వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ స్థాయి పెరిగింది
ఒలింపిక్స్‌తో అందరికీ చేరువవుతుంది
యూఎస్ క్రికెట్ చైర్మన్ వేణుకుమార్ రెడ్డి వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలోనే క్రికెట్ కొత్తగా అభివృద్ధి చెందుతోంది. 2024 టి20 వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణతో స్థానికుల దృష్టి దీనిపై పడగా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగం కావడంతో మరింత ఎక్కువ మందికి ఆసక్తి పెరుగుతోంది. అయితే అమెరికన్లు పెద్దగా పట్టించుకోని సమయంలో ఆటను వారికి చేరువ చేయడంలో యూఎస్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్, తెలుగు వ్యక్తి వేణుకుమార్ రెడ్డి పిసికె పాత్ర ఎంతో ఉంది.
నల్లగొండకు చెందిన వేణు గత ఆరేళ్లుగా యూఎస్‌లో క్రికెట్‌ను విస్తృతం చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటను అమెరికన్లు తమదిగా భావించి ఇతర క్రీడల్లాగే ప్రాధాన్యత ఇచ్చేలా చేయడమే తన లక్ష్యమని వేణు ‘సాక్షి’తో చెప్పారు. ఇటీవలే భారత్‌కు వచ్చిన ఆయన బీసీసీఐ ఉన్నతాధికారులను కలిసి అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం సహకారాన్ని కూడా కోరారు.
‘టి20 వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించగలిగాం. భారత్, పాకిస్తాన్‌లతో అమెరికా తలపడిన మ్యాచ్‌లకు స్థానిక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. పాక్‌పై గెలుపుతో అమెరికన్లు కూడా ఫలితాలపై ఆసక్తి చూపించారు. ఇప్పుడు మా ముందు ఒలింపిక్స్ రూపంలో పెద్ద లక్ష్యం ఉంది. వచ్చే రెండేళ్లలో క్రికెట్ వారికి మరింత చేరువ చేయడమే మా లక్ష్యం’ అని వేణు రెడ్డి అన్నారు.
1998లో ఐటీ నిపుణుడిగా యూఎస్‌కు వెళ్లి ఆపై సగటు భారత క్రికెట్ అభిమాని తరహాలో అక్కడ క్రికెట్ టోర్నీలు, క్యాంప్‌లు నిర్వహిస్తూ వేణు ఆటకు ప్రాచుర్యం పెంచారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలలో టీమ్‌లను తయారు చేయడం ద్వారా ప్రతిభను గుర్తించే అవకాశం దక్కింది.
‘సహజంగానే భారత్ నుంచి వచ్చిన వారు, భారత మూలాల ఉన్నవారే క్రికెట్ వైపు వచ్చారు. అందరూ ఇతర ఉద్యోగాల్లో ఉంటూ క్రికెట్ ఆడేందుకు వచ్చేవారే. వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఆటకు ప్రాచుర్యం కల్పించేందుకు వాలంటీర్లు ముందుకు వచ్చారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు యూఎస్ జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులు ఇస్తున్నాం. ఇదంతా ఇన్నేళ్లలో అమెరికా క్రికెట్‌లో వచి్చన మార్పు గురించి చెబుతుంది’ అని వేణు వివరించారు.
అయితే ఇప్పటికీ అసలైన అమెరికన్లు కాకుండా ఇతర దేశాల నుంచి వస్తున్న వారే యూఎస్ క్రికెట్ జట్లలో ఎక్కువగా ఉండటం వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీనిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అలా జరిగితే క్రికెట్ కూడా యూఎస్‌లో ఇతర క్రీడల్లా దూసుకుపోతుందని వేణు అభిప్రాయపడ్డారు. ‘టి20 వరల్డ్ కప్ సమయంలో పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రతిష్టాత్మక మీడియా కంపెనీలు క్రికెట్‌పై బాగా దృష్టి పెట్టాయి.
అండర్–11 స్థాయి నుంచి అండర్–23 వరకు ఇప్పుడు వరుసగా టోర్నీలు నిర్వహిస్తున్నాం. ఈ దశలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు భాగమవుతున్నారు. జాతీయ జట్టుకు ఎంపిక చేసే ముందుకు జరిగే సెలక్షన్స్‌లో వీరంతా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో యూఎస్ టీమ్‌లో మనవారు మాత్రమే కాకుండా అమెరికన్లను కూడా చూడవచ్చు.
అయితే భారతీయుల్లో మన తెలుగువారు కూడా యూఎస్ క్రికెటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరం. సీనియర్ మహిళల క్రికెట్‌లో పగడ్యాల చేతనా రెడ్డి ఇటీవల 136 పరుగులు చేసి అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచింది’ అని వేణు గుర్తు చేశారు. ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం అమెరికాకు ఎక్కువగా రావడం లేదని... భారత్‌లోని రంజీ టీమ్‌లతో మ్యాచ్‌లు ఏర్పాటు చేసి తమ ఆటను మెరుగుపర్చుకునే అవకాశం ఇవ్వాలని ఇటీవల ఐసీసీ చైర్మన్ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలకు విజ్ఞప్తి చేసినట్లు వేణు వెల్లడించారు.
ఆసియా కప్ తరహాలో ‘నార్త్ అమెరికన్ చాంపియన్‌షిప్’ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామని, త్వరలోనే ఈ టోర్నీ జరుగుతుందని ఆయన చెప్పారు. 2018 నుంచి యూఎస్‌సీఏలో డైరెక్టర్‌గా అడుగు పెట్టిన వేణు 2023లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తన పదవీ కాలంలో యూఎస్ జట్టు 2024 టి20 టోర్నీ (ఆతిథ్య జట్టు హోదాలో), 2026 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిందని... 2027 వన్డే వరల్డ్ కప్‌కు క్వాలిఫై కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వేణు రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment