
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు(India Women vs Ireland Women)తో మూడో వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా భారత మహిళా క్రికెట్ వన్డే చరిత్రలో అతి భారీ గెలుపు(Largest Margin Win)ను నమోదు చేసింది. అంతేకాదు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
కాగా ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా భారత్- ఐర్లాండ్ మధ్య మూడు వన్డేలు జరిగాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఆమె స్థానంలో స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇక శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో 116 పరుగుల తేడాతో ఐరిష్ జట్టును చిత్తు చేసింది.
శతకాలతో చెలరేగిన స్మృతి, ప్రతికా
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్లు ప్రతికా రావల్(Prathika Rawal 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్- 154), స్మృతి మంధాన(80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ రిచా ఘోష్ అర్ధ శతకం(42 బంతుల్లో 59) రాణించింది.
మిగిలిన వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్(15), జెమీమా రోడ్రిగ్స్(4*), దీప్తి శర్మ(11*) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. ఈ నేపథ్యంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. మెన్స్, వుమెన్స్ వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
ఆది నుంచే ఐర్లాండ్ తడ‘బ్యా’టు
ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లలో కెప్టెన్ గాబీ లూయీస్(Gaby Lewis- 1) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కౌల్టర్ రెలీ(0) డకౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్(41)తో కలిసి ఓర్లా ప్రెరెండెర్‌గాస్ట్(36) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
చెలరేగిన భారత బౌలర్లు
అయితే, భారత బౌలర్ల ధాటికి ఈ ఇద్దరు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. సారా, ఓర్లా అవుటైన తర్వాత ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. లారా డెలానీ(10), లీ పాల్(15), అర్లెనె కెలీ(2), అవా కానింగ్(2), జార్జియానా డెంప్సీ(0), అలనా డాల్‌జెల్(5*), ఫ్రేయా సార్జెంట్(1) త్వరత్వరగా పెవిలియన్ చేరారు.
ఫలితంగా ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగగా.. తనూజ కన్వార్ రెండు వికెట్లు పడగొట్టింది. మరోవైపు.. టైటస్ సాధు, సయాలీ సట్ఘరే, మిన్ను మణి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సెంచరీతో రాణించిన ప్రతికా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మహిళల వన్డే క్రికెట్‌లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలు
👉ఐర్లాండ్‌పై రాజ్‌కోట్ వేదికగా 2025లో 304 పరుగుల తేడాతో గెలుపు
👉ఐర్లాండ్‌పై పోచెఫ్స్‌ట్రూమ్ వేదికగా 2017లో 249 పరుగుల తేడాతో గెలుపు
👉వెస్టిండీస్‌పై వడోదర వేదికగా 2024లో 211 పరుగుల తేడాతో గెలుపు
👉పాకిస్తాన్‌పై డంబుల్లా వేదికగా 2008లో 207 పరుగుల తేడాతో గెలుపు
👉పాకిస్తాన్‌పై కరాచీ వేదికగా 2005లో 193 పరుగుల తేడాతో గెలుపు.
చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్