న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఎప్పుడంటూ తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు భారత మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ సమాధానమిచ్చింది. తన సుదీర్ఘ కెరీర్‌ను వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌తో ముగిస్తానంటూ ఆమె ఆదివారం ప్రకటించింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ హైదరాబాదీ... 2021లో న్యూజిలాండ్ వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. ‘2021 వన్డే ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది. అప్పడు భారతే టైటిల్‌ను గెలుస్తుందని భావిస్తున్నా.
ఒకవేళ అదే జరిగితే భారత్‌లో మహిళల క్రికెట్ అభివృద్ధికి గొప్ప మలుపు అవుతుంది. ఎందరో అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. 2017 ప్రపంచకప్ ఫైనల్ ప్రభావం మనం ఇప్పుడు చూస్తున్నాం’ అని మిథాలీ వివరించింది. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటితో పోలిస్తే ఇప్పుడు మహిళా క్రికెటర్లకు మంచి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల తరహాలో ఐసీసీ ఈవెంట్‌లలో ఇప్పుడు భారత్ కూడా టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోందన్న ఆమె... దీనికి ఆటగాళ్ల కృషితోపాటు బీసీసీఐ సహాయక సిబ్బంది తోడ్పాటే కారణమని చెప్పింది.
‘మహిళల క్రికెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. నేను అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో విదేశీ పర్యటనల సమయంలో ఆట గురించి చాలా నేర్చుకున్నా. కానీ ఇప్పుడు షెఫాలీ వర్మ లాంటి యువ క్రీడాకారిణిలకు అరంగేట్రానికి ముందే అంతర్జాతీయ అనుభవం ఉంటుంది. దేశవాళీ టోర్నీలు, చాలెంజర్ ట్రోఫీలు ఆడటం ద్వారా వారు చాలా నేర్చుకుంటున్నారు. మాకు అప్పుడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) శిబిరాల గురించి కూడా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మహిళా క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టులు కూడా దక్కుతున్నాయి. ఆదాయం పెరగడంతో కేవలం ఆటపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతోంది’ అని మిథాలీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment