
ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియాను ఢీ కొట్టేందుకు న్యూజిలాండ్ సిద్ధంగా ఉంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టులోని భారత సంతతి బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra), మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) సెంచరీలు సాధించారు.
రికార్డ్-బ్రేకర్ల మధ్య ఉత్కంఠమైన పోటీ
ఇక టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఓ ఆసక్తికర పోటీ చూడబోతున్నాం. ఫ్యాబ్ ఫోర్‌లో భాగమైన కేన్ విలియమ్సన్ , విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అనేక రికార్డులు బద్దలు కొడుతున్నారు. మార్చి 9 ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈ ఇద్దరు గొప్ప బ్యాటర్ల మధ్య జరిగే పోటీని ప్రధాన పోరుగా అభివర్ణించవచ్చు.
ఎందుకంటే జట్టులో వీరిద్దరిదీ బాధ్యత ఒక్కటే. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక వైపు దృఢంగా నిలబడడం లేదా కాపు కాయడం. పరుగుల ప్రవాహాన్ని కొనసాగించడం. దీని ద్వారా ప్రత్యర్థి బౌలర్లకు బ్యాటర్‌పై పట్టు సాధించుకుండా నిరోధించడం. ఇందుకోసం వీరిద్దరూ ఆఖరి ఓవర్ వరకూ బ్యాటింగ్ చేయాలని చూస్తారు.
విజేతను తేల్చేది ఆ ఇద్దరే!
ఈ ప్రయత్నం లో వీరిద్దరూ సఫలమైతే వారి జట్టుకి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ వారి జట్లలో ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమైపోతుంది.
ఇక మంగళవారం దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఆడిన తీరు అందరికీ తెలిసిందే. కోహ్లీ ఎంతో నింపాదిగా ఆడి భారత్ ఇన్నింగ్స్ కి వెన్నెముక గా నిలిచాడు. కోహ్లీ.. శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్‌లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కివీస్ విజయంలో కేన్ పాత్ర
దక్షిణాఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా కేన్ అదే రీతిలో ఆడాడు. విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఇద్దరూ సెంచరీలు సాధించి తమ జట్టు 362/6 పరుగుల భారీ స్కోరును చేరుకోవడానికి సహాయపడ్డారు. రవీంద్ర 108 పరుగులు చేయగా, విలియమ్సన్ తన 102 పరుగులు సాధించాడు. ఈ జంట రెండవ వికెట్‌కు ఏకంగా 164 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టారు.
ఈ ఇన్నింగ్స్ లో భాగంగా 34 ఏళ్ల కేన్ విలియమ్సన్ 19000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. ఈ రికార్డును సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా ఖ్యాతి వహించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (432 ఇన్నింగ్స్), బ్రియాన్ లారా (433 ఇన్నింగ్స్) తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో ఈ రికార్డ్ ని వేగవంతంగా సాధించిన వారిలో విలియమ్సన్ నాలుగో వాడు. ఈ ఘనతను నమోదు చేయడానికి న్యూజిలాండ్ దిగ్గజం 440 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అతను వన్డే ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్ల ల లో 16వ స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లో విరాట్ కోహ్లీ
భారత్ ‘రన్ మెషిన్’గా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ 301 వన్డే మ్యాచ్‌ల్లో సగటు 58.11 సగటుతో 14,180 పరుగులు చేశాడు, ఇందులో 51 సెంచరీలు మరియు 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ స్ట్రైక్ రేట్ 93.35.
వన్డేల్లో కేన్ విలియమ్సన్
ఎప్పడూ ప్రశాంతంగా, నిబ్బరంగా బ్యాటింగ్ చేసే విలియమ్సన్ 172 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో అతను 49.47 సగటు తో 81.72 స్ట్రైక్ రేట్‌తో 7,224 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు మరియు 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఈ ఇద్దరు స్టార్లలో ఎవరు ఫైనల్లో పైచేయి సాధిస్తారన్న దాని పైనే టైటిల్ విజేత నిర్ణయించబడుతుందనడం లో సందేహం లేదు. గణాంకాల ఆధారంగా చుస్తే విరాట్ కోహ్లీ మరింత ఆధిపత్యం చెలాయించే అవకాశం కనిపిస్తుంది. కానీ మ్యాచ్ ఫైనల్ మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగడం ఖాయం. మరి ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి లో ఎవరు మెరుస్తారో మ్యాచ్ రోజున స్పష్టంగా తెలుస్తుంది.
చదవండి: అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment