
టి20 ఫార్మాట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ
ఐఓసీ ప్రకటన
న్యూఢిల్లీ: లాస్ ఏంజెలిస్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ క్రీడాంశంపై మరింత స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో పురుషుల విభాగంలో ఆరు, మహిళల విభాగంలో ఆరు దేశాలకు చెందిన క్రికెట్ జట్లు బరిలోకి దిగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. టీమ్‌లో 15 మంది చొప్పున ఒక్కో విభాగంలో 90 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్ తర్వాత 128 ఏళ్లకు మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అవకాశం దక్కింది.
మ్యాచ్‌లన్నీ టి20 ఫార్మాట్‌లోనే జరగనున్నాయి. అయితే ఏ ఆరు జట్లు పాల్గొంటాయనే విషయంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో పూర్తి స్థాయి సభ్యదేశం కాకపోయినా... ఆతిథ్య జట్టుగా అమెరికాకు క్రికెట్ పోరులో అవకాశం దక్కడం ఖాయం. అంటే మరో ఐదు జట్లు మాత్రమే ఒలింపిక్స్‌కు అర్హత సాధించవచ్చు.
ఏదైనా కటాఫ్ తేదీని నిర్ణయించి ఆ సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–5లో ఉన్న జట్లను ఒలింపిక్స్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వెస్టిండీస్ టీమ్ అర్హత సాధిస్తే ఏ దేశం బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. క్రికెట్‌లో వెస్టిండీస్ పేరుతో కరీబియన్ ద్వీపంలోని వేర్వేరు దేశాలు కలిసి ఆడుతున్నాయి.
సాధారణంగా ఒలింపిక్స్‌లో మాత్రం ఈ దేశాలన్నీ విడిగా పోటీ పడతాయి. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు నిర్వహించినప్పుడు బార్బడోస్ టీమ్ ప్రాతినిధ్యం వహించింది. విండీస్ రీజియన్ పోటీల్లో విజేతగా నిలవడంతో ఆ జట్టుకు అవకాశం లభించింది.
మొత్తం 351 మెడల్ ఈవెంట్లు...
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు మరో నాలుగు కొత్త క్రీడాంశాలకు చోటు లభించింది. బేస్‌బాల్/ సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్‌లను కొత్తగా చేర్చారు. పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 329 మెడల్ ఈవెంట్లు ఉండగా... ఇప్పుడు మరో 22 జత కలవడంతో ఈ సంఖ్య 351కి చేరింది. స్విమ్మింగ్‌లో గరిష్టంగా 41 పతకాలు అందుబాటులో ఉన్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి పురుష అథ్లెట్ల సంఖ్య (5,167)తో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో మహిళా అథ్లెట్లు (5,333) బరిలోకి దిగనున్నారు.
ఫుట్‌బాల్‌లో 12 పురుష జట్లు ఉంటే 16 మహిళా టీమ్‌లు ఉంటాయి. గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, కాంపౌండ్ ఆర్చరీలలో తొలిసారి మిక్స్‌డ్ టీమ్‌లు ఉండబోతున్నాయి. అథ్లెటిక్స్‌లో కూడా మొదటిసారి 4్ఠ100 మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌ను చేర్చారు. ఓవరాల్‌గా అథ్లెట్ల సంఖ్య మాత్రం ఎప్పటిలాగే 10,500 ఉండనుంది.