ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన విధ్వంసానికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా రాణించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన స్మృతి సేన ఏకంగా 435 పరుగులు సాధించింది.
నాటి రికార్డు బ్రేక్
తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు(Highest ODI total) సాధించిన భారత జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉండేది.
ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. తాజాగా స్మృతి సేన ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఈ మేర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది.
ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఐర్లాండ్(India Women Vs Ireland Women)తో తలపడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఇదిలా ఉంటే.. రాజ్‌కోట్ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు గెలిచిన భారత్.. సిరీస్‌ను 2-0తో గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డేలోనూ స్మృతి సేన ఆధిపత్యం కనబరిచింది.
ఓపెనర్ల ధనాధన్ శతకాలు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి, ప్రతికా రావల్(Pratika Rawal) శతక్కొట్టి అదిరిపోయే ఆరంభం అందించారు. స్మృతి 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించగా.. ప్రతికా భారీ సెంచరీతో దుమ్ములేపింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని ఇరవై ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 154 పరుగులు రాబట్టింది.
హాఫ్ సెంచరీతో మెరిసిన రిచా
ఇక వన్‌డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(25 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ 15 రన్స్ చేసింది.
జెమీమా రోడ్రిగెస్ 4, దీప్తి శర్మ 11 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా రికార్డు స్థాయిలో 435 పరుగులు స్కోరు చేసింది. ఐరిష్ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్‌గాస్ట్‌కు రెండు వికెట్లు దక్కగా.. అర్లెనీ కెల్లీ, ఫ్రెయా సార్జెంట్, జార్జియానా డెంప్సీ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఐర్లాండ్‌తో మూడో వన్డే సందర్భంగా స్మృతి సేన సాధించిన రికార్డులు
వుమెన్స్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు బాదిన జట్లలో మూడో స్థానం
1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 71
2. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 59
3. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్‌కోట్- 57
వుమెన్స్ వన్డేల్లో 400కిపైగా స్కోర్లు సాధించిన జట్లలో నాలుగో స్థానం
1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 491/4
2. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- 1997- క్రైస్ట్‌చర్చ్- 455/5
3. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 440/3
4. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్‌కోట్- 435/5.
చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment