
నేడు ముంబై ఇండియన్స్‌తో ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో సంచలన బాదుడుతో ప్రకంపనలు సృష్టించిన సన్‌రైజర్స్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. ఎట్టకేలకు గత పోరులో పంజాబ్ కింగ్స్‌పై భారీ స్కోరును ఛేదించి తిరిగి గెలుపు బాట పట్టింది.
గత సీజన్ నుంచి దూకుడే పరమావధిగా చెలరేగిపోతున్న సన్‌రైజర్స్ మరోసారి బ్యాటింగ్ బలాన్నే నమ్ముకొని బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. 6 మ్యాచ్‌లాడిన ఆ జట్టు 2 విజయాలు, 4 పరాజయాలతో 4 పాయింట్లు మాత్రమే సాధించింది.
గత మ్యాచ్‌లో దూకుడు మీదున్న ఢిల్లీని కట్టడి చేయడంతో ముంబై తిరిగి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో... ముంబై బౌలింగ్ మరింత పదునెక్కగా... అతడిని రైజర్స్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు మారిన ఇషాన్ కిషన్‌పై అందరి దృష్టి నిలవనుంది.
ముంచినా తేల్చినా వాళ్లే!
సన్‌రైజర్స్ ప్రధాన బలం టాపార్డర్. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌తో పాటు వన్‌డౌన్ ఆటగాడు ఇషాన్ కిషన్ సత్తా చాటితే ఆరెంజ్ ఆర్మీని ఆపడం కష్టమే. అదే సమయంలో వీళ్లు ఎక్కువసేపు నిలువలేకపోతే ఇన్నింగ్స్ గాడితప్పడం కూడా పరిపాటే. తాజా సీజన్‌ను పరిశీలిస్తే ఇది సుస్పష్టం. ఈ నేపథ్యంలో మరోసారి టాపార్డర్ రాణించాలని రైజర్స్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 246 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించిన హైదరాబాద్... ముంబైపై కూడా కలిసి కట్టుగా కదంతొక్కాలని చూస్తోంది. నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మలతో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. ఎటొచ్చి రైజర్స్‌ను బౌలింగ్ దెబ్బతీస్తోంది.
కెప్టెన్ కమిన్స్‌తో పాటు సీనియర్ పేసర్ షమీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో అయితే షమీ మరీ పేలవంగా 4 ఓవర్లలో 75 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ నిలకడ కొనసాగించాల్సిన అవసరముంది.
రోహిత్ ఫామ్‌లోకి వచ్చేనా?
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ముంబై ఇండియన్స్‌ను ఆందోళన పరుస్తోంది. సీజన్ ఆరంభం నుంచి తీవ్రంగా తడబడుతున్న రోహిత్.. ఐదు మ్యాచ్‌లాడి 56 పరుగులు మాత్రమే సాధించాడు. ఒకటీ రెండు షాట్లు ఆడటం ఆ తర్వాత అనవసరంగా వికెట్ పారేసుకోవడం హిట్‌మ్యాన్‌కు అలవాటుగా మారిపోయింది. దీంతో మిడిలార్డర్‌పై అదనపు భారం పడుతోంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్‌తో లైనప్ బలంగా ఉంది. లోయర్ ఆర్డర్‌లో విల్ జాక్స్ పెద్దగా ప్రభావం చూపలేక పోతుండటంతో... కార్బిన్ బాష్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
గాయం కారణంగా మూడు నెలలకు పైగా ఆటకు దూరమై ఇటీవలే తిరిగి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా లయ దొరకబుచ్చుకోవడంపై దృష్టి పెట్టాడు. గత మ్యాచ్‌లో కరుణ్ నాయర్‌ను నిలవరించలేకపోయిన బుమ్రా... ఆరెంజ్ ఆర్మీ దూకుడుకు పగ్గాలు వేయాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. బౌల్ట్, దీపక్ చహర్, సాంట్నర్, కరణ్ శర్మతో బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్/కార్బన్ బాష్, సాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, కరణ్ శర్మ.
సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, షమీ, జీషన్ అన్సారి, ముల్డర్.