వాన ఆగితేనే ఆట!
►రెండో వన్డేకు వర్షం ముప్పు
►నేడు కోల్‌కతాలో భారత్, ఆసీస్ పోరు
►మ.గం. 1.20 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయినా 281 పరుగుల వరకు చేరడం... టి20 తరహా లక్ష్యాన్ని ఇచ్చి దానిని కాపాడుకోగలగడం... భారత జట్టు ఎంత బలంగా ఉందో చెప్పడానికి తొలి వన్డేలో ఈ ప్రదర్శన చూస్తే చాలు. మరోవైపు విదేశీ గడ్డపై ఆడిన గత 10 వన్డేల్లో 9 ఓడిన ఆస్ట్రేలియా పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధం కాగా... వరుణుడు కరుణిస్తేనే మ్యాచ్ జరిగే అవకాశముండటం తాజా స్థితి.
కోల్‌కతా: తొలి వన్డేలో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత జట్టు మరోసారి ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు సన్నద్ధమైంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే రెండో వన్డేలో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఒకవైపు భారత్ అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తుండగా... తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్‌ను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే సిరీస్‌పై పట్టు చిక్కినట్లే. అయితే అన్నింటికి మించి వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.
రహానే ఇప్పుడైనా: గత మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినా... ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఓపెనర్‌గా అజింక్య రహానే సామర్థ్యంపై ఆ మ్యాచ్ మరోసారి సందేహాలు రేకెత్తించింది. శిఖర్ ధావన్ గైర్హాజరుతో శ్రీలంకపై చివరి వన్డేలో, చెన్నై వన్డేలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న రహానే తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. దూకుడుగా ఆడలేడంటూ అతనిపై గతంలో వచ్చిన విమర్శలకు రహానే మళ్లీ అవకాశం కల్పిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను మెరుగ్గా ఆడాల్సి ఉంది. నాలుగో స్థానాన్ని మనీశ్ పాండే ఖాయం చేసుకున్నాడు కాబట్టి ఒక్క మ్యాచ్ వైఫల్యంతో అతనిపై వేటు పడకపోవచ్చు. లోకేశ్ రాహుల్ ఈసారి కూడా పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. గత మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి, రోహిత్ తమ సత్తాను చూపించాలని పట్టుదలగా ఉండగా... హార్దిక్ పాండ్యా, ధోని మరోసారి లోయర్ ఆర్డర్‌లో కీలకం కానున్నారు. ఇక బౌలింగ్‌లో కొత్త ‘మణికట్టు జోడి’ ఆసీస్‌ను గత మ్యాచ్‌లో దెబ్బ తీసింది. యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థిగా సమస్యగా మారింది.
బ్యాట్స్‌మెన్ సత్తాకు పరీక్ష: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా కాలంగా ఆస్ట్రేలియా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. వార్నర్, స్మిత్, మ్యాక్స్‌వెల్‌లో కనీసం ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటున్నాయి. తొలి వన్డేలో మ్యాక్స్‌వెల్ మెరుపు దాడి ఒక దశలో ఆసీస్‌ను గెలిపించినంత పని చేసింది. అయితే వార్నర్ స్థాయికి తగినట్లుగా ఆడకపోవడం, స్మిత్ వైఫల్యం జట్టును దెబ్బ తీశాయి. అనుభవం లేని కార్ట్‌రైట్, హెడ్, స్టొయినిస్‌లపై ఎవరూ అంచనాలు కూడా పెట్టుకోవడం లేదు.
పిచ్, వాతావరణం: కోల్‌కతాలో గత మూడు రోజులుగా వానలు కురుస్తున్నాయి. మ్యాచ్ రోజు కూడా వర్ష సూచన ఉంది. పాక్షికంగా అంతరాయం కలగడం లేదా పూర్తిగా రద్దయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇటీవల ఈడెన్ పిచ్ చక్కటి బౌన్స్‌తో పేసర్లకు అనుకూలంగా ఉంటోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రహానే, పాండే, జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, హెడ్, కార్ట్‌రైట్/హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్, ఫాల్క్‌నర్, కూల్టర్ నీల్, కమిన్స్, జంపా.
చికెన్ ఉడకలేదు!
మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) తమ కోసం సిద్ధం చేసిన ఆహారంపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రిల్ చికెన్‌ను తాము కోరినట్లుగా 73 డిగ్రీల వద్ద వేడి చేయకుండా... అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతతో వేడి చేసి అందించారని ఆటగాళ్లు ఆరోపించారు. ఇది తమ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వారు అన్నారు. చికెన్‌పై ఆసీస్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేసిన మాట వాస్తవమేనని, ఇక ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ‘క్యాబ్’ అధికారులు వివరణ ఇచ్చారు.
స్మిత్ @ 100
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఇది వందో వన్డే మ్యాచ్ కానుంది. ఆరంభంలో తన బౌలింగ్, ఫీల్డింగ్‌తోనే చోటు దక్కించుకున్న స్మిత్ ఆ తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి 38 వన్డేల్లో 20.73 సగటుతో కేవలం 477 పరుగులు చేసిన స్మిత్... తర్వాతి 61 వన్డేల్లో 54.22 సగటుతో 2711 పరుగులు చేశాడు.