![CT 2025: Shreyas Iyer Resilience could boost India Prospects](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Shreyas-Iyer.jpg.webp?itok=P_9WljoD)
చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy 2025)కు ముందు ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్ విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కి సంతృప్తిని మిగిల్చింది. విజయానంతరం మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌లో మేము ఏదైనా పొరపాటు చేశామని నేను భావించడం లేదు. అయితే జట్టు సమిష్టిగా మరింత మెరుగ్గా ఆడాలని నేను భావిస్తున్నాను.
ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలున్నాయి. తప్పకుండా జట్టు మరింత మెరుగ్గా ఆడాలని నేను కోరుకుంటున్నాను" అని రోహిత్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.
అయ్యర్ అద్భుత ఫామ్
వాస్తవానికి... ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ అన్ని విధాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డే నుంచి వైదొలగడంతో.. తుదిజట్టులోకి వచ్చాడు అయ్యర్. అద్భుత రీతిలో రాణించి మరోసారి టీమిండియా మిడిలార్డర్‌కు వెన్నెముక గా నిలిచాడు.
ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ వంటి అగ్రశ్రేణి పేస్ బౌలర్లున్నారు. వారిని ఎదుర్కొని రాణించడం ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనుగుణంగా తన స్టాన్స్ ని కూడా మార్పు చేసుకొని అయ్యర్ తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించాడు. అయ్యర్ ఫామ్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టుకి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.
భారత్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అయ్యర్ పై మిడిల్ ఓవర్లలో నిలకడగా పరుగులు సాధించాల్సిన బాధ్యత ఉంటుంది. గతం లో 2023 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన అయ్యర్ తర్వాత అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత గాయాల కారణంగా గత సంవత్సరం ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో తన కేంద్ర కాంట్రాక్టును కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
చలించని దృఢ సంకల్పం
అయితే అయ్యర్ దృఢ సంకల్పం ఎప్పుడూ చలించలేదు. దేశవాళీ వైట్-బాల్ టోర్నమెంట్లలో నిలకడగా రాణించి 188.52 స్ట్రైక్ రేట్‌తో 345 పరుగులతో, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ లో ఐదు ఇన్నింగ్స్‌లలో 131.57 సగటుతో 325 పరుగులు చేశాడు.
కేవలం ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. దేశవాళీ టౌర్నమెంట్లలో మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి వన్డేలో కోహ్లి గాయంతో ఇలా కీలకమైన బ్రేక్ దొరికింది. దాంతో చెలరేగిపోయిన అయ్యర్ జట్టుకి తన అవసరం ఎలాంటితో చూపించి సత్తా చాటుకున్నాడు.
ఇంగ్లండ్‌పై అద్భుతమైన ప్రదర్శన
ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తో విజయం సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో వరుసగా 59 పరుగులు (తొలి వన్డే) , 44 (రెండో వన్డే), 78 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ గాయపడిన కారణంగానే తాను ఈ సిరీస్ లోని తొలి వన్డే లో ఆడగలిగానని అయ్యర్ వెల్లడించాడు. అయితే ఆ అవకాశాన్ని అయ్యర్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.
అందుకే కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అయ్యర్ స్థానం జట్టులో పదిలంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 78 పరుగులతో అయ్యర్ వన్డేల్లో తన 20వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అయ్యర్ ఐదు సెంచరీలు కూడా చేసాడు. మొత్తం 65 వన్డేల్లో 48.18 సగటుతో 2,602 పరుగులు సాధించాడు.
ఇక 2023 ప్రపంచ కప్ లో అయ్యర్ అద్భుతంగా రాణించి 66.25 సగటుతో 113.24 స్ట్రైక్ రేట్‌తో 530 పరుగులు చేశాడు. ఇంతటి అపార అనుభవం ఉన్న అయ్యర్ మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ బ్యాటింగ్‌ను నిలువరించడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికైన విషయం కాదు.
చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment