పర్యటన ఓటమితో మొదలైంది | Australia beat India in 1st ODI by 66 runs | Sakshi
Sakshi News home page

పర్యటన ఓటమితో మొదలైంది

Published Sat, Nov 28 2020 5:01 AM | Last Updated on Sat, Nov 28 2020 7:17 AM

Australia beat India in 1st ODI by 66 runs - Sakshi

పాండ్యా, ధావన్‌

చెదిరిన బౌలింగ్, కుదరని ఫీల్డింగ్‌తో టీమిండియా భంగపడింది. భారత బ్యాట్స్‌మెన్‌ కూడా పోరాడినా... ఇది విజయానికి సరిపోలేదు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి సేన పరాజయంతో పర్యటనను ప్రారంభించింది.

సిడ్నీ: భారీస్కోర్ల ఆటలో భారత్‌ వెనుకబడింది. పసలేని బౌలింగ్, పేలవమైన ఫీల్డింగ్‌ ఆస్ట్రేలియా చితక్కొట్టేందుకు దోహదపడగా... ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్‌ జోరుకు ఆతిథ్య బౌలర్లు కళ్లెం వేశారు. దీంతో 289 రోజుల తర్వాత వన్డే బరిలోకి దిగిన టీమిండియాకు ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఆసీస్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 374 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (124 బంతుల్లో 114; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టీవ్‌ స్మిత్‌ (66 బంతుల్లో 105; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. షమీకి 3 వికెట్లు దక్కాయి. తర్వాత భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులకు పరిమితమైంది. హార్దిక్‌ పాండ్యా (76 బంతుల్లో 90; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ధావన్‌ (86 బంతుల్లో 74; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. జంపా 4, హాజల్‌వుడ్‌ 3 వికెట్లు తీశారు. రెండో వన్డే రేపు ఇదే వేదికపై జరుగుతుంది.

‘శతక’బాదుడు
రెండు శతకాలు, రెండు శతక భాగస్వామ్యాలు ఆస్ట్రేలియాను మ్యాచ్‌ సగంలోనే పై మెట్టుపై నిలబెట్టాయి. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (76 బంతుల్లో 69; 6 ఫోర్లు), ఫించ్‌ తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించగా... స్మిత్‌తో కలిసి ఫించ్‌ రెండో వికెట్‌కు 108 పరుగులు జతచేశాడు. మొత్తం స్కోరులో ఈ టాపార్డరే ఏకంగా 288 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో స్మిత్‌ 62 బంతుల్లో చేసిన మెరుపు శతకం ఆసీస్‌ తరఫున మూడో ఫాస్టెస్ట్‌ సెంచరీగా నిలిచింది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (19 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచేయడంతో చివరి పది ఓవర్లలో ఆసీస్‌ 110 పరుగులు చేసింది.

ధాటిగా ఆడిన పాండ్యా  
ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తర్వాత తొలి వన్డే ఆడిన హార్దిక్‌ పాండ్యా మిడిలార్డర్‌లో చెలరేగాడు. మొదట ధావన్‌ ధాటిగా ఆడటంతో 13.1 ఓవర్లలోనే భారత్‌ వంద పరుగులను చేరుకుంది. కానీ ఆలోపే ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (22),  కోహ్లి (21), అయ్యర్‌ (2) వికెట్లను కోల్పోవడంతో భారత్‌కు లక్ష్యం పెనుభారమైంది. రాహుల్‌ (12) కూడా చేతులెత్తేశాడు. ఈ దశలో ధావన్‌కు జతయిన పాండ్యా చకచకా పరుగులు చేశాడు. వీళ్లిద్దరి జోడి ఐదో వికెట్‌కు 21 ఓవర్లలో 128 పరుగులు జతచేసింది. స్పిన్నర్‌ జంపా రాహుల్‌తో పాటు ధావన్, పాండ్యా, జడేజా (25)లను ఔట్‌ చేయడంతో భారత్‌ గెలుపు అవకాశాలు ముగిసిపోయాయి.

వదిలేశారు...
చెత్త ఫీల్డింగ్‌తో విలువైన క్యాచ్‌ల్ని భారత్‌ వదిలేయగా... సీనియర్‌ బౌలర్లు బుమ్రా (1/73), చహల్‌ (1/89), సైనీ (1/89) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ధావన్‌ రెండు క్యాచ్‌లను, చహల్‌ సునాయాసమైన క్యాచ్‌ను నేలపాలు చేశారు. దీనికి తోడు చురుకైన ఫీల్డర్‌గా పేరున్న జడేజా కూడా సునాయాస రనౌట్‌ను మిస్‌ చేయడం భారత్‌ను నష్టపర్చగా... ఆసీస్‌ భారీ స్కోరుకు కారణమైంది.

‘స్టాప్‌ అదానీ’
ఆస్ట్రేలియాలో భారత వ్యాపారవేత్త గౌతమ్‌ అదాని చేపట్టిన బొగ్గు గనుల వెలికితీత ప్రాజెక్ట్‌ను ఆపాలని, ప్రాజెక్ట్‌ కోసం ఎస్‌బీఐ ఇవ్వదల్చిన 1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5,500 కోట్లు) రుణాన్ని కూడా నిలిపివేయాలని కోరుతూ ఇద్దరు సామాజిక కార్యకర్తలు మైదానంలో ప్లకార్డ్‌లు ప్రదర్శించారు. అదానీ ప్రాజెక్ట్‌ పర్యావరణానికి తీవ్ర ముప్పు తెస్తుందంటూ ఆస్ట్రేలియాలో చాలా రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరో వైపు ఇటీవల మరణించిన ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్, ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు చనిపోయిన ఫిల్‌ హ్యూజెస్‌కు నివాళి అర్పించి ఇరు జట్లు భుజాలకు నల్ల రంగు బ్యాండ్‌ లు ధరించి బరిలో కి దిగగా... జాతి వివక్షకు వ్యతిరేకంగా సంఘీభావం ప్రకటిస్తూ ‘బేర్‌ ఫుట్‌ సర్కిల్‌’లో కూడా పాల్గొన్నారు.  

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 69; ఫించ్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 114; స్మిత్‌ (బి) షమీ 105; స్టొయినిస్‌ (సి) రాహుల్‌ (బి) చహల్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) జడేజా (బి) షమీ 45; లబ్‌షేన్‌ (సి) ధావన్‌ (బి) సైనీ 2; క్యారీ నాటౌట్‌ 17; కమిన్స్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 374/6.
వికెట్ల పతనం: 1–156, 2–264, 3–271, 4–328, 5–331, 6–372.
బౌలింగ్‌: షమీ 10–0–59–3, బుమ్రా 10–0–73–1, సైనీ 10–0–83–1; చహల్‌ 10–0–89–1, జడేజా 10–0–63–0.

భారత్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హాజల్‌వుడ్‌ 22; ధావన్‌ (సి) స్టార్క్‌ (బి) జంపా 74; కోహ్లి (సి) ఫించ్‌ (బి) హాజల్‌వుడ్‌ 21; అయ్యర్‌ (సి) క్యారీ (బి) హాజల్‌వుడ్‌ 2; రాహుల్‌ (సి) స్మిత్‌ (బి) జంపా 12; హార్దిక్‌ పాండ్యా (సి) స్టార్క్‌ (బి) జంపా 90; జడేజా (సి) స్టార్క్‌ (బి) జంపా 25; సైనీ నాటౌట్‌ 29; షమీ (బి) స్టార్క్‌ 13; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 308.
వికెట్ల పతనం: 1–53, 2–78, 3–80, 4–101, 5–229, 6–247, 7–281, 8–308.
బౌలింగ్‌: స్టార్క్‌ 9–0–65–1, హాజల్‌వుడ్‌ 10–0–55–3; కమిన్స్‌ 8–0–52–0, జంపా 10–0–54–4, స్టొయినిస్‌ 6.2–0–25–0, మ్యాక్స్‌వెల్‌ 6.4–0–55–0.

వన్డేల్లో భారత్‌పై ఆస్ట్రేలియాకు ఇదే అత్యధిక స్కోరు. గతంలో చేసిన 359 పరుగులను ఆసీస్‌ సవరించింది. 


స్మిత్, ఫించ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement