ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో జస్‌ప్రీత్ బుమ్రా స్థాయి బౌలర్‌తో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం రెండు ఓవర్ల స్పెల్ వేయించడం ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వన్డేల్లో ప్రధాన బౌలర్లకు 4–3–3 వ్యూహాన్ని అనుసరిస్తారు. టి20ల్లో అయితే రెండు ఓవర్లు కొంత అర్థం చేసుకోవచ్చేమో గానీ వన్డేల్లోకి వచ్చేసరికి బౌలర్ లయ అందుకోవడానికి తగిన సమయం కచ్చితంగా పడుతుంది. ఇది కోహ్లికి తెలియనిది కాదు. వన్డేల్లో 40 ఓవర్లపాటు కనీసం ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపలే ఉంటారు.
అలాంటి స్థితిలో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగి ప్రత్యర్థిని కట్టడి చేయడం అంత సులువు కాదు. ఇక్కడా టీమిండియా వ్యూహాలు ఏమాత్రం పని చేయలేదు. ఫలితంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా విదేశీ గడ్డపైనే రెండు సిరీస్ పరాజయాలు ఎదురయ్యాయి. ఎప్పుడో ధోని కెప్టెన్ కాక ముందు 2006 సంవత్సరంలో మాత్రమే భారత్ వన్డేల్లో గెలిచిన మ్యాచ్‌ల (3)కంటే ఓడిన మ్యాచ్‌ల (9) సంఖ్య ఎక్కువగా ఉండగా, 2020లో అది పునరావృతమైంది.
సాక్షి క్రీడా విభాగం
‘భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయలేరు...భారత బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు’... ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ పరాజయంలో భారత కూర్పు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యాఖ్య సరిపోతుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యం గల ఆటగాళ్లు లేకనే భారత్ ఈ ఏడాది విదేశాల్లో రెండో వన్డే సిరీస్ ఓడిపోయింది. ఆరంభంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో చిత్తయిన టీమ్, ఇప్పుడు ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. తాజా సిరీస్‌ను కోల్పోవడానికి కొన్ని కారణాలను విశ్లేషిస్తే...
వన్డేల మధ్య విరామం
ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్ అనూహ్యంగా రద్దయిన తర్వాత భారత్ మళ్లీ ఇప్పుడే వన్డేల్లోకి బరిలోకి దిగింది. మధ్యలో ఆస్ట్రేలియా మాత్రం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడిం ది. అయితే ఈతరంలో వన్డేల్లో వేగానికి, టి20లకు పెద్దగా తేడా లేని పరిస్థితుల్లో ఐపీఎల్ ఆడిన తర్వాత వన్డేలు ఆడటం సమస్య కాకపోవచ్చు. అయితే సుదీర్ఘ కాలం బయో బబుల్‌లో ఉన్న అలసట వల్ల కుదురుకునేందుకు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే.
ఆల్‌రౌండర్ల సమస్య
బలవంతంగా రెండో వన్డేలో హార్దిక్‌తో బౌలింగ్ చేయించినా... ప్రస్తుతానికి అతను పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గానే ఆడుతున్నాడు. బ్యాట్స్‌మన్ అయి ఉండి కొంత బౌలింగ్ చేయగలిగే విజయ్ శంకర్, దూబే, కృనాల్, జాదవ్‌లాంటి వారితో ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ వన్డేల్లో సఫలం కాలేకపోతోంది. ఒకదశలో సచిన్, యువరాజ్, సెహ్వాగ్, రైనా అవసరమైతే ఏ క్షణానైనా బౌలింగ్‌కు సిద్ధంగా ఉండేవారు. ఇప్పటి మన టాప్–5లో ఒక్కరూ కనీసం ఒక్క బంతి కూడా వేయడం లేదు. మరో కోణంలో చూస్తే ‘త్రో డౌన్ స్పెషలిస్ట్’ల కారణంగా నెట్స్‌లో మన బ్యాట్స్‌మెన్ ఎవరికీ బౌలింగ్ చేయాల్సిన అవసరం గానీ అవకాశం గానీ ఉండటం లేదు.
బౌలర్ల వైఫల్యం
ఈ ఏడాది ఆడిన 9 వన్డేల్లో కలిపి భారత్ తొలి 10 ఓవర్ల పవర్‌ప్లేలో కేవలం 4 వికెట్లే పడగొట్టగలిగింది! ముఖ్యంగా గాయంతో భువనేశ్వర్ కుమార్ దూరం కావడం కూడా జట్టును ప్రభావితం చేస్తోంది. సీనియర్లు షమీ, బుమ్రా కూడా తమదైన ముద్ర వేయలేకపోగా... అనుభవం లేని నవదీప్ సైనీ సహజంగానే విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌లలోనూ మన పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక కుల్దీప్–చహల్ ద్వయా న్ని బలవంతంగా టీమ్ విడగొట్టాల్సి వచ్చిం ది. కుల్దీప్–చహల్ కలిసి 27 మ్యాచ్‌లు ఆడితే భారత్ 20 గెలవడం దీనికి మంచి ఉదాహరణ. బ్యాటింగ్ మరీ బలహీనంగా మారిపోతుండటంతో జడేజాను తీసుకు రావాల్సి వచ్చింది.
రోహిత్ శర్మ లేకపోవడం...
కీలక ఆస్ట్రేలియా సిరీస్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆడకపోవడం మాత్రం కచ్చితంగా జట్టుకు లోటే. ధావన్‌కు సరి జోడిగా ఉండే రోహిత్‌తో పోలిస్తే మయాంక్, శుబ్‌మన్ గిల్‌ల అనుభవం చాలా చాలా తక్కువ. తొలి రెండు వన్డేల్లో కూడా భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో రోహిత్ శర్మ ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. వన్డేల్లో అతని అద్వితీయ రికార్డు, ఆస్ట్రేలియాపై గత ప్రదర్శనను చూస్తే రోహిత్ విలువేమిటో అర్థమవుతుంది.
విజయానికి దారి
సిరీస్ ఓటమి అనంతరం మేలుకున్న భారత్ చివరి వన్డేలో మాత్రం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను ఇచ్చింది. ముఖ్యంగా రెండు వన్డేల్లో భారీగా పరుగులు సమర్పించుకున్న బుమ్రా తన అసలు సత్తాను కీలక సమయంలో చూపించాడు. ఆసీస్ విజయానికి చేరువైన దశలో అద్భుత బంతితో మ్యాక్స్‌వెల్ వికెట్ తీసి జట్టుకు గెలుపు బాట పరిచాడు. ఆరు, ఏడు స్థానాల్లో ఆడే ఆల్‌రౌండర్లు బ్యాటింగ్‌లో ఎంత బలంగా ఉండాలో పాండ్యా, జడేజా భాగస్వామ్యం చూపించింది. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకున్న జడేజా అర్ధ సెంచరీ విజయానికి పనికొచ్చింది.
ఇక రెండు కీలక మార్పులు కూడా టీమ్‌ను విజయంవైపు నడిపించాయి. చహల్ స్థానంలో వచ్చిన కుల్దీప్, సైనీకి బదులుగా బరిలోకి దిగిన శార్దుల్ రాణించి ఆసీస్‌ను ఒత్తిడిలో పడేశారు. నిజానికి ఈ రెండు మార్పులు రెండో వన్డేలోనే చేయాల్సింది. అదే తరహాలో సిరీస్‌పై ప్రభావం చూపని మ్యాచ్ కాబట్టి నటరాజన్‌తో అరంగేట్రం చేయించడం కూడా మంచి వ్యూహం. గత కొన్ని మ్యాచ్‌లలో దూరమైన ‘పవర్‌ప్లే వికెట్’ను అందించి నటరాజన్ తన అవకాశానికి న్యాయం చేశాడు. ఐదుగురు భిన్నమైన శైలి బౌలర్లు చివరకు ఆసీస్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ వైఫల్యానికి మాత్రం ఇంకా సమాధానం లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment