బులవాయో: తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడటంతో... జింబాబ్వే జట్టు వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించలేకపోయింది. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం స్కాట్లాండ్ జట్టుతో జరిగిన తమ ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు సాధించింది. మైకేల్ లీస్క్ (48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూ క్రాస్ (38; 2 ఫోర్లు), బ్రెండన్ మెక్‌ములెన్ (34; 6 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు, చటారా రెండు వికెట్లు తీశారు.
అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. రియాన్ బర్ల్ (83; 8 ఫోర్లు, 1 సిక్స్), సికందర్ రజా (34; 2 ఫోర్లు, 1 సిక్స్), మధెవెరె (40; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ సోల్ (3/33) జింబాబ్వేను దెబ్బ కొట్టాడు. మెక్‌ములెన్, లీస్క్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 2019లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్ టోర్నీలోనే వెనుదిరిగింది.
జింబాబ్వేపై విజయంతో స్కాట్లాండ్ దాదాపుగా ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈనెల 6న నెదర్లాండ్స్‌తో జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెగా ఈవెంట్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ ఓడిపోయినా నెదర్లాండ్స్ కంటే రన్‌రేట్ తక్కువ కాకుండా చేసుకుంటే స్కాట్లాండ్‌కే ప్రపంచకప్ బెర్త్ ఖరారవుతుంది. నెదర్లాండ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. కాగా, క్వాలిఫయర్స్‌లో అజేయంగా ఉన్న శ్రీలంక, భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment