
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 265 పరుగుల ఛేదనలో విరాట్ 98 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ చరిత్రపుట్లోకెక్కాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లి-1003
రోహిత్ శర్మ-808
రికీ పాంటింగ్-731
ఈ మ్యాచ్‌లో విరాట్ మరో రికార్డు కూడా సాధించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (24) చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (23) పేరిట ఉండేది. తాజా హాఫ్ సెంచరీతో విరాట్ తన పేరిట ఉండిన మరో రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో విరాట్ తన హాఫ్ సెంచరీల సంఖ్యను 10కి పెంచుకున్నాడు. ఐసీసీ నాకౌట్స్‌లో సచిన్, స్టీవ్ స్మిత్ తలో ఆరు అర్ద సెంచరీలు చేశారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.
స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment