భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఐర్లాండ్ మహిళా జట్టుతో తొలి వన్డేలోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. కేవలం 29 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు సాధించింది.
ఈ క్రమంలో స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మార్కు అందుకున్న తొలి మహిళా ప్లేయర్‌గా నిలిచింది. కాగా ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ భారత్ పర్యటన(India Women vs Ireland Women)కు వచ్చింది.
కెప్టెన్‌గా స్మృతి
ఈ సిరీస్‌కు భారత మహిళా జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరం కాగా స్మృతి సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా వన్డే సిరీస్ ఆరంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.
ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత అర్ధ శతకం(92)తో చెలరేగగా.. మిడిలార్డర్‌లో లీ పాల్(59) కూడా హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరికి తోడు లోయర్ ఆర్డర్లో అర్లెనె కెలీ 28 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. టైటస్ సాధు, దీప్ది శర్మ, సయాలీ సట్ఘరే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
నాలుగు వేల పరుగుల పూర్తి
ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్(Pratika Rawal) శుభారంభం అందించారు. మంధాన 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్రేయా సార్జెంట్ బౌలింగ్‌లో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటైంది. అయితే, ఈ క్రమంలోనే స్మృతి వన్డేల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించింది.
ఇంతకు ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించగా.. స్మృతి తాజాగా ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, మిథాలీ రాజ్ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 112 వన్డే ఇన్నింగ్స్ ఆడగా.. స్మృతి కేవలం 95 వన్డే ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించింది. తద్వారా అత్యంత వేగంగా 4 వేల వన్డే పరుగుల క్లబ్‌లో చేరిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.
వన్డేల్లో వేగంగా నాలుగు వేల పరుగుల మైలురాయికి చేరుకున్న మహిళా క్రికెటర్లు
👉బెలిండా క్లార్క్- ఆస్ట్రేలియా- 86 ఇన్నింగ్స్
👉మెగ్ లానింగ్- ఆస్ట్రేలియా- 87 ఇన్నింగ్స్
👉స్మృతి మంధాన- ఇండియా- 95 ఇన్నింగ్స్
👉లారా వొల్వర్ట్- సౌతాఫ్రికా- 96 ఇన్నింగ్స్
👉కరేన్ రాల్టన్- ఆస్ట్రేలియా- 103 ఇన్నింగ్స్
👉సుజీ బేట్స్- న్యూజిలాండ్- 105 ఇన్నింగ్స్
👉స్టెఫానీ టేలర్- వెస్టిండీస్- 107 ఇన్నింగ్స్
👉టస్మిన్ బీమౌంట్- ఇంగ్లండ్- 110 ఇన్నింగ్స్
👉మిథాలీ రాజ్- ఇండియా- 112 ఇన్నింగ్స్
👉డేబీ హాక్లీ- న్యూజిలాండ్- 112 ఇన్నింగ్స్
ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతికా రావల్ 89 పరుగులతో చెలరేగగా.. తేజస్ హసాబ్నిస్ 53 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment