రోహిత్ శర్మతో కోహ్లి(ఫైల్ ఫొటో)
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తీరును ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ విమర్శించాడు. దేశవాళీ క్రికెట్ ఆడే విషయంలో.. ముంబై ఆటగాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని కోహ్లికి సూచించాడు.
అదే విధంగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చెప్పిన తర్వాత కూడా రంజీల్లో ఆడే విషయమై అతడు ఇంకా మౌనం వహించడం సరికాదని అశోక్ శర్మ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్లో గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో స్వదేశంలో సిరీస్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో శతకం బాదడం మినహా మిగతా వేదికల్లో తేలిపోయాడు.
బీసీసీఐ చెప్పింది.. మౌనం వీడని కోహ్లి
అంతేకాదు.. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించి.. కోహ్లి దాదాపు ప్రతిసారీ ఒకే రీతిలో అవుటయ్యాడు. దీంతో అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురిసింది. మునుపటి లయను అందుకునేందుకు కోహ్లి ఇకనైనా రంజీల్లో ఆడాలని మాజీ క్రికెటర్లు సూచించారు.
ఇక బీసీసీఐ సైతం.. జాతీయ జట్టు విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లంతా దేశీ క్రికెట్ ఆడాలని నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి ఇంత వరకు తాను రంజీ మ్యాచ్‌లో పాల్గొనే విషయమై డీడీసీఏకే సమాచారం ఇవ్వలేదు. మరోవైపు.. మరో ఢిల్లీ స్టార్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా
ఈ పరిణామాల నేపథ్యంలో డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ స్పందించాడు. ‘‘సౌరాష్ట్రతో జనవరి 23 నుంచి రాజ్‌కోట్ మొదలయ్యే రంజీ మ్యాచ్‌కు ఢిల్లీ జట్టు తరఫున అందుబాటులో ఉంటానని రిషభ్ పంత్ చెప్పాడు. ఇక ప్రాబబుల్స్ జట్టులో విరాట్ కోహ్లి కూడా పేరు ఉంది. కానీ అతడి నుంచి ఎటువంటి సమాచారం లేదు.
దేశవాళీ క్రికెట్‌కు ముంబై క్రికెటర్లు ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ల నుంచి కోహ్లి స్ఫూర్తి పొందాలి. ఎప్పుడు వీలు దొరికినా దేశీ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేందుకు ముంబై క్రికెటర్లు అందుబాటులో ఉంటారు. వాళ్లలో ఇలాంటి గొప్ప సంస్కృతిని చూసి కోహ్లి నేర్చుకోవాలి.
దురదృష్టవశాత్తూ ఉత్తరాదిన.. ముఖ్యంగా ఢిల్లీలో మాత్రం ఆటగాళ్లలో ఇలాంటి చొరవ కనిపించడం లేదు. అయినా.. బీసీసీఐ కూడా ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని చెప్పింది. అయినప్పటికీ విరాట్ మాత్రం స్పందించడం లేదు. ఢిల్లీ తరఫున అతడు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడితే బాగుంటుంది’’ అని అశోక్ శర్మ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.
రోహన్ జైట్లీ స్పందన ఇదీ
అయితే, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ మాత్రం అశోక్ శర్మ వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించాడు. ఫిట్‌నెస్, పనిభారం దృష్ట్యా కొంత మంది క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ‘
‘విరాట్ కోహ్లి ఢిల్లీ తరఫున బరిలోకి దిగితే బాగుంటుంది. అతడు ఢిల్లీకి ఆడాలి కూడా!.. కానీ.. చాలా మంది ఫిట్‌నెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.
జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. ఒక క్రికెటర్ దేశీ క్రికెట్ ఆడేందుకు అందుబాటులో ఉండటం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల ప్రాధాన్యం ఆధారంగానే ఆటగాళ్లు నిర్ణయాలు తీసుకుంటారు’’ అని రోహన్ జైట్లీ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment