CWC Qualifiers 2023: West Indies Made World Cup Chances Complex After Defeat Against Netherlands - Sakshi
Sakshi News home page

CWC Qualifiers 2023: ఘన కీర్తి కలిగిన వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. వరల్డ్‌కప్‌ అవకాశాలు గల్లంతు

Published Tue, Jun 27 2023 8:22 AM | Last Updated on Tue, Jun 27 2023 9:10 AM

CWC Qualifiers 2023: West Indies Made World Cup Chances Complex After Defeat Against Netherlands - Sakshi

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో నిన్న (జూన్‌ 26) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమితో టూ టైమ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమితో విండీస్‌ ఖాళీ ఖాతాతో సూపర్‌ సిక్స్‌కు అడుగుపెట్టనుంది. తద్వారా ఫైనల్‌కు చేరే ఛాన్స్‌తో పాటు వరల్డ్‌కప్‌ అవకాశాలను ఆవిరి చేసుకుంది. 

సూపర్‌ సిక్స్‌కు పాయింట్లు ఎలా..?
సూపర్‌ సిక్స్‌కు క్వాలిఫై అయిన జట్టు తమతో పాటు ఆ దశకు చేరుకున్న మిగతా రెండు జట్లపై విజయం సాధించి ఉంటే, మ్యాచ్‌కు రెండు పాయింట్ల చొప్పున 4 పాయింట్లు.. ఒక జట్టుపై గెలిచి మరో జట్టు చేతిలో ఓడితే 2 పాయింట్లు.. రెండు జట్ల చేతిలో ఓడితే పాయింట్లు ఏమీ లేకుండా సూపర్‌ సిక్స్‌ దశలో అడుగుపెడతుంది.

జింబాబ్వే 4, నెదర్లాండ్స్‌ 2, వెస్టిండీస్‌ 0
గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌ సిక్స్‌కు చేరుకున్న మూడు జట్లలో ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు,నెదర్లాండ్స్‌ ఖాతాలో 2 పాయింట్లు, వెస్టిండీస్‌ ఖాతాలో 0 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌, నెదర్లాండ్స్‌లపై విజయాలు సాధించడంతో జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. జింబాబ్వే చేతిలో ఓడి, నిన్నటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంతో నెదర్లాండ్స్‌ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్‌ చేతిలో ఓడటంతో వెస్టిండీస్‌ పాయింట్లు ఏమీ లేకుండానే సూపర్‌ సిక్స్‌ దశలో పోటీపడుతుంది. 

గ్రూప్‌-బి నుంచి ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్‌ సిక్స్‌కు చేరుకుంటుంది..?
గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్‌, ఒమన్‌ జట్లు సూపర్‌ సిక్స్‌కు చేరుకున్నాయి. అయితే శ్రీలంక-స్కాట్లాండ్‌ మధ్య ఇవాళ (జూన్‌ 27) జరుగబోయే మ్యాచ్‌తో  ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్‌ సిక్స్‌కు చేరుకుంటుందో తేలిపోతుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే 4 పాయింట్లు, స్కాట్లాండ్‌ గెలిస్తే 2 పాయింట్లు.. శ్రీలంక, స్కాట్లాండ్‌ చేతుల్లో ఓడింది కాబట్టి ఒమన్‌ 0 పాయింట్లతో తదుపరి దశలో పోటీపడతాయి. 

సూపర్‌ సిక్స్‌ దశలో ఎలా..?​ 
గ్రూప్‌ దశలో సాధించిన అదనపు పాయింట్లతో (4 లేదా 2 లేదా 0) ప్రతి జట్టు సూపర్‌ సిక్స్‌ దశకు చేరుకుంటుంది. ఈ దశలో ఓ గ్రూప్‌లోని ఓ జట్టు మరో గ్రూప్‌లోని 3 జట్లతో ఒక్కో మ్యాచ్‌ అడుతుంది. అన్ని జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడిన తర్వాత టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. అలాగే ఈ రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి.

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ వరల్డ్‌కప్‌ ఆశలు ఆవిరి..
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లు కలిగిన వెస్టిండీస్‌ జట్టు.. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా ఆవిరి చేసుకుంది. పాయింట్లు ఏమీ లేకుండా సూపర్‌ సిక్స్‌ దశకు చేరిన ఆ జట్టు.. ఈ దశలో ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా 6 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. మరోవైపు జింబాబ్వే ఇప్పటికే 4 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్‌లతో ఏదో ఒక జట్లు 4 పాయింట్లతో సూపర్‌ సిక్స్‌కు చేరుతుంది.

గ్రూప్‌-ఏలో నెదర్లాండ్స్‌ ఇదివరకు 2 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్‌లతో ఓ జట్టు 2 పాయింట్లు ఖాతాలో పెట్టుకుని సూపర్‌ సిక్స్‌లో పోటీపడుతుంది. 4 పాయింట్లతో సూపర్‌ సిక్స్‌కు చేరిన జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచినా 8 పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంటాయి. ఇది కాదని విండీస్‌ సూపర్‌ సిక్స్‌ దశలో క్వాలిఫయర్స్‌లో తమకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన శ్రీలంక, స్కాట్లాండ్‌లతో తలపడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా సంచలనం నమోదైతే తప్ప విండీస్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement