వరల్డ్ కప్‌కు ముందు భారత్ అదరగొట్టే ప్రదర్శన... పలువురు కీలక ఆటగాళ్లు లేకపోయినా అద్భుత ఆటతో టీమిండియా బృందం ఆ్రస్టేలియాకు చుక్కలు చూపించింది. భారీ విజయమే కాకుండా ఇప్పటి వరకు వరకు బెంగగా ఉన్న శ్రేయస్ ఫామ్ సమస్య కూడా తొలగిపోగా... సూర్యకుమార్ కూడా ఎట్టకేలకు తన అసలు ప్రతాపాన్ని చూపించాడు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్ భారత్ సొంతమైంది.
ఇండోర్: సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ ఆదివారం హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 99 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టుపై భారత్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 164 బంతుల్లోనే 200 పరుగులు జోడించడం విశేషం.
ఈ ఇద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 31 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్), అబాట్ (36 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. చివరి వన్డే బుధవారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది.
చివరి వరకు మెరుపులు...
అరంగేట్ర బౌలర్ స్పెన్సర్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన రుతురాజ్ (8) ఎక్కువసేపు నిలవలేదు. అయితే నాలుగో ఓవర్ ఐదో బంతి నుంచి మొదలైన గిల్, శ్రేయస్ భాగస్వామ్యం ఆస్ట్రేలియాను ఒక ఆటాడుకుంది. గత మ్యాచ్‌లో రనౌటై తీవ్ర నిరాశకు గురైన శ్రేయస్ ఈసారి తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో జోరు ప్రదర్శించాడు. తన తొలి 14 బంతుల్లోనే అతను 5 ఫోర్లు కొట్టాడు.
అబాట్ ఓవర్లో గిల్ 6, 4 కొట్టడంతో భాగస్వామ్యం 29 బంతుల్లోనే 50 పరుగులకు చేరింది. వానతో 40 నిమిషాల విరామం తర్వాత ఆట మళ్లీ మొదలైంది. గిల్ 37 బంతుల్లో, శ్రేయస్ 41 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయింది. తన ధాటిని కొనసాగిస్తూ 86 బంతుల్లో కెరీర్‌లో మూడో సెంచరీ అందుకున్న శ్రేయస్ తర్వాతి ఓవర్లో వెనుదిరగ్గా... కొద్ది సేపటికే 92 బంతుల్లో గిల్ ఆరో వన్డే సెంచరీ పూర్తయింది.
గిల్ కూడా అవుటయ్యాక ఇషాన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్, సూర్య కలిసి మరింత దూకుడుగా ఆడారు. 43 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 311/4. ఈ దశలో సూర్య మెరుపు బ్యాటింగ్‌తో ఇండోర్ దద్దరిల్లింది. తర్వాతి 7 ఓవర్లలో భారత్ 88 పరుగులు చేయగా... అందులో సూర్య ఒక్కడే 68 పరుగులు సాధించడం విశేషం. 24 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు.
అశ్విన్‌కు 3 వికెట్లు...
ఛేదనలో ఆసీస్ ఆరంభంలోనే తడబడింది. ప్రసిధ్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో షార్ట్ (9), స్మిత్ (0)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వార్నర్, లబుషేన్ (27) కలిసి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరితో పాటు ఇన్‌గ్లిస్ (6)ను 12 పరుగుల వ్యవధిలో అశ్విన్ అవుట్ చేయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. ఆఖర్లో సీన్ అబాట్, హాజల్‌వుడ్ (23) కలిసి తొమ్మిదో వికెట్‌కు 44 బంతుల్లోనే 77 పరుగులు జోడించి పోరాడినా లక్ష్యానికి జట్టు చాలా దూరంలో ఆగిపోయింది.
వరుసగా 4 సిక్సర్లు...
గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ ఈసారి తన అసలైన 360 డిగ్రీ ఆటను ప్రదర్శించాడు. ముఖ్యంగా గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో అతను అద్భుత షాట్లతో చెలరేగాడు. తొలి నాలుగు బంతులను అతను లాంగ్ లెగ్, ఫైన్ లెగ్, కవర్స్, డీప్ మిడ్‌వికెట్ మీదుగా సికర్లుగా మలచడం విశేషం. ఆట చూస్తే తర్వాతి రెండు బంతులూ సిక్సర్లుగా మారతాయేమో అనిపించింది. అయితే గ్రీన్
రెండు చక్కటి బంతులతో కట్టడి చేయడంలో సఫలమయ్యాడు.
వార్నర్ రైట్ హ్యాండర్‌గా...
ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వార్నర్ అనూహ్యంగా గార్డ్ తీసుకొని మరీ పూర్తి స్థాయి ‘రైట్ హ్యాండ్’ బ్యాటర్‌గా ఆడాడు. అశ్విన్ వేసిన ఈ ఓవర్లో ఒక చక్కటి ఫోర్ సహా అతను 6 పరుగులు చేశాడు. అయితే అశ్విన్ తర్వాతి ఓవర్లోనూ ఇలాగే దిగి లెఫ్ట్ హ్యాండర్ తరహాలో రివర్స్ స్వీప్ ఆడబోయి తొలి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. వార్నర్ దీనిని రివ్యూ చేయకపోగా, రీప్లేలో బంతి అతని బ్యాట్‌ను తాకినట్లు తేలింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) క్యారీ (బి) హాజల్‌వుడ్ 8; గిల్ (సి) క్యారీ (బి) గ్రీన్ 104; శ్రేయస్ (సి) షార్ట్ (బి) అబాట్ 105; రాహుల్ (బి) గ్రీన్ 52; ఇషాన్ కిషన్ (సి) క్యారీ (బి) జంపా 31; సూర్యకుమార్ (నాటౌట్) 72; జడేజా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–16, 2–216, 3–243, 4–302, 5–355. బౌలింగ్: స్పెన్సర్ 8–0–61–0, హాజల్‌వుడ్ 10–0–62–1, అబాట్ 10–0–91–1, గ్రీన్ 10–0–103–2, జంపా 10–0–67–1, షార్ట్ 2–0–15–0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) అశ్విన్ (బి) ప్రసిధ్ 9; వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 53; స్మిత్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 0; లబు షేన్ (బి) అశ్విన్ 27; ఇన్‌గ్లిస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 6; క్యారీ (బి) జడేజా 14; గ్రీన్ (రనౌట్) 19; అబాట్ (బి) జడేజా 54; జంపా (బి) జడేజా 5; హాజల్‌వుడ్ (బి) షమీ 23; స్పెన్సర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (28.2 ఓవర్లలో ఆలౌట్) 217. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–89, 4–100, 5–101, 6–128, 7–135, 8–140, 9–217, 10–217.
బౌలింగ్: షమీ 6–0–39–1, ప్రసిధ్ 6–0–56–2, అశ్విన్ 7–0–41–3, శార్దుల్ 4–0–35–0, జడేజా 5.2–0–42–3.
Comments
Please login to add a commentAdd a comment