టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభోత్సవంలో భారత సారథి పాల్గొననున్నట్లు సమాచారం. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది.
వన్డే ఫార్మాట్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీని చివరగా 2017లో నిర్వహించగా.. నాడు పాక్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో పాటు నిర్వహణ హక్కులను కూడా దక్కించుకుంది.
ఇక ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ప్రదర్శన ఆధారంగా చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా.. అదే విధంగా టాప్-7లో నిలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.
తటస్థ వేదికపై
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించింది. తటస్థ వేదికపైన తమకు మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.
అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఆరంభంలో ఇందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఐసీసీ జోక్యంతో పట్టువీడింది. తాము కూడా ఇకపై భారత్‌లో ఐసీసీ టోర్నీ జరిగితే అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికపైనే ఆడతామన్న షరతుతో హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.
ఈ నేపథ్యంలో దుబాయ్(Dubai) వేదికగా భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుండగా.. ఫిబ్రవరి 16 లేదంటే 17వ తేదీన ఈ ఈవెంట్ ఆరంభ వేడుకను నిర్వహించేందుకు పాక్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం ఈ టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్లందరూ ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉంటుంది.
టీమిండియా కెప్టెన్ కూడా వస్తాడు
ఈ విషయం గురించి పాక్ బోర్డు వర్గాలు వార్తా సంస్థ(IANS)తో మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకలను పీసీబీ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ కూడా ఇందులో పాల్గొనేందుకు పాకిస్తాన్‌కు వస్తాడు. 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో ఐసీసీ ఈవెంట్ జరుగబోతోంది. దీనిని విజయవంతం చేయాలని పీసీబీ పట్టుదలగా ఉంది’’ అని పేర్కొన్నాయి.
అయితే, బీసీసీఐ రోహిత్ శర్మను పాకిస్తాన్‌కు పంపిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా జరుగనున్న మ్యాచ్‌తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
దాయాదుల సమరం ఆరోజే
ఇక క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. దాయాదుల సమరానికి దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. కాగా భారత్- పాక్ చివరగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా తలపడగా.. టీమిండియా విజయం సాధించింది.
ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన.. చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకున్న తర్వాత.. రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం టెస్టు, వన్డే జట్ల సారథిగా కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment