టెస్టుల్లో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు?... ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన, రోహిత్ శర్మ(Rohit Sharma) వైఫల్యం నేపథ్యంలో ఈ ప్రశ్న తెర మీదకు వచ్చింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు కంగారూ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఓటమిభారంతో ఇంటిబాట పట్టింది.
దాదాపు పదేళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను భారత జట్టు ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ఇక ఆసీస్‌తో తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి తనంతట తానుగా తప్పుకొన్నాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా జట్టుకు భారంగా మారడం ఇష్టం లేక తుదిజట్టు నుంచి స్వయంగా వైదొలిగాడు.
నాయకుడిగా బుమ్రా సఫలం!
ఈ రెండు సందర్భాల్లోనూ పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. పెర్త్‌లో 295 పరుగుల తేడాతో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఐదో టెస్టులో మాత్రం జట్టును గట్టెక్కించలేకపోయాడు. అయితే, సిరీస్ ఆసాంతం జట్టు భారాన్ని తన భుజాలపై మోసిన బుమ్రా.. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు.
గాయం వల్ల జట్టుకు దూరమయ్యే పరిస్థితి
ఫలితంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20, వన్డేలతో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి కూడా బుమ్రా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ పర్యటన తర్వాత రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ గురించి ప్రచారం ఊపందుకుంది. అతడి వారసుడిగా బుమ్రా పగ్గాలు చేపడతాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వవద్దు
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. బుమ్రాను టెస్టు కెప్టెన్ చేయవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి అతడు విజ్ఞప్తి చేశాడు. ‘‘జస్‌ప్రీత్ బుమ్రా సమీప భవిష్యత్తులో కెప్టెన్సీ చేపట్టబోతున్నాడా? రోహిత్ శర్మ వారసుడిగా అతడిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు.
ఎందుకంటే.. జట్టు భారం మొత్తాన్ని మోస్తూ.. టీమ్ కోసం ప్రాణం పెట్టి మరీ పోరాడగల ఏకైక బౌలర్ అతడే. మిగతా పేసర్ల నుంచి అతడికి పెద్దగా సహాయం అందడం లేదు. కాబట్టి బుమ్రాపైనే అధిక భారం పడుతోంది. అందుకే అతడు గాయపడుతున్నాడు.
పంత్ లేదంటే రాహుల్ బెటర్
అందుకు తోడు కెప్టెన్సీ భారం పడితే ఇంకా కష్టం. కాబట్టి బుమ్రాను అస్సలు కెప్టెన్‌గా నియమించవద్దు. అతడికి బదులు బ్యాటర్‌ను సారథిగా ఎంపిక చేస్తే బాగుంటుంది. రిషభ్ పంత్ లేదంటే.. కేఎల్ రాహుల్‌ను టెస్టులకు కెప్టెన్ చేయాలి. వాళ్లిద్దరికీ ఐపీఎల్‌లో సారథులుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్లిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం అనిపించుకుంటుంది’’ అని మహ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.
అలా చేస్తే తిప్పలు తప్పవు
‘‘బుమ్రాను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అతడు ఫిట్‌గా ఉండి.. వికెట్లు తీయడంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
అంతేకానీ.. నాయకత్వ భారం కూడా మోపితే గాయాల బెడద వేధించడం ఖాయం. తన అద్భుతమైన కెరీర్‌కు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి.. బంగారు గుడ్లు పెట్టే బాతును చంపకండి’’ అని కైఫ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.
చదవండి: BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..!
Comments
Please login to add a commentAdd a comment