ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమైంది. ఇంగ్లండ్(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఇరుజట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలుకానుంది.
ఈ సిరీస్‌తో షమీ రీఎంట్రీ
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే టీ20 సిరీస్‌కు తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సుదీర్ఘ కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు.
స్టార్ క్రికెటర్లు దూరం
వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. దాదాపు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీ20లకు యశస్వి జైస్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు.
బ్యాటర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ చోటుదక్కించుకోగా.. వికెట్ కీపర్ల కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా.. బౌలింగ్ విభాగంలో పేసర్లు మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతో పాటు.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి స్థానం సంపాదించారు.
శివం దూబేకు దక్క ని చోటు
అయితే, ఈ జట్టులో భారత ఆల్‌రౌండర్, విధ్వంసకర వీరుడు శివం దూబే(Shivam Dube)కు మాత్రం చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు.. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు దంచికొట్టాడు. అయినప్పటికీ సెలక్టర్లు దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును విమర్శించాడు. ‘‘శివం దూబేకు ఏమైంది? నిజానికి రుతురాజ్ గైక్వాడ్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో తన బ్యాటింగ్ స్థానం(ఓపెనర్) దృష్ట్యా అతడిని ఎంపిక చేయడం వీలుకాకపోవచ్చు.
అలాగే రజత్ పాటిదార్‌కు కూడా మొండిచేయి ఎదురైంది. కానీ.. శివం దూబేను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదు. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
టీ20 ప్రపంచకప్ చాంపియన్‌ను ఎందుకు సెలక్ట్ చేయలేదు?
కాబట్టి జట్టు గెలిచినపుడు.. జట్టులోని ప్రతి సభ్యుడికి తమ క్రెడిట్ ఇవ్వాలి. వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లలో ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయంలో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత అతడు అన్నీ సరిదిద్దుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చాంపియన్ అయ్యాడు.
అయినా.. ఎందుకు అతడిని టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు?’’ అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో దూబే 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు సాధించాడు.
ఇదిలా ఉంటే.. టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారూ జట్టు చేతిలో 3-1తో ఓడి.. పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది.
చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment