రాజ్‌కోట్: భారత పర్యటనలో ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుపై జరిమానా పడింది. భారత మహిళల జట్టుతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఐర్లాండ్ జట్టు మందకొడిగా బౌలింగ్ చేసింది. దీంతో జట్టు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. రెండు ఓవర్లు ఆలస్యం కావడంతో మ్యాచ్ రిఫరీ జి.ఎస్.లక్షి... ఐర్లాండ్ కెప్టెన్ గాబీ లూయిస్ వివరణ అనంతరం జరిమానా ఖరారు చేసింది.
‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం, కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్‌కు 5 శాతం చొప్పున మొత్తం పదిశాతం మ్యాచ్ ఫీజులో కోత విధించాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు వన్డేల సిరీస్‌ను స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి పోరులో అయితే అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 435/5 భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన, ప్రతీకలిద్దరు శతకాలతో కదంతొక్కారు. ఐర్లాండ్‌ను భారత బౌలర్లు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూల్చడంతో టీమిండియా 304 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment