టెస్టు క్రికెట్‌లో వరుస పరాభవాలు ఎదుర్కొన్న టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్ సేన.. ఆస్ట్రేలియా గడ్డపై కూడా రాణించలేకపోయింది. కంగారూ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. తద్వారా దాదాపు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తొలిసారి ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది.
పేలవ ప్రదర్శన..
ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) పూర్తిగా విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. యువ ఆటగాళ్లకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ఈ ఇద్దరు దిగ్గజాలు పేలవ ప్రదర్శనతో తేలిపోయారు. రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్లు కూడా కీలక సమయంలో చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో.. ఇంటా బయట పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా ప్లేయర్లకు... క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చురకలు అంటించాడు. భారత ఆటగాళ్లందరూ దేశవాళీల్లో ఆడాలని, ఏ ఒక్కరికీ మినహాయింపు ఇవ్వకుండా అందరూ రంజీ ట్రోఫీలో ఆడేలా చూడాలని సన్నీ సూచించాడు.
ఎవరికీ మినహాయింపు వద్దు
‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నెల 23 నుంచి రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత భారత జట్టులో నుంచి ఎంతమంది ఆటగాళ్లు అందులో పాల్గొంటారో చూడాలి. ఏ ఒక్కరికీ మినహాయింపు లేకుండా అందరూ దేశవాళీ టోర్నీలో పాల్గొనాలి.
గంభీర్ ఇప్పటికైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి
రంజీ ట్రోఫీకి అందుబాటులో లేని ఆటగాళ్ల విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తాజా ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు న్యూజిలాండ్‌పై కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శన గొప్పగా లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే అవకాశాలు ఎలాగూ లేవు.
ఈ సమయంలో తదుపరి టోర్నీ కోసం అయినా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. తమను తాము నిరూపించుకోవాలనే తపన ఉన్న ఆటగాళ్లు ముఖ్యం. రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌ల సమయంలోనే ఇంగ్లండ్‌తో భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. మరి దానికి ఎంపిక కాని వారిలో ఎంతమంది దేశవాళీ ట్రోఫీలో పాల్గొంటారో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
గంభీర్‌దీ అదే మాట
వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా భారత స్టార్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా. అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా రంజీ మ్యాచ్‌లు ఆడాల్సిందే. దేశవాళీ మ్యాచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వకపోతే జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్ ఆడే ఆసక్తి లేనట్లే.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉంది. జట్టులోని ఏ ఒక్కరి భవిష్యత్ గురించి ఇప్పుడే నేను మాట్లాడలేను. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యం గురించి కూడా ఏమీ చెప్పలేను. అయితే వారిలో పరుగులు సాధించాలనే కసి ఇంకా ఉంది.
జట్టులో అందరూ సమానమే. అందరితో ఒకే రీతిన వ్యవహరిస్తా. చివరిదైన సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవాలని రోహితే నిర్ణయించుకున్నాడు. దీంతో జట్టులో ప్రతి ఒక్కరికీ జవాబుదారీతనం ఉండాలని రోహిత్ చాటాడు’’ అని సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ వ్యాఖ్యానించాడు.
చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment