విజయం అందించే ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మేయర్స్, కింగ్స్‌లకు తోడు బ్రూక్స్ కూడా మెరుగ్గా ఆడితే విండీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. గత ఆరు మ్యాచ్‌లలో షై హోప్స్ విఫలం కావడంతో టీమ్‌కు శుభారంభం లభించడం లేదు. దీనికి ఆ జట్టు సరిదిద్దుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లో మాత్రం విండీస్‌లో తడబాటు స్పష్టంగా కనిపించింది.
ఉత్కంఠభరిత ముగింపు
తొలి వన్డే చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు కావాలి. సిరాజ్ వేసిన తొలి 4 బంతుల్లో ఒక ఫోర్ సహా 7 పరుగులు వచ్చాయి. 2 బంతుల్లో 8 పరుగులు అవసరం. ఆ తర్వాత సిరాజ్ వేసిన బంతి లెగ్‌స్టంప్‌కు చాలా దూరంగా ‘వైడ్’గా వెళ్లింది. అది వేగంగా వెళ్లి బౌండరీని తాకి ఉంటే సమీకరణం వేరేలా ఉండేది. కానీ కీపర్ సంజు సామ్సన్ అద్భుతంగా ఎడమ వైపు డైవ్ చేస్తూ దానిని ఆపడంలో సఫలమయ్యాడు. దాంతో ఒక పరుగే వచ్చింది. అనంతరం చివరి 2 బంతుల్లో సిరాజ్ 3 పరుగులే ఇవ్వడంతో 3 పరుగుల తేడాతో విజయం భారత్ సొంతమైంది. భారత్ చేసిన 308 పరుగులకు బదులుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులే చేయగలిగింది. కైల్ మేయర్స్ (68 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (66 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రూక్స్ (61 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... శార్దుల్, సిరాజ్, చహల్ తలా 2 వికెట్లు తీశారు. శిఖర్ ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
India vs West Indies: మరో సిరీస్ సాధించేందుకు...
Published Sun, Jul 24 2022 4:53 AM | Last Updated on Sun, Jul 24 2022 4:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment