
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి టీమిండియా
విరాట్ కోహ్లి అర్ధ సెంచరీ
ఆకట్టుకున్న రాహుల్, అయ్యర్
సమష్టిగా రాణించిన బౌలర్లు
ఆదివారం దుబాయ్‌లోనే ఫైనల్ పోరు
కంగారేమీ లేదు... అంతా మన నియంత్రణలోనే సాగింది... ఆస్ట్రేలియాతో ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అనగానే పెరిగే ఉత్కంఠ, ఒత్తిడి అన్నింటినీ టీమిండియా అధిగమించేసింది... ఎప్పటిలాగే టాస్ ఓడిపోవడం మినహా 11 బంతుల ముందే మ్యాచ్ ముగించే వరకు భారత్ అన్ని విధాలుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందు పదునైన బౌలింగ్‌తో... ఆపై చక్కటి బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను పడగొట్టి చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి సమరానికి అర్హత సాధించింది.
265 పరుగుల లక్ష్యం... చాంపియన్స్ ట్రోఫీ గత రెండు మ్యాచ్‌లలో భారత్ ఛేదించిన స్కోర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. బ్యాటింగ్ సాగుతున్నకొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. అయితేనేమి... కోహ్లి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో క్లాస్ ఆటతీరుతో అలవోకగా పరుగులు రాబడుతూ జట్టును నడిపించాడు. ఆరంభంలో రోహిత్, ఆపై అయ్యర్, రాహుల్, పాండ్యా... ఇలా అంతా అండగా నిలవడంతో గెలుపు భారత్ దరిచేరింది. ఆసీస్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది.
2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత్ తుది పోరులో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు ఐసీసీ వన్డే టోర్నీల్లోనూ కనీసం సెమీస్ లేదా ఫైనల్‌కు చేరి తమ స్థాయిని చూపించింది. మధ్యలో గెలిచిన టి20 వరల్డ్ కప్ దీనికి అదనం. ఇప్పుడు మరో టైటిల్ వేటలో టీమిండియా ప్రత్యర్థి ఎవరో నేడు తేలనుంది. ఇదే జోరు కొనసాగిస్తే 2013 తరహాలోనే అజేయ ప్రదర్శనతో మళ్లీ మనం చాంపియన్స్ కావడం ఖాయం!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరింది. గత టోర్నీ రన్నరప్ అయిన టీమిండియా ఈసారి అజేయ ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు.
షమీ 3 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (98 బంతుల్లో 84; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 45; 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం దుబాయ్‌లోనే జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది.
రాణించిన స్మిత్...
హెడ్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ‘సున్నా’ వద్ద ఇచి్చన రిటర్న్ క్యాచ్‌ను షమీ అందుకోలేకపోవడంతో అతను బతికిపోగా, మరో ఎండ్‌లో కూపర్ కనోలీ (9 బంతుల్లో 0) విఫలమయ్యాడు. పాండ్యా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన హెడ్, షమీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ కుల్దీప్‌ను బౌలింగ్‌కు దింపింది. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్ అసలు ఫలితం సాధించింది.
వరుణ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి హెడ్ లాంగాఫ్‌లో గిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. మరోవైపు స్మిత్ సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అతనికి కొద్దిసేపు లబుషేన్ (36 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 68 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో లబుషేన్, ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 11)లను అవుట్ చేసి జడేజా దెబ్బ కొట్టాడు.
ఈ దశలో స్మిత్, కేరీ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. వీరిద్దరు కలిసి స్కోరును 200 వరకు తీసుకొచ్చారు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో షమీ ఆటను మలుపు తిప్పాడు. అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన స్మిత్ బౌల్డయ్యాడు. మ్యాక్స్‌వెల్ (5 బంతుల్లో 7; 1 సిక్స్) విఫలం కాగా, ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కేరీ దూకుడుతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది.
కీలక భాగస్వామ్యాలు...
ఛేదనలో ఆరంభంలోనే శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరగ్గా... క్రీజ్‌లో ఉన్నంత సేపు రోహిత్ శర్మ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అయితే ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, అయ్యర్ భాగస్వామ్యంతో జట్టు సురక్షిత స్థితికి చేరింది. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టీమ్‌ను విజయం దిశగా నడిపించారు.
ఈ క్రమంలో 53 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి కాగా, అయ్యర్ దానిని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 18.3 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్‌లతో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 51 వద్ద మ్యాక్స్‌వెల్ క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లికి కలిసొచ్చింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న అతను టోర్నీలో మరో శతకం అందుకునేలా కనిపించాడు.
అయితే విజయానికి 40 పరుగుల దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్ అవుటయ్యాడు. ఈ స్థితిలో హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ఛేదనను సులువు చేసింది. 20 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే జంపా ఓవర్లో పాండ్యా రెండు వరుస సిక్సర్లు బాదగా... అతను అవుటైన తర్వాత మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు.
1 చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.
7 ఐసీసీ వన్డే టోర్నీలలో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (10), రోహిత్ శర్మ (8) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
14 ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా 14 సార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా (13)ను భారత్ వెనక్కి నెట్టింది.
746 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (746 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (791 పరుగులు), మూడో స్థానంలో జయవర్ధనే (742) ఉన్నారు.
గిల్‌కు అంపైర్ వార్నింగ్
హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్‌మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా అతను బంతిని గాల్లోకి విసిరేశాడు. నిజానికి క్యాచ్ పట్టడంలో అతను ఎక్కడా తడబడలేదు.
అయితే ఎంతసేపు అనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్‌వర్త్ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది.
స్మిత్ అదృష్టం
అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్‌ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్.
రోహిత్‌కు లైఫ్
కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగుల ఇన్నింగ్స్‌లో కూడా రెండుసార్లు అదృష్టం కలిసొచి్చంది. 13 పరుగుల వద్ద బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కనోలీ వదిలేయగా... 14 వద్ద కాస్త కష్టసాధ్యమైన క్యాచ్‌ను లబుషేన్ అందుకోలేకపోయాడు.
పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు.
అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు.
ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్థికి అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను. –విరాట్ కోహ్లి
ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఇవాళ మా బ్యాటింగ్ అన్ని రకాలుగా బాగుంది. పిచ్ కూడా మెరుగ్గా అనిపించింది. అయితే పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం.
దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం. కోహ్లి ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్
4 ఐసీసీ ఈవెంట్లు... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లలో భారత్‌ను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
336 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న భారతీయ ఫీల్డర్‌గా కోహ్లి ఘనత వహించాడు. 334 క్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న రెండో ఫీల్డర్‌గానూ కోహ్లి (161 క్యాచ్‌లు) నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్ధనే (218 క్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) గిల్ (బి) వరుణ్ 39; కనోలీ (సి) రాహుల్ (బి) షమీ 0; స్మిత్ (బి) షమీ 73; లబుషేన్ (ఎల్బీ) (బి) జడేజా 29; ఇన్‌గ్లిస్ (సి) కోహ్లి (బి) జడేజా 11; కేరీ (రనౌట్) 61; మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 7; డ్వార్‌షూయిస్ (సి) అయ్యర్ (బి) వరుణ్ 19; జంపా (బి) పాండ్యా 7; ఎలిస్ (సి) కోహ్లి (బి) షమీ 10; తన్విర్ సంఘా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 264. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–110, 4–144, 5–198, 6–205, 7–239, 8–249, 9–262, 10–264. బౌలింగ్: షమీ 10–0–48–3, హార్దిక్ పాండ్యా 5.3–0–40–1, కుల్దీప్ యాదవ్ 8–0–44–0, వరుణ్ చక్రవర్తి 10–0–49–2, అక్షర్ పటేల్ 8–1–43–1, రవీంద్ర జడేజా 8–1–40–2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కనోలీ 28; గిల్ (బి) డ్వార్‌షూయిస్ 8; కోహ్లి (సి) డ్వార్‌షూయిస్ (బి) జంపా 84; అయ్యర్ (బి) జంపా 45; అక్షర్ (బి) ఎలిస్ 27; రాహుల్ (నాటౌట్) 42; పాండ్యా (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఎలిస్ 28; జడేజా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–134, 4–178, 5–225, 6–259. బౌలింగ్: డ్వార్‌షూయిస్ 7–0–39–1, ఎలిస్ 10–0–49–2, కనోలీ 8–0–37–1, జంపా 10–0–60–2, సంఘా 6–0–41–0, మ్యాక్స్‌వెల్ 6.1–0–35–0, హెడ్ 1–0–6–0.
Comments
Please login to add a commentAdd a comment