ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా పరాజయం చవిచూసిన భారత్ జట్టు తిరిగి గాడిలో పడటం శుభపరిణామం. ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్టు పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం సానుకూలాంశం. కొత్త సంవత్సరంలో అదీ ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.
అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. సొంత గడ్డపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోవడం భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లో భారత్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ జట్టు 3-1 తేడాతో ఓటమి పాలయింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ఘోర వైఫల్యంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని, భారత్ జట్టు క్యాంప్ లో విభేదాలు తలెత్తాయని , కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ ఒకే పేజీలో లేరని విమర్శలు కూడా వచ్చాయి.
టీ20ల్లో అద్భుతమైన ఫామ్
ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తోంది. 2024 ప్రారంభం నుంచి భారత్ జట్టు 29 మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి చవిచూసింది.
ఏదేమైనా.. గంభీర్ తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ సిరీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ జట్టుకి ఓడిపోతామనే భయం లేదు. మేము అధిక-రిస్క్, అధిక-రివార్డ్ క్రికెట్ ఆడతాం. ప్రతీసారి 250 పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు 130 పరుగులకే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని వ్యాఖ్యానించాడు.
రోహిత్, కోహ్లీతో అభిప్రాయభేదాలు?
అయితే భారత్ టి20 ఫార్మాట్ రికార్డును అటుంచితే , వన్డే , టెస్ట్ ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ఇక గురువారం నుంచి ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ భారత్ కి ఎంతో కీలకం. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నారు.
వన్డే క్రికెట్‌లో వారిద్దరికీ అపారమైన నైపుణ్యం ఉందని, గంభీర్ అన్నాడు. వారిద్దరితో ఆస్ట్రేలియా పర్యటన లో అభిప్రాయభేదాలు తలెత్తయన్న పుకార్లకు చెక్ పెడుతూ, "వారిద్దరు ఎంతో అనుభవం ఉన్నవారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం ప్రారంభించిన తర్వాత, విషయాలు సరిగ్గా జరగడం ప్రారంభిస్తాయి" అని గంభీర్ ఆ పుకార్లను కొట్టి పారేసాడు.
అభిషేక్‌పై ప్రశంసలు
కోచ్ గంభీర్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సాధించిన సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు."నేను ఇలాంటి టి20 సెంచరీని ఇంతవరకు చూడలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి హేమాహేమీలైన బౌలర్లు ఎదుర్కొని అలా అలవోకగా షాట్ లు కొట్టడం సామాన్య విషయం కాదు. ఐపీఎల్ లో మీరు చాలా సెంచరీలు చూసి ఉండవచ్చు.
కానీ ఇంగ్లండ్ వంటి జట్టు పై ఆ స్థాయి లో షాట్లు కొట్టి అభిషేక్ సెంచరీ సాధించాడు. అందుకే నేను చూసిన వాటిలో ఇది అత్యుత్తమైన టీ20 సెంచరీగా భావిస్తున్నాను" అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment