టీమిండియా పోరాటం సరిపోలేదు | Australia beat India by 51 runs | Sakshi
Sakshi News home page

పోరాటం సరిపోలేదు; భారత్‌ పరాజయం

Published Mon, Nov 30 2020 1:05 AM | Last Updated on Mon, Nov 30 2020 7:59 AM

Australia beat India by 51 runs - Sakshi

శుక్రవారం... భారత్‌పై ఆస్ట్రేలియా అత్యధిక స్కోరు... 62 బంతుల్లోనే స్మిత్‌ సెంచరీ... భారీ ఛేదనలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ అర్ధ సెంచరీలతో పోరాడి ఓడిన టీమిండియా... ఆదివారం... ఆస్ట్రేలియా తమ భారీ స్కోరును మరింత మెరుగుపర్చుకుంది... స్మిత్‌ మళ్లీ 62 బంతుల్లోనే శతకం బాదాడు... మరోసారి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ హాఫ్‌ సెంచరీలు సాధించినా... గత మ్యాచ్‌కంటే పెద్ద స్కోరును ఛేదించే క్రమంలో భారత్‌ పోరాటం వరకే పరిమితమైంది. ఓటమి అంతరంలో 15 పరుగులు తగ్గినా... తుది ఫలితం మాత్రం మారలేదు. సరిగ్గా చెప్పాలంటే గత మ్యాచ్‌ చూస్తున్నట్లే అనిపించింది. బౌలర్ల ఘోర వైఫల్యం, భారత్‌ పరాజయం సహా మిగతా అంతా సేమ్‌ టు సేమ్‌!

సిడ్నీ: కరోనా విరామం తర్వాత ఆడిన తొలి సిరీస్‌ను భారత్‌ చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 51 పరుగులతో ఓడిన భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0–2తో  సమర్పించుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టీవ్‌ స్మిత్‌ (64 బంతుల్లో 104; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా... వార్నర్‌ (77 బంతుల్లో 83; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), లబ్‌షేన్‌ (61 బంతుల్లో 70; 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫించ్‌ (69 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులకు పరిమితమైంది. విరాట్‌ కోహ్లి (87 బంతుల్లో 89; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (66 బంతుల్లో 76; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. సిరీస్‌లో చివరి వన్డే బుధవారం కాన్‌బెర్రాలో జరుగుతుంది.  

ఒకరితో పోటీ పడి మరొకరు...
ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. బుమ్రా తన తొలి ఓవర్‌ను ‘మెయిడిన్‌’తో మొదలు పెట్టినా ఆ తర్వాత గతి తప్పగా... షమీ, సైనీ కూడా సరైన దిశలో బంతులు వేయకపోవడంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ జోరు ప్రదర్శించారు. తొలి 10 ఓవర్లలో జట్టు 59 పరుగులు చేసింది. చహల్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన వార్నర్‌ 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్‌ చివరి బంతికి స్కోరు 100 పరుగులు దాటగా, చహల్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో ఫించ్‌ 60 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ ను అందుకున్నాడు.

ఎట్టకేలకు 23వ ఓవర్లో ఫించ్‌ ను అవుట్‌ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కొద్ది సేపటికే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించిన వార్నర్‌ను అయ్యర్‌ డైరెక్ట్‌ హిట్‌తో రనౌట్‌ చేశాడు. అయితే స్మిత్, లబ్‌షేన్‌ కలిసి మళ్లీ భారత బౌలర్ల పని పట్టారు. ముఖ్యంగా గత మ్యాచ్‌ తరహాలోనే చెలరేగిపోయాడు. జడేజా ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టిన అతను, సైనీ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఆసీస్‌ను ఆపడానికి చివరకు ఓపెనర్‌ మయాంక్‌కు కూడా భారత్‌ బంతిని అప్పగించింది.

అర్ధ సెంచరీ తర్వాత మరింత చెలరేగిపోయిన స్మిత్‌కు సెంచరీ చేరేందుకు మరో 24 బంతులే సరిపోయాయి. ముఖ్యంగా బుమ్రా ఓవర్లో అతను కొట్టిన 3 ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. చివరకు పాండ్యా బౌలింగ్‌లో స్మిత్‌ వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత కథ ముగిసిపోలేదు. 46 బంతుల్లో   లబ్‌షేన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి కాగా... మ్యాక్స్‌వెల్‌ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. అతను సిక్సర్లతో సత్తా చాటుతూ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేయగా... ఆసీస్‌ చివరి 10 ఓవర్లలో 114 పరుగులు సాధించడం విశేషం.  

కెప్టెన్‌ ఆడినా...
సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో భారత ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా తలా ఓ చేయి వేసినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 46 బంతుల్లోనే 58 పరుగులు జోడించడంతో సరైన ఆరంభం లభించింది. అయితే వీరిద్దరిని ఆసీస్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (36 బంతుల్లో 38; 5 ఫోర్లు) జతగా కెప్టెన్‌ కోహ్లి కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. 11 పరుగుల వద్ద అంపైర్‌ కోహ్లిని ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలింది.

జంపా బౌలింగ్‌లో ఫైన్‌ లెగ్‌ దిశగా ఫోర్‌ కొట్టి కోహ్లి 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అయ్యర్‌ అవుట్‌ కాగా... కెప్టెన్‌కు రాహుల్‌ జత కలిశాడు. కోహ్లితో పోటీ పడి దూకుడు ప్రదర్శించాడు. అయితే సెంచరీ దిశగా దూసుకుపోతున్న సమయంలో మిడ్‌వికెట్‌లో హెన్రిక్స్‌ అద్భుత క్యాచ్‌ పట్టడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ ముగిసింది. 52 బంతు ల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌ను జంపా వెనక్కి పంపాడు. 6.2 ఓవర్లలో 102 పరుగులు చేయాల్సిన ఈ దశలోనే భారత్‌ గెలుపుపై ఆశలు కోల్పోయింది.

వార్నర్‌కు గాయం: భారత్‌ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో ధావన్‌ కొట్టిన బంతిని మిడాఫ్‌లో ఆపే ప్రయత్నంలో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ వార్నర్‌కు గజ్జల్లో గాయమైంది. వార్నర్‌ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు మ్యాక్స్‌వెల్‌ వెల్లడించాడు. దీంతో వార్నర్‌ చివరి వన్డేతో పాటు టి20 సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (రనౌట్‌) 83; ఫించ్‌ (సి) కోహ్లి (బి) షమీ 60; స్మిత్‌ (సి) షమీ (బి) పాండ్యా 104; లబ్‌షేన్‌ (సి) మయాంక్‌ (బి) బుమ్రా 70; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 63; హెన్రిక్స్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 389.  
వికెట్ల పతనం: 1–142; 2–156; 3–292; 4–372.
బౌలింగ్‌: షమీ 9–0–73–1; బుమ్రా 10–1–79–1; సైనీ 7–0–70–0; చహల్‌ 9–0–71–0; జడేజా 10–0–60–0; మయాంక్‌ 1–0–10–0; హార్దిక్‌ పాండ్యా 4–0–24–1.  

భారత్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 28; ధావన్‌ (సి) స్టార్క్‌ (బి) హాజల్‌వుడ్‌ 30; కోహ్లి (సి) హెన్రిక్స్‌ (బి) హాజల్‌వుడ్‌ 89; అయ్యర్‌ (సి) స్మిత్‌ (బి) హెన్రిక్స్‌ 38; కేఎల్‌ రాహుల్‌ (సి) హాజల్‌వుడ్‌ (బి) జంపా 76; పాండ్యా (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 28; జడేజా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) కమిన్స్‌ 24; సైనీ (నాటౌట్‌) 10; షమీ (సి అండ్‌ బి) మ్యాక్స్‌వెల్‌ 1; బుమ్రా (ఎల్బీ) (బి) జంపా 0; చహల్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 338.
వికెట్ల పతనం: 1–58; 2–60; 3–153; 4–225; 5–288; 6–321; 7–321; 8–326; 9–328.
బౌలింగ్‌: స్టార్క్‌ 9–0–82–0; హాజల్‌వుడ్‌ 9–0–59–2; కమిన్స్‌ 10–0–67–3; జంపా 10–0–62–2; హెన్రిక్స్‌ 7–0–34–1; మ్యాక్స్‌వెల్‌ 5–0–34–1.

► ఆసీస్‌ తరఫున టాప్‌–5 బ్యాట్స్‌మెన్‌ కనీసం అర్ధ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. 2013లో జైపూర్‌లో ఇలాగే చేసినా (359/5)... భారత్‌ ఆ మ్యాచ్‌ను 43.3 ఓవర్లలోనే నెగ్గింది.

► మూడు ఫార్మాట్‌లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి 22 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌గా, భారత్‌ నుంచి సచిన్, ద్రవిడ్‌ తర్వాత మూడో క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు.
► రెండో వన్డేలో బరిలోకి దిగడం ద్వారా కోహ్లి భారత్‌ తరఫున 250 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement