Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా అతడు ఫిక్స్‌!.. వారిపై వేటు? | Ind vs Eng: India to hold 3 Day Camp Sitanshu Kotak to join As Batting Coach: Report | Sakshi
Sakshi News home page

Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా అతడు ఫిక్స్‌!.. వారిపై వేటు?

Published Thu, Jan 16 2025 7:43 PM | Last Updated on Thu, Jan 16 2025 8:04 PM

Ind vs Eng: India to hold 3 Day Camp Sitanshu Kotak to join As Batting Coach: Report

టెస్టుల్లో వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా.. మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది. స్వదేశంలో ఇంగ్లండ్‌(India vs England)తో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడనుంది. జనవరి 22న టీ20తో మొదలై.. ఫిబ్రవరి 12న మూడో వన్డేతో ఈ సిరీస్ ముగియనుంది.

ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ నుంచి టీమిండియాకు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ను నియమించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) హెడ్‌కోచ్‌ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

గంభీర్‌కు చేదు అనుభవాలు
ఈ క్రమంలో మరో భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌(Gautam Gambhir) ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేశాడు. గతేడాది శ్రీలంక పర్యటనతో కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీకి ఆరంభంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం 2-0తో ఓడిపోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కోల్పోయింది.

అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టుల్లో జయకేతనం ఎగురవేసిన భారత జట్టు.. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో 3-1తో ఓడి ట్రోఫీని కోల్పోయింది. ఇందుకు టీమిండియా బ్యాటర్ల వైఫల్యమే ప్రధానం కారణం.

ద్రవిడ్‌తో సితాన్షు కొటక్‌

ఈ ఘోర పరాభవాల నేపథ్యంలో బ్యాటింగ్‌కు ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. గంభీర్‌ ఏరికోరి తన సహాయక సిబ్బందికిలోకి తీసుకున్న అసిస్టెంట్‌ కోచ్‌లు అభిషేక్‌ నాయర్‌, ర్యాన్‌ డష్కాటే పని తీరుపై గుర్రుగా ఉన్న మేనేజ్‌మెంట్‌.. వారిని తప్పించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా సితాన్షు కొటక్‌
ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు కీలక విషయాలు వెల్లడించాయి. ‘‘సితాన్షు కొటక్‌ టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. త్వరలోనే అతడు జట్టుతో చేరతాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు తుది నిర్ణయం జరుగుతుంది. చాంపియన్స్‌ ట్రోఫీ కూడా రాబోతోంది. కాబట్టి బీసీసీఐ ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది.

ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు కోల్‌కతాలో మూడు రోజుల పాటు శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. అందరు ఆటగాళ్లు జనవరి 18నే రిపోర్టు చేయాల్సి ఉంటుంది’’ అని సదరు వర్గాలు తెలిపాయి.

కాగా సౌరాష్ట్ర మాజీ క్రికెటర్‌ సితాన్షు కొటక్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈ మాజీ బ్యాటర్‌.. ఇండియా-‘ఎ’ జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో చివరగా కోచ్‌గా వ్యవహరించాడు.

దేశీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు
సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహించిన సితాన్షు కొటక్‌.. 130 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 8061 పరుగులు చేశాడు. ఇక గతంలో టీమిండియా తాత్కాలిక కోచ్‌గానూ కొటక్‌ వ్యవహరించాడు. 2023లో జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్‌ పర్యటనలో భారత్‌ టీ20 సిరీస్‌ ఆడినప్పుడు అతడు జట్టుతోనే ఉన్నాడు.

కాగా రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో విక్రం రాథోడ్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. అయితే, జూలై 2024 తర్వాత ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో సితాన్షు కొటక్‌ వైపు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్లు తాజా సమాచారం.

చదవండి: ఇలాంటి కెప్టెన్‌ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్‌ శర్మపై టీమిండియా స్టార్‌ కామెంట్స్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement