
ఆటగాళ్ల కుటుంబ సభ్యులను విదేశీ పర్యటనలకు అనుమతించే విషయంలో తమ నిర్ణయం మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసింది. జట్టుతో పాటు బోర్డుకు కూడా ఇదే మంచిదని పేర్కొంది. ఈ విషయంలో ఆటగాళ్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని.. అయితే, తాము జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరించక తప్పదని తెలిపింది.
ఈ మేరకు బోర్డు తరఫున.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) తమ స్పందన తెలియజేశారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. 3-1తో ఓడి ఇంటిబాటపట్టింది.
ఈ పరాభవం తర్వాత.. విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై బీసీసీఐ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కుటుంబ సభ్యులను వారం రోజులు మాత్రమే అనుమతిస్తారు.
విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు
అంతకు మించి పర్యటన కొనసాగితే రెండు వారాల పాటు సన్నిహితులకు అక్కడే ఉండే వెసలుబాటు ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సన్నిహితులే సగం బలమని.. ఆటగాడి విజయం వెనుక కుటుంబ సభ్యుల పాత్రను అందరికీ వివరించలేమని పేర్కొన్నాడు.
మైదానంలో దిగని వాళ్లు, అక్కడ ఏం జరుగుతుందో తెలియని వాళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిరాశ కలిగించిందని కోహ్లి ఘాటుగా విమర్శించాడు. ప్రతి ఆటగాడు తన కుటుంబ సభ్యులు వెంట ఉంటే మరింత బాధ్యతగా ఆడతారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో యూటర్న్ తీసుకోనుందనే వార్తలు వచ్చాయి.
బీసీసీఐకి, దేశానికి ఇదే మంచిది
అయితే, అలాంటిదేమీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కొట్టిపడేశారు. ‘‘మేము ప్రవేశపెట్టిన నిబంధనలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బీసీసీఐకి, వ్యవస్థకి, జట్టుకు, దేశానికి ఇదే మంచిది.
ఈ అంశంలో ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు, మిశ్రమ స్పందన వస్తుందని తెలుసు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి.. ఎవరైనా తమ గొంతును వినిపించవచ్చు. తమ భావాలను నిర్భయంగా పంచుకోవచ్చు.
అయితే, ఈ నిబంధన విషయంలో అందరు ఆటగాళ్లూ సమానమే. జట్టులోని ప్రతి సభ్యుడు, కోచ్‌లు, మేనేజర్లు, సహాయక సిబ్బంది.. ఇలా అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.
రాత్రికి రాత్రే హడావుడిగా ఈ విధానాన్ని మేము ప్రవేశపెట్టలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని మా అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఈ పాలసీ తీసుకువచ్చారు.
నిజానికి గతంతో పోలిస్తే విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులను అనుమతించే విషయమై మేము ఆటగాళ్లకు చాలా వరకు మినహాయింపులు ఇచ్చాం. అయితే, ఇప్పుడు ఈ రూల్ కాస్త కఠినంగా అనిపించినా.. తప్పక అమలు చేస్తాం’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
చదవండి: IPL 2025: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment