వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్‌ | IND Vs IRE 3rd ODI: Pratika Rawal Shatters World Record In Women Cricket, Check Out For More Details Inside | Sakshi
Sakshi News home page

IND Vs IRE 3rd ODI: వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్‌

Published Thu, Jan 16 2025 2:45 PM | Last Updated on Thu, Jan 16 2025 3:24 PM

Ind vs Ire 3rd ODI: Pratika Rawal Shatters World Record In Women Cricket

ప్రతీకా రావల్‌ (PC: BCCI Women)

సైకాలజీ స్టూడెంట్‌ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్‌లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్‌ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్‌(Pratika Rawal).

యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్‌కు పిలుపునిచ్చారు. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ ​కుడిచేతి వాటం బ్యాటర్‌.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.

వరల్డ్‌ రికార్డు బద్దలు
తాజాగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్‌.. మూడు మ్యాచ్‌లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 154 పరుగులు సాధించింది.

ఈ క్రమంలో ప్రతీకా రావల్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్‌లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 

అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్‌ భారత్‌ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్‌ప్రీత్‌ (171 నాటౌట్‌) ఆమెకంటే ముందున్నారు.  

మహిళల వన్డే క్రికెట్‌లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు
👉ప్రతీకా రావల్‌(ఇండియా)- 444 పరుగులు
👉చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌(ఇంగ్లండ్‌)- 434 పరుగులు
👉నథాకన్‌ చాంథమ్‌(థాయ్‌లాండ్‌)- 322 పరుగులు
👉ఎనిడ్‌ బేక్‌వెల్‌(ఇంగ్లండ్‌)- 316 పరుగులు
👉నికోలే బోల్టన్‌(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.

అతిపెద్ద వన్డే విజయం
రాజ్‌కోట్‌ వేదికగా ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్‌(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్‌ హాఫ్‌ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. 

ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్‌–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్‌ (491/4; 2018లో ఐర్లాండ్‌పై; 455/5; 1997లో పాక్‌పై; 440/3; 2018లో ఐర్లాండ్‌పై) పేరిటే ఉండటం విశేషం.

ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 131 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్‌పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్‌ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్‌నే ఓడించింది.    

ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్‌ను స్మృతి బృందం క్లీన్‌స్వీప్‌ చేసింది.  అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్‌ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్‌తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.

చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్‌ శర్మ, యశస్వి ప్రాక్టీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement