టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్‌లో ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నాడు. అతడి సారథ్యంలో అరంగేట్రం చేయడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్న ఆకాశ్ దీప్.. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం
బిహార్‌కు చెందిన ఆకాశ్ దీప్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆకాశ్.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో నాలుగో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. మూడు వికెట్లు తీశాడు.
అనంతరం న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ ఆకాశ్ దీప్ పాల్గొన్నాడు. ఆఖరి రెండు టెస్టులాడి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. పెర్త్, అడిలైడ్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.
బ్యాట్‌తోనూ రాణించి
అయితే, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో మాత్రం మేనేజ్‌మెంట్ ఆకాశ్ దీప్‌నకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 31 పరుగులు చేసి.. ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియాను తప్పించాడు.
ఇక మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో ఆకాశ్ దీప్.. రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అనంతరం గాయం కారణంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే.
ఇందుకు ప్రధాన కారణం బ్యాటర్‌గా విఫలం కావడంతో పాటు కెప్టెన్‌గానూ సరైన వ్యూహాలు అమలుచేయలేకపోవడమే అంటూ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు
‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం. ప్రతి విషయాన్ని సరళతరం చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.
ఇక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గంభీర్ సర్ కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే.. ఆటగాళ్లను మోటివేట్ చేస్తారు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తారు’’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.
సంతృప్తిగా లేను
అదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడటం వేరు. ఇక్కడ పేసర్ల పాత్ర అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ.. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్‌గా మానసికంగా, శారీరకంగా మనం బలంగా ఉంటేనే రాణించగలం.
అక్కడ ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ టూర్‌లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.
చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
Comments
Please login to add a commentAdd a comment