ముంబై: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఓటింగ్ లాంఛనం పూర్తయితే 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తుంది. మరోవైపు బాక్సింగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యపై ఐఓసీ వేటుకు సిద్ధమైన నేపథ్యంలో బాక్సింగ్‌ను ఒలింపిక్స్‌లో కొనసాగించాలనే నిర్ణయాన్ని నిలిపివేసింది. మరోవైపు కొత్తగా కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌ను చేర్చాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది.
2028లో అమెరికా నిర్వహించనున్న ఈ విశ్వక్రీడల కోసం క్రికెట్ సహా మరో నాలుగు క్రీడలు బేస్‌బాల్–సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోసి (సిక్సెస్), స్క్వాష్ ఆటలు చేర్చే ప్రతిపాదనల్ని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఆమోదించింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. దీంతో కేవలం లాంఛనప్రాయమైన ఓటింగ్ మాత్రమే మిగిలుంది. ముంబైలో ప్రస్తుతం జరుగుతున్న ఐఓసీ సెషన్స్‌లోనే ఆ లాంఛనం కూడా ఆదివారం పూర్తి కానుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ అమోదం లభించడంతో ఓటింగ్‌లో ఏ సమస్య ఎదురవదు. మెజారిటీ ఓట్లు ఖాయమవుతాయి.
‘విశ్వవ్యాప్తంగా క్రికెట్ విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్ అందర్ని అలరిస్తుంది. వన్డే ప్రపంచకప్ అయితే ఏళ్ల క్రితమే విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌కు క్రికెట్ దగ్గరైంది’ అని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ అన్నారు. ఆదివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయితే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో టి20 ఫార్మాట్‌లో క్రికెట్ నిర్వహిస్తారు. చివరిసారి 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించారు. ఆ తర్వాత క్రికెట్‌ను విశ్వ క్రీడల నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment