భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) గురించే చర్చ. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. దశాబ్దకాలం తర్వాత ఈమేర ఘోర పరాభవం ఎదుర్కోవడం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పెద్ద తలనొప్పిగా మారింది.
భారత్ జట్టు లోని అగ్రశ్రేణి క్రికెటర్లయిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఆస్ట్రేలియా గడ్డపై మునుపెన్నడూ లేని రీతిలో ఘోరంగా విఫలమవడం అందుకు ప్రధాన కారణం. ఈ సిరీస్ ముగించి భారత్ కి తిరిగిరాక ముందే జట్టులో లుకలుకలు మొదలయ్యాయి.
భారత్ క్యాంప్‌లో విభేదాలు ఉన్నాయని, జట్టు ఓటమికి ఇదే ముఖ్య కారణమని విమర్శలు వచ్చాయి. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ టీం మేనేజిమెంట్ జట్టు కూర్పులో సరైన నిర్ణయాలు తీసుకోలేదనేది ఈ విమర్శల సారాంశం.
గుర్రుగా ఉన్న అగార్కర్!
ఈ నేపథ్యంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియా జట్టు వైఫల్యాన్ని సమీక్షించడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలవడానికి సిద్దమౌతున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో సెలెక్టర్లు, బోర్డులోని ప్రధాన అధికారుల మధ్య అనేక అధికారిక, అనధికారిక సమావేశాలు జరుగుతాయని.. భారత్ టెస్ట్ క్యాలెండర్, జట్టు ఆస్ట్రేలియాలో పేలవమైన ప్రదర్శన గురించి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గంభీర్ బాధ్యత ఎంత?
భారత్ జట్టు వైఫల్యానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుడు నిర్ణయాలు ఒక కారణమని, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత భారత్ జట్టు పతనం ప్రారంభమైందని భజ్జీ వ్యాఖ్యానించాడు. భారత్ జట్టు టి 20 ప్రపంచ కప్ విజయం సాధించిన అనంతరం ద్రావిడ్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాడు.
'గత ఆరు నెలల్లో శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. రాహుల్ ద్రవిడ్ జట్టు కోచ్‌గా ఉన్నంత వరకు అంతా బాగానే ఉంది. భారత్ T20 ప్రపంచ కప్ చేజిక్కించుకుంది. అయితే గంభీర్ పదవిని చేప్పట్టినుంచే భారత్ జట్టు పతనం ప్రారంభమైంది," అని భజ్జీ వ్యాఖ్యానించాడు.
'ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి'
జాతీయ సెలెక్టర్లు ఫామ్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలని హర్భజన్ కోరుతున్నాడు. “మీరు పేరు ప్రతిష్టల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలనుకుంటే, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, ఇతర మ్యాచ్ విన్నర్లను జట్టులో చేర్చుకోండి. బీసీసీఐ, సెలక్టర్లు సూపర్ స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలి' అని భజ్జీ హితవు పలికాడు. ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిందనేది భజ్జీ వాదన.
సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడాన్ని హర్భజన్ సింగ్ విమర్శించాడు. "అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు తీసుకెళ్లారు, కానీ అతనికి ఆడే అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తే కదా సరైనా రీతిలో రాణిస్తున్నాడో లేదో తెలుస్తుంది. సర్ఫరాజ్ విషయంలోనూ అదే తప్పిదం జరిగిందని," హర్భజన్ పేర్కొన్నాడు.
ఇక ఇంగ్లండ్ పర్యటన(టెస్టులు)కు ఏడు నెలల వ్యవధి ఉన్నందున భారత్ జట్టు పునర్నిర్మాణానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. "బంతి ఇప్పుడు సెలెక్టర్ల కోర్టులో ఉంది. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నా" అని హర్భజన్ ముగించాడు.
చదవండి: ‘బుమ్రాను అస్సలు కెప్టెన్ చేయకండి.. కెప్టెన్సీకి వాళ్లే బెటర్ ఆప్షన్’
Comments
Please login to add a commentAdd a comment