భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకువచ్చిన ‘పది సూత్రాల’(BCCI 10-point policy) విధానాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ విమర్శించాడు. ఇందులో మరీ కొత్త విషయాలేమీ లేవని.. అయినా.. హెడ్‌కోచ్‌కు వీటితో ఏం అవసరం అని ప్రశ్నించాడు. గౌతం గంభీర్(Gautam Gambhir) ఆటగాళ్ల విషయంలో అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేశాడు.
గంభీర్ సూచనల మేరకు!
కాగా స్టార్లు... సీనియర్లు... దిగ్గజాలు... ఇలా జట్టులో ఎంత పేరు మోసిన క్రికెటర్లున్నా సరే... ఇకపై అంతా టీమిండియా సహచరులే! పెద్దపీటలు, ప్రాధామ్యాలంటూ ఉండవు. అందరూ ఒక జట్టే! ఆ జట్టే భారత జట్టుగా బరిలోకి దిగాలని బలంగా బోర్డు నిర్ణయించింది.
హెడ్‌కోచ్ గంభీర్ సూచనల్ని పరిశీలించడమే కాదు... అమలు చేయాల్సిందేనని కృతనిశ్చయానికి వచ్చిన బీసీసీఐ ఇకపై ‘పటిష్టమైన జట్టుకు పది సూత్రాలు’ అమలు చేయబోతోంది.
ఈ సూత్రాలను పాటించని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మ్యాచ్ ఫీజుల్లో కోత లేదంటే కాంట్రాక్ట్ స్థాయిల్లో మార్పులు, చివరగా ఐపీఎల్‌లో పాల్గొనకుండా దూరం పెట్టేందుకూ వెనుకాడబోమని బీసీసీఐ హెచ్చరించింది.
పది సూత్రాలు ఇవే
దేశవాళీ మ్యాచ్‌లు ఆడటం తప్పనిసరి చేసిన బీసీసీఐ.. టోర్నీలు జరుగుతుంటే బ్రాండ్–ఎండార్స్‌మెంట్లు కుదరవని కరాఖండిగా చెప్పింది. అదే విధంగా ప్రతి ఆటగాడు జట్టుతో పాటే పయనం చేయాలని సూచించింది.
వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు విధించడంతో పాటు.. ‘అదనపు’ లగేజీ భారాన్ని ప్లేయర్లపైనే మోపాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఆటగాళ్లు కలసికట్టుగా ప్రాక్టీస్‌కు రావాలని, బోర్డు సమావేశాలకు కూడా తప్పక అందుబాటులో ఉండాలని పేర్కొంది.
ఇక మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కూడా ఇష్టారీతిన కాకుండా.. కలిసికట్టుగానే హోటల్ గదులకు వెళ్లాలని.. గదుల్లోనూ కలిసిమెలిసే బస చేయాలని చెప్పింది. కుటుంబసభ్యుల అనుమతికీ పరిమితులు విధించింది.
అప్పుడూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి
ఈ నేపథ్యంలో దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బీసీసీఐ ట్రావెలింగ్ పాలసీ(Travel Policy) గురించి మీడియాలో వచ్చిన కథనాలు చూసినప్పుడు.. నాకేమీ కొత్త విషయాలు కనిపించలేదు.
సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌గా నేను టీమిండియాకు ఆడుతున్న సమయంలోనూ ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. బీసీసీఐ చెప్పినట్లుగా భావిస్తున్న పది సూత్రాలలో తొమ్మిది అప్పట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల అనుమతి, ఒకే హోటల్‌లో బస చేయడం, ప్రాక్టీస్ అంశం.. ఇలా అన్నీ పాతవే. మరి వీటిని ఎప్పుడు ఎవరు మార్చారు?
కొత్తవి అని మళ్లీ ఎందుకు చెబుతున్నారు. ఈ అంశంపై కచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే. అయినా, మేము టీమిండియాకు ఆడేటపుడు సెలవు లేదంటే మరేదైనా విషయంలో అనుమతి కావాల్సి వచ్చినపుడు బీసీసీఐకి నేరుగా మెయిల్ చేసేవాళ్లం. లేదంటే.. నేరుగానే పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకునే వాళ్లం.
ఎవరి పని వారు చూసుకుంటే మంచిది
అయినా.. హెడ్‌కోచ్ ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నాడు? అతడి పని ఇది కాదు కదా! కేవలం మైదానంలో ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న అంశం మీదే అతడి దృష్టి ఉండాలి. మన జట్టులో ఇప్పుడు అదే లోపించింది.
అడ్మినిస్ట్రేషన్ విషయాలను బీసీసీఐలో ఉన్న సమర్థులైన వ్యక్తులకు అప్పగించి.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది’’ అని భజ్జీ గంభీర్‌కు చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓటమి విషయం.. ఇలాంటి చర్చల ద్వారా పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నాడు.
చదవండి: ఫామ్‌లో ఉన్నా కరుణ్ నాయర్‌ను సెలక్ట్ చేయరు.. ఎందుకంటే: డీకే
Comments
Please login to add a commentAdd a comment