భారత్ ఘోర పరాజయం | Australia beat India by eight wickets in the first Day-night Test | Sakshi
Sakshi News home page

భారత్ ఘోర పరాజయం

Published Sun, Dec 20 2020 4:46 AM | Last Updated on Sun, Dec 20 2020 9:27 AM

Australia beat India by eight wickets in the first Day-night Test  - Sakshi

భారత అభిమానులను ఈ సంఖ్య చిరకాలం వెంటాడుతుంది... ఇప్పటి వరకు క్రికెట్‌లో 36 అంటే మన యువరాజ్‌ కొట్టిన సిక్సర్ల వర్షం గుర్తుకొచ్చేది... ఇప్పుడు 36 అంటే మరచిపోలేని ఒక పరాభవం... ఆస్ట్రేలియా గడ్డపై ఒక అవమానకర ఓటమి... అడిలైడ్‌ మైదానంలో ‘పింక్‌ బాల్‌ తెచ్చిన పీడకల’... డే అండ్‌ నైట్‌ టెస్టు పోరులో చివరకు మనకు మిగిల్చిన చీకటి... ఒకరిని మించి మరొకరు బ్యాట్స్‌మన్‌ ఉన్న జట్టులో ఒక్కరు కూడా రెండంకెల పరుగులు చేయలేని వేళ... అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కనుమూసి తెరిచేలోపు వికెట్‌ పడిపోతున్నట్లు అనిపించిన ఆవేదన... ఇంకొద్దిసేపు నిలబడలేరా? ఇంకొన్ని పరుగులు చేయలేరా? అంటూ పెట్టుకుంటున్న ఆశలు క్షణాల వ్యవధిలో మటుమాయం అవుతుండగా చివరకు తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరుకు టీమిండియా దిగజారింది.

ఆటలో ఉండే అనిశ్చితే వేరు... ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లగలదు, ఆ వెంటనే అధః పాతాళానికి పడేయగలదు... రెండు రోజుల ఆట తర్వాత టెస్టు గెలుచుకోగలమనే నమ్మకాన్ని కలిగించిన జట్టు కొన్ని గంటల్లోనే ఒక్కసారిగా ఓటమిని నట్టింట్లోకి ఆహ్వానించింది... గంటలకొద్దీ క్రీజ్‌లో గడిపి వందలకొద్దీ పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్‌మెన్‌ కలిగిన జట్టు ఆట కట్టించేందుకు మూడో రోజు 92 బంతులే సరిపోయాయి... మన జట్టుకు భారీ పరాజయాలు కొత్త కాదు... విదేశీ గడ్డపై ఎన్నో పేలవ ప్రదర్శనలు వచ్చాయి... కానీ ఎప్పుడో 1974 నాటి చెత్త రికార్డును తిరగరాసేంత వైఫల్యం 2020లో ఊహించలేనిది. అయితే ఇలాంటి స్థితిని సృష్టించిన ఆస్ట్రేలియా అద్భుత బౌలింగ్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే. మన బ్యాటింగ్‌ లోపాలకంటే హాజల్‌వుడ్, కమిన్స్‌ చెలరేగిన తీరు ఆస్ట్రేలియాకు అనూహ్య విజయాన్ని అందించిందంటే అతిశయోక్తి కాదు.

అడిలైడ్‌: రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్‌ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్‌లో వెనుకంజ వేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 9/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పేసర్లు జోష్‌ హాజల్‌వుడ్‌ (5/8), ప్యాట్‌ కమిన్స్‌ (4/21) భారత జట్టు వెన్నువిరిచారు.

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 53 పరుగులు కలిపి భారత్‌ ఓవరాల్‌ స్కోరు 89 పరుగులకు చేరింది. 90 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. 21 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 2 వికెట్లకు 93 పరుగులు సాధించి గెలిచింది. జో బర్న్స్‌ (63 బంతుల్లో 51 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీకి తోడు మాథ్యూ వేడ్‌ (53 బంతుల్లో 33; 5 ఫోర్లు) రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలక అర్ధసెంచరీతో జట్టును ఆదుకోవడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో 5 చక్కటి క్యాచ్‌లు అందుకున్న కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఆసీస్‌ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో నిలవగా... ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు జరుగుతుంది.  


టపటపా...
మూడో రోజు భారత్‌ ఆట ముగిసేందుకు 15.2 ఓవర్లు సరిపోయాయి. ‘నైట్‌ వాచ్‌మన్‌’ బుమ్రాను తన తొలి ఓవర్లోనే అవుట్‌ చేసి కమిన్స్‌ భారత్‌ పతనానికి శ్రీకారం చుట్టగా, హాజల్‌వుడ్‌ తన అద్భుత బౌలింగ్‌తో జట్టు ఆట ముగించాడు. 15 పరుగుల స్కోరు వద్దే భారత్‌ 4 వికెట్లు కోల్పోయింది. హాజల్‌వుడ్‌ ఒకే ఓవర్లో మయాంక్, రహానేలను అవుట్‌ చేయగా... గ్రీన్‌ చక్కటి క్యాచ్‌కు కోహ్లి నిష్క్రమించాడు. క్యాచ్‌ అందుకునే సమయంలో బంతి నేలను తాకినట్లు సందేహించిన థర్డ్‌ అంపైర్‌ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం అవుట్‌గా నిర్ధారించాడు. టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు (26) వద్దే భారత్‌ రెండు వికెట్లు చేజార్చుకోవడంతో మన జట్టూ ఆ జాబితాలో చేరుతుందేమో అనిపించింది. అయితే దానిని అధిగమించిన భారత్‌ మరో 10 పరుగులు జోడించి తర్వాతి మూడు వికెట్లు కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో షమీ చేతికి దెబ్బ తగలగా... వైద్యులు స్వల్ప చికిత్స చేసినా ఫలితం లేకపోగా, అతను పెవిలియన్‌కు వచ్చేయడంతో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది.  

వేగంగా...
స్వల్ప ఛేదనలో ఆసీస్‌ చకచకా దూసుకుపోయింది. ముఖ్యంగా బర్న్స్‌ తన ఆత్మవిశ్వాసం పెంచే ఇన్నింగ్స్‌ ఆడాడు. స్వల్ప స్కోరు కారణంగా బౌలర్లు కూడా కుంగిపోయారేమో... బుమ్రా, ఉమేశ్‌లలో తొలి ఇన్నింగ్స్‌ పదును కనిపించలేదు. ఫలితంగా 4.42 రన్‌రేట్‌తో ఆసీస్‌ పరుగులు సాధించింది. విజయానికి చేరువైన దశలో రెండు వికెట్లు కోల్పోయినా... ఎలాంటి ఇబ్బంది లేకుండా బర్న్స్, స్మిత్‌ (1 నాటౌట్‌) మ్యాచ్‌ను ముగించారు.  

ఇలా వరుసకట్టి...
ఓవర్‌ 3.1–పృథ్వీ షా (రెండో రోజు):  కమిన్స్‌ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌పై పడి లోపలికి దూసుకొచ్చింది. డిఫెన్స్‌ ఆడటంలో నెమ్మదిగా కదలడంతో క్లీన్‌బౌల్డ్‌.
ఓవర్‌ 7.6–బుమ్రా (మూడో రోజు): కమిన్స్‌ బౌలింగ్‌లో నేరుగా దూసుకొచ్చిన స్లో లెగ్‌కటర్‌. షాట్‌ ఆడబోయి బౌలర్‌ చేతుల్లోకి బంతి.  
ఓవర్‌ 11.2–పుజారా: కమిన్స్‌ కచ్చితమైన లెంగ్త్‌తో వేసిన అద్భుత బంతి. తప్పకుండా ఆడాల్సిన పరిస్థితి. బ్యాట్‌కు తగులుతూ బంతి కీపర్‌ చేతుల్లోకి.
ఓవర్‌ 12.1–మయాంక్‌: హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో నేరుగా వచ్చిన బంతి. అదనపు బౌన్స్‌ కారణంగా బ్యాట్‌కు తగిలి కీపర్‌ క్యాచ్‌.
ఓవర్‌ 12.5–రహానే: నేరుగా బ్యాట్‌పైకి కచ్చితత్వంలో వచ్చిన హాజల్‌వుడ్‌ బంతి. బ్యాట్స్‌మన్‌ కదల్లేని పరిస్థితి. కీపర్‌కు క్యాచ్‌.  
ఓవర్‌ 13.4–కోహ్లి: క్రీజ్‌కు దూరంగా వెళుతున్న బంతిని డ్రైవ్‌ చేసే ప్రయత్నం. గల్లీలో క్యాచ్‌.
ఓవర్‌ 18.4–సాహా: కాస్త భిన్నం. హాజల్‌వుడ్‌ లెగ్‌స్టంప్‌పై వేసిన బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో మిడ్‌వికెట్‌లో క్యాచ్‌.
ఓవర్‌ 18.5–అశ్విన్‌: తొలి బంతికే అవుట్‌. హాజల్‌వుడ్‌ గుడ్‌లెంగ్త్‌లో వేయగా ఫార్వర్డ్‌ డిఫెన్స్‌ ఆడబోయి కీపర్‌కు క్యాచ్‌.
ఓవర్‌ 20.1–విహారి: స్టంప్స్‌పైకి నేరుగా హాజల్‌వుడ్‌ బౌలింగ్‌ చేయగా ఫ్రంట్‌ఫుట్‌ షాట్‌ ఆడిన విహారి బ్యాట్‌కు తగులుతూ కీపర్‌ చేతుల్లోకి.
ఓవర్‌ 21.2–షమీ: కమిన్స్‌ వేసిన షార్ట్‌ బాల్‌ను తప్పించుకునే ప్రయత్నంలో చేతికి బలంగా తగిలిన బంతి. ఆడలేని పరిస్థితిలో రిటైర్డ్‌.


స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 244; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 191;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) కమిన్స్‌ 4, మయాంక్‌ (సి) పైన్‌ (బి) హాజల్‌వుడ్‌ 9, బుమ్రా (సి అండ్‌ బి) కమిన్స్‌ 2, పుజారా (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 0, కోహ్లి (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 4, రహానే (సి) పైన్‌ (బి) హాజల్‌వుడ్‌ 0, విహారి (సి) పైన్‌ (బి) హాజల్‌వుడ్‌ 8, సాహా (సి) లబ్‌షేన్‌ (బి) హాజల్‌వుడ్‌ 4, అశ్విన్‌ (సి) పైన్‌ (బి) హాజల్‌వుడ్‌ 0, ఉమేశ్‌ యాదవ్‌ (నాటౌట్‌) 4, షమీ (రిటైర్డ్‌ నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (21.2 ఓవర్లలో ఆలౌట్‌) 36.  
వికెట్ల పతనం: 1–7, 2–15, 3–15, 4–15, 5–15, 6–19, 7–26, 8–26, 9–31, 9–36. బౌలింగ్‌: స్టార్క్‌ 6–3–7–0, కమిన్స్‌ 10.2–4–21–4, హాజల్‌వుడ్‌ 5–3–8–5.  

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వేడ్‌ (రనౌట్‌) 33, బర్న్స్‌ (నాటౌట్‌) 51, లబ్‌షేన్‌ (సి) మయాంక్‌ (బి) అశ్విన్‌ 6, స్మిత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం (21 ఓవర్లలో 2 వికెట్లకు) 93.
వికెట్ల పతనం: 1–70, 2–82.
బౌలింగ్‌: ఉమేశ్‌ 8–1–49–0, బుమ్రా 7–1–27–0, అశ్విన్‌ 6–1–16–1.

‘42’ మ్యాచ్‌లో...
1974లో లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులకే ఆలౌట్‌ కావడం ఇప్పటి వరకు భారత్‌ అత్యల్ప స్కోరు. ముందుగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగులు చేయగా... భారత్‌ 302 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫాలోఆన్‌ ఆడిన మన జట్టు 17 ఓవర్లలో 77 నిమిషాల్లోనే 42 పరుగులకు కుప్పకూలింది. సునీల్‌ గావస్కర్‌ (5), గుండప్ప విశ్వనాథ్‌ (5), బ్రిజేశ్‌ పటేల్‌ (1), ఆబిద్‌ అలీ (3) తదితరులు విఫలమవ్వగా... ఏక్‌నాథ్‌ సోల్కర్‌ (18) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు ఇన్నింగ్స్, 285 పరుగులతో గెలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement