
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు సమయం ఆసన్నమవుతోంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. అయితే, ఈ ఐసీసీ టోర్నీకి భారత జట్టు ఎంపిక చేసే విషయంలో అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే టోర్నమెంట్ ముగిసే వరకు వేచి చూడాలని భావిస్తున్నట్టు సమాచారం.
నాయర్ ఒక్కడే కాదు.. అతడూ రేసులోకి వచ్చేశాడు!
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు సీనియర్ బ్యాట్స్మన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇద్దరూ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక చర్చనీయంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్ తన పరుగుల ప్రవాహం తో సెలెక్టర్ల పై ఒత్తిడి పెంచాడు.
తాజాగా 24 ఏళ్ళ ఎడమచేతి వాటం కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా ఈ జాబితా లో చేరాడు. బుధవారం విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో హర్యానాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తన నిలకడైన బ్యాటింగ్ తో పడిక్కల్ కర్ణాటక జట్టుకి ఫైనల్ బెర్త్ ని ఖాయం చేసాడు. పడిక్కల్ లిస్ట్-‘ఎ’ ఫార్మాట్ లో వరుసగా తన ఏడో హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.
కాగా హర్యానాతో 238 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక మొదటి ఓవర్‌లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ వికెట్‌ని కోల్పోయింది.
అయితే ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన నుండి తిరిగి వచ్చిన పడిక్కల్ 86 పరుగులు సాధించడమే కాక స్మరణ్ రవిచంద్రన్ (76 పరుగులు )తో కలిసి మూడో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో కర్ణాటక ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
కోహ్లీ రికార్డుని అధిగమించిన పడిక్కల్
ఈ ఇన్నింగ్స్ లో భాగంగా పడిక్కల్ లిస్ట్ ఎ క్రికెట్‌లో 2000 పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. పడిక్కల్ 82.38 సగటుతో ఈ ఘనతను సాధించాడు. ఈ ఫార్మాట్‌లో కనీసం 2000 పరుగులు చేసిన బ్యాటర్లలో ఇదే అత్యధికం.
మరో భారత్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (58.16), ఆస్ట్రేలియాకు చెందిన మాజీ బ్యాటర్ మైఖేల్ బెవాన్ (57.86), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (57.05), దక్షిణాఫ్రికాకి చెందిన ఎబి డివిలియర్స్ (53.47) వంటి టాప్ బ్యాటర్‌ని పడిక్కల్ అధిగమించడం విశేషం.
రోహిత్, కోహ్లీలకు మరో ఛాన్స్?
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ఎంపిక చేయడం ఖాయంగా కనబడుతోంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ లపై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.
ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో పరాజయం చవిచూడటమే కాక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుండి కూడా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి పై భారత్ అభిమానులు తీవ్ర అసంతృప్తి గా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే దుబాయ్ పిచ్‌లు భారత్ బ్యాటర్లకి అనుకూలంగా ఉండే కారణంగా, ఎంతో అనుభవం ఉన్న రోహిత్, కోహ్లీ లను ఛాంపియన్స్ ట్రోఫీ కి తప్పనిసరిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ లో వీరి ఆటతీరును బోర్డు నిశితంగా పరిశీలిస్తునడంలో సందేహం లేదు.
చదవండి: Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు?
Comments
Please login to add a commentAdd a comment