Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి | Champions Trophy 2025, IND VS AUS 1st Semi Final: Virat Kohli Created History, Takes Most Catches For India In International Cricket | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

Published Tue, Mar 4 2025 5:02 PM | Last Updated on Tue, Mar 4 2025 5:30 PM

Champions Trophy 2025, IND VS AUS 1st Semi Final: Virat Kohli Created History, Takes Most Catches For India In International Cricket

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈసారి విరాట్‌ బ్యాటర్‌గా కాకుండా ఫీల్డర్‌గా ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో జోస్‌ ఇంగ్లిస్ క్యాచ్‌ పట్టుకున్న విరాట్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. 

ఇంగ్లిస్‌ క్యాచ్‌కు ముందు ఈ రికార్డు విరాట్‌, రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లో చెరి 334 క్యాచ్‌లు పట్టారు. ఇంగ్లిస్‌ క్యాచ్‌తో విరాట్‌ సోలోగా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లు) ఇప్పటివరకు 657 ఇన్నింగ్స్‌ల్లో పాల్గొని 335 క్యాచ్‌లు అందుకోగా.. రాహుల్‌ ద్రవిడ్‌ 571 ఇన్నింగ్స్‌ల్లో 334 క్యాచ్‌లు పట్టాడు. 

భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్‌, ద్రవిడ్‌ తర్వాత మహ్మద్‌ అజహరుద్దీన్‌ (261), సచిన్‌ టెండూల్కర్‌ (256) ఉన్నారు.

ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు మహేళ జయవర్దనే పేరిట ఉంది. జయవర్దనే 768 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు పట్టాడు. ఈ జాబితాలో జయవర్దనే తర్వాత రికీ పాంటింగ్‌ (364), రాస్‌ టేలర్‌ (351) జాక్‌ కల్లిస్‌ (338) ఉన్నారు. విరాట్‌ 335 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ విషయానికొస్తే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ కూపర్‌ కన్నోలిని షమీ డకౌట్‌ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపు ట్రవిస్‌ హెడ్‌ మెరుపులు మెరిపించాడు. హెడ్‌ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

అనంతరం కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌ కొద్ది సేపటి వరకు వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా లబూషేన్‌ను (29) బోల్తా కొట్టించాడు. ఆతర్వాత వచ్చిన జోస్‌ ఇంగ్లిస్‌ (11) కొద్ది సేపే క్రీజ్‌లో నిలబడి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

ఇంగ్లిస్‌ తర్వాత బరిలోకి దిగిన అలెక్స్‌ క్యారీ ధాటిగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టాస్తున్నాడు. స్టీవ్‌ స్మిత్‌, క్యారీ ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. స్టీవ్‌ స్మిత్‌ 71, క్యారీ 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 36 ఓవర్ల అనంతరం ఆసీస్‌ స్కోర్‌ 195/4గా ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, షమీ, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్‌ తీశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement