
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన టీమిండియాపై క్రికెట్ అభిమానుల విమర్శలు కొనసాగుతున్నాయి. జట్టు ఎంపికలో లోపాలు, ప్రధాన బ్యాటర్ల వైఫల్యం కారణంగానే 3-1తో ఓటమి ఎదురైందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో కనీసం చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకైనా సరైన జట్టును ఎంపిక చేయాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు.
ఐదు శతకాలు.. కరుణ్ నాయర్ రికార్డుల మోత
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఆరు ఇన్నింగ్స్‌లో ఐదు శతకాలు బాదిన ౩౩ ఏళ్ళ ఈ ఆటగాడు సంచలనాత్మక ఫామ్‌తో దుమ్మురేపుతున్నాడు. తన కెరీర్ లోనే అద్భుతమైన ఫామ్‌తో టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) టోర్నమెంట్లో అతడిని ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
కాగా కరుణ్ నాయర్ చివరగా ఏడేళ్ల క్రితం టీమిండియాకు ఆడాడు. ఇక విజయ్ హజారే టోర్నమెంట్ లో తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో 122*, 112, 111, 163*, 44* మరియు 112* స్కోర్లతో అతడు ఇటీవల రికార్డు నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులకు అవుట్ కావడానికి ముందు, నాయర్ వరుసగా ఆరు ఇన్నింగ్స్ లో అజేయంగా నిలిచి 542 పరుగులు సాధించి 'లిస్ట్ ఎ' టోర్నమెంట్లలో రికార్డును సృష్టించాడు.
న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ సాధించిన 527 పరుగుల నాటౌట్ రికార్డును నాయర్ తిరగ రాశాడు. కెప్టెన్ నాయర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో విదర్భ సెమీఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
నాయర్ అద్భుతమైన ప్రదర్శన మరోసారి అతని పేరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాయర్‌ను మళ్ళీ భారత్ జట్టులోకి తీసుకోవాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.
ఇందులో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉండడం గమనార్హం. ఇంగ్లండ్‌తో 2016లో చెన్నై లో జరిగిన టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత నాయర్.. మరో మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు.
ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. “నేను నాయర్ గణాంకాలను పరిశీలిస్తున్నాను. 2024-25లో అతడు ఆరు ఇన్నింగ్స్‌లు ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా నిలిచాడు, 120 స్ట్రైక్ రేట్‌తో 664 పరుగులు చేశాడు.
అయినా నాయర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయడం లేదు. ఇది అన్యాయం” అని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు. కాగా 2024లో నాయర్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కూడా రాణించాడు. 44.42 సగటుతో 1,466 పరుగులు సాధించాడు.
అందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి, వీటిలో 202* అత్యధిక స్కోరు ఉంది. ఇది కాక నాయర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్‌తో ఆడి ఏడు మ్యాచ్‌ల్లో 48.70 సగటుతో 487 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
రోహిత్, కోహ్లీలను రంజీలు ఆడమంటున్నారు.. కానీ
"చాలా మందిని కేవలం రెండు ఇన్నింగ్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరికొందరిని ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. కానీ జట్టు ఎంపికలో నాయర్ విషయంలో నియమాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి?
రోహిత్(Rohit Sharma), కోహ్లీ ఫామ్‌లో లేని విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇందుకోసం వారిద్దరూ మళ్ళీ రంజీ ఆడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ రంజీ ఆడుతూ పరుగులు చేస్తున్న వారిని ఎందుకు (సెలెక్టర్లు) విస్మరిస్తున్నారు?
ట్రిపుల్ సెంచరీ తర్వాత నాయర్ ని ఎలా తొలగించారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. అతనిలాంటి ఆటగాళ్ల గురించి ఎవరూ మాట్లాడకపోవడం బాధాకరం. ఒకొక్క ఆటగాడికి ఒక్కొక్క నియమాలు" ఉన్నాయని హర్భజన్ వ్యాఖ్యానించాడు. "నాయర్ భారత్ జట్టుతో ఇంగ్లండ్‌కు వెళ్ళాడు కానీ అతనికి తుది జట్టులో చోటు దొరకలేదు.
అందుకే మీరు అతడిని పక్కన పెడుతున్నారా?
ఐదవ టెస్ట్ కోసం టీం మేనేజిమెంట్ వాస్తవానికి భారత్ నుండి ఒక ఆటగాడిని పిలిపించింది. బహుశా అతను హనుమ విహారి అని అనుకుంటున్నాను. అతను నాయర్‌కు బదులుగా టెస్ట్ ఆడాడు. దీనికి కారణం నాకు చెప్పండి. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు నియమాలు... అలా ఉండకూడదు. ఎవరు పరుగులు చేస్తే మీరు అతన్ని ఆడించాలి.
అతని (నాయర్)కి టాటూలు లేవు, ఫ్యాన్సీ బట్టలు వేసుకోడు. అందుకే మీరు అతన్ని ఎంచుకోలేదా? మరి అతను కష్టపడి పరుగులు సాధించడంలేదా?" అని హర్భజన్ ప్రశ్నించాడు.
కాగా ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అయిదు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-౩ తేడాతో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. మరోపక్క పేలవమైన ఫామ్‌తో ఈ పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై రంజీ మ్యాచ్ సన్నాహక క్యాంపు కి హాజరయ్యాడు.
అయితే, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఢిల్లీ తరఫున రంజీల్లో బరిలోకి దిగే అంశంపై నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో భజ్జీ ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment