దీప్తి ఆల్‌రౌండ్‌ షో | India Wons Womens World Cup Opener Against Sri Lanka By 59 Runs, Check Out Score Details And Match Highlights | Sakshi
Sakshi News home page

IND W Vs SL W: దీప్తి ఆల్‌రౌండ్‌ షో

Oct 1 2025 6:02 AM | Updated on Oct 1 2025 11:37 AM

India wons Womens World Cup opener against Sri Lanka by 59 runs

భారత మహిళల శుభారంభం

శ్రీలంకపై 59 పరుగులతో జయభేరి

రాణించిన హర్లీన్, అమన్‌జోత్‌

ఈనెల 5న పాకిస్తాన్‌తో టీమిండియా పోరు

మహిళల వన్డే ప్రపంచకప్‌  

గువాహటి: సొంతగడ్డపై అట్టహాసంగా ఆరంభమైన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ సాధించిన దీప్తి శర్మ బౌలింగ్‌లో కీలక వికెట్లతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచింది. దీంతో మంగళవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 59 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌... వర్షం వల్ల కుదించిన 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీప్తి శర్మ (53 బంతుల్లో 53; 3 ఫోర్లు), అమన్‌జోత్‌ కౌర్‌ (56 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రాణించారు. లంక బౌలర్లలో ఇనొక రణవీర 4 వికెట్లు, ప్రబోధని 2 వికెట్లు తీశారు. అనంతరం దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (47 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుగ్గా ఆడింది. దీప్తి (3/54) సహా భారత బౌలర్లు స్నేహ్‌ రాణా (2/32), ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి శ్రీచరణి (2/37), క్రాంతి (1/41), అమన్‌జోత్‌ (1/37), ప్రతిక (1/6) సమష్టిగా ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టారు.  

అమన్‌జోత్‌తో నడిపించి... బౌలింగ్‌తో గెలిపించి... 
భారత వెటరన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌ షోకు శ్రీలంక కుదేలైంది. ప్రతీక (37; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హర్లీన్‌ డియోల్‌ (64 బంతుల్లో 48; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ మరోవైపు కీలక స్టార్లు స్మృతి మంధాన (8), హర్మన్‌ప్రీత్‌ (21), జెమీమా (0), రిచా ఘోష్‌ (2) విఫలమవడంతో 124/6 స్కోరు వద్ద భారత్‌ పనైపోయిందనిపించింది. ఈ దశలో దీప్తి, అమన్‌జోత్‌తో కలిసి భారత్‌ను నడిపించింది. లంక అమ్మాయిల చెత్త ఫీల్డింగ్‌తో అమన్‌జోత్‌ మూడుసార్లు 18, 37, 50 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడింది. 

ఇద్దరు అర్ధసెంచరీ పూర్తి చేసుకొని జట్టును ఒడ్డుకు చేర్చారు. ఏడో వికెట్‌కు 99 బంతుల్లో 103 పరుగులు జోడించాక ముందుగా అమన్‌జోత్, అనంతరం దీప్తి అవుటయ్యారు. ఆఖర్లో స్నేహ్‌ రాణా (15 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించింది. తర్వాత కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. ఓపెనర్, కెపె్టన్‌ చమరి ఆటపట్టు, వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్షిత (29; 3 ఫోర్లు), మిడిలార్డర్‌లో నీలాక్షిక సిల్వా (29 బంతుల్లో 35; 4 ఫోర్లు; 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారంతే! మిగతా బ్యాటర్లను భారత బౌలింగ్‌ దళం క్రీజులో నిలువనీయలేదు.

స్కోరు వివరాలు
భారత మహిళల ఇన్నింగ్స్‌: ప్రతిక రావల్‌ (సి) విష్మి (బి) ఇనొక 37; స్మృతి మంధాన (సి) విష్మి (బి) ప్రబోధని 8; హర్లీన్‌ డియోల్‌ (సి) దిల్హారి (బి) ఇనొక 48; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) సంజీవని (బి) ఇనొక 21; జెమీమా రోడ్రిగ్స్‌ (బి) ఇనొక 0; దీప్తి శర్మ (సి) సుగంధిక (బి) అచిని 53; రిచా ఘోష్‌ (సి) ప్రబోధని (బి) చమరి 2; 
అమన్‌జోత్‌ (సి) విష్మి (బి) ప్రబోధని 57; స్నేహ్‌ రాణా (నాటౌట్‌) 28; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (47 ఓవర్లలో 8 వికెట్లకు) 269. 
వికెట్ల పతనం: 1–14, 2–81, 3–120, 4–120, 5–121, 6–124, 7–227, 8–269. 
బౌలింగ్‌: అచిని కులసూర్య 8–0–42–1, ఉదేíÙక ప్రబోధని 10–1–55–2, సుగంధిక 9–0–46–0, కవిశా దిల్హారి 8–0–51–0, ఇనొక రణవీర 9–0–46–4, చమరి 3–0–24–1. 

 



శ్రీలంక మహిళల ఇన్నింగ్స్‌: హాసిని (బి) క్రాంతి గౌడ్‌ 14; చమరి (బి) దీప్తి శర్మ 43; హర్షిత (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 29; విష్మి గుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) అమన్‌జోత్‌ 11; కవిశా (సి) రిచా ఘోష్‌ (బి) దీప్తి 15; నీలాక్షిక (బి) స్నేహ్‌ రాణా 35; అనుష్క (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) దీప్తి 6; సుగంధిక (బి) స్నేహ్‌ రాణా 10; అచిని (సి) స్మృతి (బి) శ్రీచరణి 17; ప్రబోధని (నాటౌట్‌) 14; ఇనొక రణవీర (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రతిక రావల్‌ 3; ఎక్స్‌ట్రాలు 14; 
మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్‌) 211. 
వికెట్ల పతనం: 1–30, 2–82, 3–103, 4–105, 5–130, 6–140, 7–173, 8–184, 9–199, 10–211. 
బౌలింగ్‌: క్రాంతి గౌడ్‌ 9–0–41–1, అమన్‌జోత్‌ 6–0–37–1, స్నేహ్‌ రాణా 10–0–32–2, దీప్తి శర్మ 10–1–54–3, శ్రీచరణి 8–0–37–2, ప్రతిక 2.4–0–6–1.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement