అతడు ‘జట్టు’లో లేకుంటే.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ మనదే: అశ్విన్‌ | If he hadnt Played We Would Have Won: Ashwin Names Game Changer BGT | Sakshi
Sakshi News home page

అతడు లేకుంటే.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్‌

Published Wed, Jan 15 2025 1:33 PM | Last Updated on Wed, Jan 15 2025 1:55 PM

If he hadnt Played We Would Have Won: Ashwin Names Game Changer BGT

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎవరన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ఓ స్టార్‌ పేసర్‌ పేరు చెప్పాడు. అతడు గనుక ఆస్ట్రేలియా జట్టులో లేకపోయి ఉంటే.. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని భారత్‌ కైవసం చేసుకునేదని ఈ మాజీ ఆల్‌రౌండర్‌ అభిప్రాయపడ్డాడు. 

3-1తో గెలిచి పదేళ్ల  తర్వాత
ఏదేమైనా ఈసారి బీజీటీ ఆద్యంతం ఆసక్తిగా, పోటాపోటీగా సాగిందని అశూ హర్షం వ్యక్తం చేశాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophyబీజీటీ)లో భాగంగా భారత క్రికెట్‌ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. 

పెర్త్‌లో గెలుపొంది శుభారంభం అందుకున్న టీమిండియా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్‌లో పింక్‌ బాల్‌ టెస్టులో ఓడి.. అనంతరం బ్రిస్బేన్‌లో మూడో టెస్టు డ్రా చేసుకున్న భారత్‌.. మెల్‌బోర్న్‌, సిడ్నీల్లో మాత్రం చేతులెత్తేసింది.

తద్వారా రోహిత్‌ సేనను 3-1తో ఓడించిన కమిన్స్‌ బృందం.. పదేళ్ల తర్వాత బీజీటీని సొంతం చేసుకుంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వైఫల్యం కారణంగానే టీమిండియాకు ఇంతటి ఘోర పరాభవం ఎదురైంది. 

ఇక బ్రిస్బేన్‌ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అశ్విన్‌.. తాజాగా ఈ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌పై ప్రశంసలు కురిపించాడు.

అతడు లేకుంటే.. ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం
‘‘ప్యాట్‌ కమిన్స్‌(Pat Cummins)కు ఇదొక గొప్ప సిరీస్‌ అని చాలా మంది అంటున్నారు. నిజానికి ఈ పేస్‌ బౌలర్‌ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడంలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తూ స్కాట్‌ బోలాండ్‌ జట్టులోకి రావడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఒకవేళ బోలాండ్‌ గనుక ఈ సిరీస్‌లో ఆడకపోయి ఉంటే.. టీమిండియానే ట్రోఫీ గెలిచేది.

అయితే, ఇక్కడ నేను జోష్‌ హాజిల్‌వుడ్‌ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడటం లేదు. అతడు కూడా అద్భుతమైన బౌలర్‌. అయితే, భారత్‌తో సిరీస్‌లో మాత్రం హాజిల్‌వుడ్‌ను కొనసాగిస్తే.. విజయం మనదే అయ్యేది. 

అయితే, బోలాండ్‌ మనల్ని అడ్డుకున్నాడు. ముఖ్యంగా లెఫ్డాండర్లకు రౌండ్‌ ది వికెట్‌ బౌలింగ్‌ చేయడం ప్రభావం చూపింది’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. కాగా గాయం కారణంగా జోష్‌ హాజిల్‌వుడ్‌ దూరం కాగా.. అతడి స్థానంలో నాలుగో టెస్టు నుంచి బోలాండ్‌ బరిలోకి దిగాడు. 

ఈ సిరీస్‌లో ఆడింది కేవలం రెండు టెస్టులే ఆడినా 16 వికెట్లు పడగొట్టి.. సిరీస్‌లో మూడో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా బోలాండ్‌ నిలిచాడు. భారత కీలక బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని అనేకసార్లు అవుట్‌ చేసి.. టీమిండియాను దెబ్బకొట్టాడు. తద్వారా ఆసీస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.  

అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రా
ఇదిలా ఉంటే.. టీమిండియా పేస్‌ దళనాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా బీజీటీ 2024-25లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. అదే విధంగా.. ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌(డిసెంబరు)గా కూడా బుమ్రా ఎంపికయ్యాడు. 

ఇక ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్‌ శర్మ దూరం కాగా.. బుమ్రా సారథ్యం వహించి భారీ విజయం అందించాడు. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి రోహిత్‌ తప్పుకోగా.. మరోసారి కెప్టెన్సీ చేపట్టిన బుమ్రా.. ఈసారి మాత్రం గెలిపించలేకపోయాడు.

చదవండి: పాకిస్తాన్‌కు వెళ్లనున్న రోహిత్‌ శర్మ!.. కారణం?
పంత్‌ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement