భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో ఏ ఆటగాడు టాప్ స్కోరర్‌గా నిలుస్తాడన్న డిస్కషన్ ఇప్పటి నుంచే మొదలైంది. ఇరు జట్ల బ్యాటింగ్ బలాబలాలు సమతూకంగా ఉండటంతో ఎవరు అధిక పరుగులు చేస్తారని చెప్పడం కాస్త కష్టమైన పనే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
కొందరు విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, పుజారాల పేర్లు చెబుతుంటే.. మరి కొందరు స్టీవ్ స్మిత్, లబూషేన్, ట్రవిస్ హెడ్‌లలో ఎవరో ఒకరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారని అభిప్రాయపడుతున్నారు. అంచనాలు, అభిప్రాయాలు పక్కన పెట్టి, ఇరు జట్ల ఆటగాళ్ల తాజా ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లిలలో ఎవరో ఒకరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో వీరిద్దరు భీకర ఫామ్‌లో ఉండి పరుగులు వరద పారించారు. గిల్ 17 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు సాయంతో 890 పరుగులు చేయగా.. కోహ్లి 14 మ్యాచ్‌ల్లో 2 సెంచరీల సాయంతో 639 పరుగులు చేశాడు. వీరిద్దరు ఇదే ఫామ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కొనసాగిస్తే, సెంచరీల మోత మోగి పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వీరిద్దరే కాక టీమిండియాలోనే మరో ఇద్దరికి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ టాప్ స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులకు అతికినట్లు సరిపోయే పుజారా, ఓవల్ మైదానంలో మంచి ట్రాక్ రికార్డు (గత మ్యాచ్‌లో సెంచరీ) కలిగిన రోహిత్ శర్మకు కూడా అధిక పరుగులు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఆసీస్ బ్యాటర్ల అవకాశాలను కూడా తీసి పారేయడానికి వీలు లేదు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్‌లలో ఎవరో ఒకరు టాప్ స్కోరర్‌గా నిలువవచ్చు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరు రాణిస్తారో తేలాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.
చదవండి: ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే.. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర!
Comments
Please login to add a commentAdd a comment