
వేదిక వివరాలు వెల్లడించిన ఐసీసీ
దుబాయ్: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల వేదిక ఖరారైంది. 128 సంవత్సరాల విరామం అనంతరం విశ్వక్రీడల్లో క్రికెట్ పునరాగమనం చేస్తుండగా... ఈ పోటీలను దక్షిణ కాలిఫోర్నియాలోని పొమోనా నగరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా వివరాలు వెల్లడించారు. టి20 ఫార్మాట్‌లో పురుషుల విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ భారత్... మహిళల విభాగంలో ప్రస్తుత చాంపియన్ న్యూజిలాండ్ జట్లతో కూడిన పోస్టర్‌ను ఐసీసీ తమ సామాజిక మాధ్యమాల్లో జత చేసింది.
1900 పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్ పోటీలు నిర్వహించగా... ఈసారి లాస్ ఏంజెలిస్ వేదికగా జరగనున్న విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో టి20 ఫార్మాట్‌లో టోర్నీ నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి. ఒలింపిక్స్ ప్రధాన వేదిక లాస్ ఏంజెలిస్‌కు పొమోనా 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘పొమోనాలో జరగనున్న పోటీలతో ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేయనుంది.
విశ్వక్రీడల్లో క్రికెట్‌ను భాగం చేయడంతో ఆటకు మరింత ఆదరణ దక్కనుంది. టి20 ఫార్మాట్ ద్వారా ఇది విశ్వవ్యాప్తమై మరింత మంది అభిమానుల ఆదరణ దక్కించుకుంటుంది’ అని జై షా పేర్కొన్నాడు. 2023లో ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 141వ సమావేశంలో... విశ్వక్రీడల్లో క్రికెట్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
2010, 2014, 2023 ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల టి20 క్రికెట్ పోటీలు నిర్వహించగా... 2022 బరి్మంగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.